ఓటమి నేర్పిన పాఠం

ఓటమి నేర్పిన పాఠం

రచన: రాయల అనీల

చిన్నప్పుడు నడక  నుండి బాల్యంలో ఆటల  నుండి విద్యార్థి దశలో మార్కుల నుండి యవ్వనపు దశలో ప్రేమ నుండి ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల నుండి ఎన్నో దశలలో, ఎన్నో రకాలుగా తెలిసో తెలియకో ఓడినా దాని నుండే పాఠం నేర్చుకుని విజయం వైపు అడుగులు వేస్తాం…. కానీ జీవితంలోనే ఓడిపోతే…..

“నా పేరు అజయ్….. మా ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు ,మా అమ్మానాన్న ఉండేవాళ్ళమేమో కానీ ….. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి… రెవెన్యూ డిపార్ట్మెంట్ లో

ఆ ఉద్యోగం సాధించడానికి నేను ఎన్ని సార్లు ఓడిపోయానో నాకే తెలుసు……

‘నీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి ‘ అని మా అమ్మానాన్నలు నా చిన్నప్పుడే నా భవిష్యత్తు ను నిర్దేశించి వాళ్ళ కోరికను నా కోరిక గా మలిచారు…. వాళ్ళ కోరికనే నా లక్ష్యం గా చేసుకుని ఇంటికి దూరంగా ఇష్టం లేకపోయినా హస్టల్స్ లో  ఉంటూ అమ్మానాన్నల కోరికను నేరవేర్చడానికి అహర్నిశలు కష్టపడి ఎన్నో సార్లు ఓటమే నన్ను పలకరించినా దాని నుండే పాఠం నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాను……

అమ్మానాన్నల కళ్ళల్లో ఆనందం….. ఆ ఆనందం చూసి నేను పడ్డ కష్టం నాకు సంతోషాన్నీ ఇచ్చింది….. రోజులు ప్రశాంతంగా గడుస్తుండగా  అమ్మానాన్నలు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు……

కొన్ని రోజులకే ఒక సంబంధం కుదిరింది అని నా నిర్ణయం చెప్పమని అడిగారు మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను…. సంతోషంగా పెళ్లి జరిపించారు ఇప్పటివరకు ముగ్గురు ఉంటున్న ఇంట్లో నాలుగో వ్యక్తిగా నా భార్య వచ్చింది….

రోజులు ఆనందంగా గడుస్తున్నా నా భార్య ముఖంలో మాత్రం పెళ్లయినప్పుడు ఉన్న కళ ,ఆనందం ఆ తర్వాత  లేవు…. ఎప్పుడూ చిరాకు, అసహనం మెదులుతున్నాయి

ఏమడిగినా చిరాకుగా సమాధానమిచ్చేది …..

చాలా రోజులు ఇలానే జరిగిన తర్వాత ఒకరోజు విషయం ఏమిటి అని నిదానంగా అడిగాను నేను…. తను చెప్పిన సమాధానం విన్నతర్వాత  క్షణకాలం పాటు కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది……

తన సమాధానం…. తనకి నా చాలీచాలని జీతం సరిపోవట్లేదు అని …. తను ఏదేదో ఊహించుకుని ,ఎంతో విలాసవంతమైన జీవితం కోసం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న నన్ను చేసుకున్నాను అని ….. ఇక్కడ అటువంటి సౌకర్యాలు ఏమీ లేకపోగా వచ్చిన జీతం తోనే నలుగురు బ్రతకాలి అని, నేను అనుకున్న జీవితం ఇది కాదు అని నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మొండిగా తన పుట్టింటికి వెళ్లి పోయింది……

నచ్చజెప్పాల్సిన మా అమ్మానాన్నలు కూడా తన నిర్ణయమే కరెక్ట్ అని సమర్థించి ….తప్పంతా నాదేనని ఇకనైనా మారాలని హితవు పలికారు

నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు…… ఉన్నంతలో హాయిగా, అపురూపంగా చూసుకుంటున్న నా భార్య కి నా కన్నా నా ఉద్యోగమే ఎక్కువైందా …… లంచం తీసుకుంటేనే మళ్ళీ కాపురానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయిన తనని ఏమని అర్థం చేసుకోవాలి…..

నాకు నా భార్య అంటే ప్రాణం…… కానీ నేను అన్యాయంగా ఏదీ చేయలేను…… లంచం తీసుకొవడం నేరం ….అదీ ఒక మనిషిని హత్య చేసిన దానితో సమానం

అటువంటి తప్పు నేను చేయలేను….. ఈనాడు తన కొసం తప్పు చేస్తే రేపు నా పిల్లలు నా నుండి అదే నేర్చుకోని మరికొందరికి అన్యాయం చేస్తే

లేదు లేదు నేను ఇలాగే ఉంటా…. నా లానే ఉంటా

నా సమాధానానికి తన సమాధానంగా విడాకుల నోటీసులు పంపించింది……

కొడుకుగా తల్లి తండ్రుల మాట వినలేదు, భర్త గా భార్య ఇష్టాన్ని నేరవేర్చలేక పోయాను
చిన్నప్పటి నుండి అన్నిటిలో విజయం సాధించినా ఆఖరికి జీవితంలో ఓడిపోయాను

ఆ క్షణం నాకు బాధనిపించలేదు ….. ఆ ఓటమి నాకు సంతోషాన్ని కలిగించింది

ఇది జరిగి పది సంవత్సరాలు అవుతుంది …..

ఆ రోజు నా భార్య నన్ను అర్ధం చేసుకొని ఉండి ఉంటే ఈ రోజు మా ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు ,మా అమ్మానాన్న ఉండేవాళ్ళం ………

ఈ ఓటమి ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే
బంధాలకు బందీలయ్యి….. అక్రమ మార్గం లోకి వెళ్ళకూడదు ….. వెళ్ళను కూడా… నా ప్రాణం ఉన్నంతవరకూ

@@@@@

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!