నీ తలపులలో

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

నీ తలపులలో

రచన: వాడపర్తి వెంకటరమణ

వెన్నెల పుష్పం విచ్చుకుందేమో
పుడమంతా పిండారబోసినట్లుంది
ఆకాశంలో ఏరుకొచ్చిన తారల్ని
గుప్పెట్లోంచి సుతారంగా విడుస్తూ
వాకిట్లో చుక్కల ముగ్గేస్తోంది ఆమె!

అప్పుడప్పుడు నాపైకి విసురుతున్న
వాలుచూపుల వాడైన బాణాలు
నా మనో మందిరంలోకి చొచ్చుకుపోయి
విచ్చలవిడిగా చిచ్చురేపుతుంటే
ఆగి ఆగి ఊగుతున్న ఆమె వాలుజడ
హృదయ ఫలకంపై చిత్రంగా చేరి
మధుర స్వప్నంలో తేలియాడిస్తుంది

ఆమె తలపుల తలుపులు తెరిచినప్పుడు
మదిలో ఊహలు గుసగుసలాడి
మనసంతా మల్లెల వనమైపోతుంది
నిద్దురకు రెక్కలొచ్చి ఎటో ఎగిరిపోయి
ఆ రేయంతా జాగారమే అవుతుంది!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!