వర్షంలో మా ప్రయాణం

వర్షంలో మా ప్రయాణం

రచన: సావిత్రి కోవూరు 

“అమ్మమ్మా ఒక కథ చెప్పవా” అన్నారు నా మనవడు శ్రేయస్స్, మనవరాలు శ్రియా ఒక రోజు నా దగ్గర కూర్చుని.

“నేనేమీ కథలు చెప్పనూ. మీరే బోలెడన్ని కథల పుస్తకాలు చదువుతారు” అన్నాను.

“మేము పుస్తకాల్లో చదివే కథలు కావు. నీ లైఫ్ లో రియల్ గా జరిగిన చిన్నప్పటి కథలు ఉంటాయి కదా. ఆ కథలు చెప్పు” అన్నారు.

“సరే అయితే వినండి నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటననే కథగా చెప్తాను వినండి.” అని నా గతం లోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాను.

“మా చిన్నప్పుడు మా అమ్మ మా చిన్నన్నయ్య వాళ్లు  పొలాలు వ్యవసాయం ఉండడంవల్ల ఊరిలో ఉండే వాళ్ళు. మేము సెలవులకు ఊరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఫోన్స్ ఉండేవి కావు. మా ఊరికి బస్సులు ఉండేవి కావు. ఒక ప్రైవేట్ బస్సు పొద్దున జడ్చర్ల నుండి షాద్ నగర్ కు  ఒక్క సారి వచ్చి వెళ్ళేది. వర్షం పడితే అది కూడా నడిచేది కాదు.

ఊరు చుట్టూ వాగులు. ఏ దారిలో వెళ్ళినా వాగు దాటక తప్పదు. అప్పుడు ప్రయాణం చేయాలంటే ఇరవై రోజులు ముందు ప్లాన్ చేసుకోవల్సిందే. ఎందుకంటే హైదరాబాదులో మేము బస్సు ఎక్కి ‘తలకొండపల్లి’ అనే ఊరిలో దిగితే, అక్కడి నుండి మా ఊరు పన్నెండు కిలోమీటర్లు. అక్కడికి మా అన్నయ్య బండి పంపితే వెళ్ళేవాళ్ళం.

రెండవది కాచిగుడా లో రైలెక్కి మా అక్క వాళ్ళ ఊరు బాలానగర్ వెళ్లి, అక్కడి నుండి బండిలో ఇరవై రెండు కిలోమీటర్లు మా ఊరికి వెళ్లాల్సి ఉంటుంది.

ఎక్కడి నుండి వెళ్ళాలన్నా ఇరవై రోజుల ముందే  లెటర్ వ్రాస్తే, పోస్ట్ మ్యాన్ దయపై మా ప్రయాణం ఆధారపడి ఉండేది. లెటరు ఏ వారం రోజులకో ఇంటికి చేరేది. ఒక్కొక్కసారి అసలు చేరేది కాదు.  మా అన్నయ్యకి లెటర్ చేరి మా అన్నయ్య నుండి బండి పంపిస్తున్నాను రండి. ఫలానా రోజు, అని జవాబు వస్తేనే మేము  బయలుదేరాలి అన్నమాట.

ఆ విధంగా ఒక దసరా సెలవులకు మా అక్క ఊరికి బాలానగర్ ఫలాన రోజు వస్తున్నాము అని మా అన్నయ్యకి కార్డు రాశాం. ఆ రోజు బండి పంపుతామని, అక్కడి నుండి జవాబు వచ్చిన తర్వాత బయల్దేరాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసుకొనే సరికే బుర్ఖ బండి వచ్చి ఉన్నది. ఆ బండి తో పాటు ఇద్దరు జీతగాళ్లు తప్పనిసరి ఉండే వాళ్ళు. బుర్ఖబండి అంటే చెక్కతో పెద్ద బాక్స్ చేసి పైన వెదురుతో అల్లిన చాప లాంటిది పైన ‘డోమ్’ లాగ ఎండ, వాన లోపలికి పడకుండ ‘ఫిక్స్’ చేసేవాళ్ళు. ఆ బాక్స్ లో నలుగురు ఈజీగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. దానిలో కొంత ఎండు గడ్డిని పరిచి దాని పైన ఒక జంపు కానాను వేస్తారు కూర్చోవడానికి వీలుగ.

మా ఊరిలో ఇంట్లో పనిచేసే ఒక అతని కూతురి అత్తగారిల్లు కూడా, మా అక్క వాళ్ళ ఊరు పక్కనే. ఆ అమ్మాయి నెల రోజుల బాలింత. కనుక మా బండి ఎప్పుడు బాలానగర్ వస్తుందా, అని ఎదురు చూసి మాతోపాటు తన కూతురిని తీసుకురావచ్చని ప్లాన్ చేసుకున్నాడు వాళ్ళ నాన్న. మేము బాలానగర్ వెళ్ళే సరికి ఆ అమ్మాయి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి, నెల రోజుల చంటి పిల్లతో ఎదురుచూస్తోంది.

నేను, మా అక్క, మా చెల్లి, ఆ అమ్మాయి నెల రోజుల పసిపిల్లతో బయల్దేరాము. కొంతదూరం వచ్చేసరికి మెల్లగా వర్షం మొదలైంది. మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. దారికి అటు ఇటు పెద్ద పెద్ద గుట్టలు. ఆ గుట్టల పక్క నుంచి రాళ్ళు, ఇసుకతో  నిండిన గతుకుల బాటగుండా వెళ్లాలి. ఆ గుట్టలలో దొంగలు ఉంటారని, చీకటి పడితే ఆ దారిలో వెళ్ళే ప్రయాణికులను దోచుకుని, గాయపరుస్తారని మాకు తెలుసు.

మేము మా అక్క వాళ్ళ ఊరు నుండి బయలుదేరే సరికే చాల ఆలస్యం అయ్యింది.  ఆ గుట్టల దగ్గరికి వచ్చేసరికి మసక చీకటి ముసురుతున్నది. వర్షం కూడా పడుతుంది. ఆ గుట్టల దగ్గరకు వచ్చేసరికి మేమందరం దొంగల భయానికి మాటలు మానేసి భయం భయంగా చూస్తున్నం. అయినా ఎడ్లకు కట్టిన గంటల శబ్దం వినబడుతుంది. ఆ అర కిలోమీటరు దాటే వరకు ఊపిరి బిగపట్టి దేవుళ్లను తలుచుకుంటూ కూర్చున్నాము.

ఆ ప్రమాద స్థలం దాటే సరికి. చుట్టూ చిమ్మచీకటి. మొత్తం నాలుగు గంటల ప్రయాణం. ఒక గంట గడిచింది. పైన వర్షం ఉదృతంగా పడుతుంది. బండి పైన కవర్ ఉన్న వర్షపు జల్లు లోపలికి పడి మా బట్టలన్ని తడిసిపోయినాయి. ఎడ్లు చలికి వానజల్లు కు చాల మెల్లగా నడుస్తున్నాయి.

అలాగా ఇంకొక గంట ప్రయాణించిన తర్వాత మినుకు మినుకు మని దూరంగా దీపాలు కనిపించేసరికి, ప్రాణం లేచి వచ్చింది. పెద్ద రేవల్లి అనే ఊరు దాటుకుంటు వెళ్తున్నాము. ఆ కాలంలో టీవీలు లేవు, కనుక ఊళ్లో పొలం పనులు నుండి వచ్చిన జనాలు భోజనాలు చేసి ఏడున్నరకే పడుకునేవారు. వీధుల్లో గాని, ఊరిలో గాని మనుషులు ఎవరు కనిపించట్లేదు.

వర్షం విపరీతంగా కురుస్తోంది. పాపం మాతోపాటు ఉన్న ఆ బాలింత, పాప చలికి వణుకుతూ ఉన్నారు. ఇంకొక గంట అలాగే నానుతూ చిమ్మ చీకటి లో ప్రయాణించే సరికి చిన్న రేవల్లి అనే ఊరు దగ్గర ఒక పెద్ద వాగు దాటవలసి ఉంటది. వర్షం లేని రోజుల్లో చీకటి పడక ముందే అక్కడకు చేరితే అక్కడ ఆగి తెచ్చుకున్న చిరుతిండ్లు, పండ్లు తిని వాగు పక్కన ఇసుకలో చెలిమలు తవ్వి (ఇసుకలో గుంట తవ్వితె నీళ్ళు ఇసుకతో వడగట్టి శుభ్రమైన నీళ్ళు ఊరుతాయి ) తాగేసి వెళ్ళే వాళ్ళము.కాని ఇప్పటి పరిస్థితి వేరు. చుట్టు చిమ్మచీకటి,పేద్ద వర్షము,బండి క్రింద ఉధృతంగా పారుతున్న వాగు. నీళ్లు ఎంత లోతుగా  ఉన్నాయో తెలియట్లేదు. బండితో పాటు వచ్చిన మనిషి కర్రతో ఆ నీళ్ల లోతు చూస్తూ మెల్లగా గా ముందుకు నడుస్తూ ఉంటే, అతని వెనక బండి ప్రయాణం. కొంత దూరం వెళ్లేసరికి నీళ్ళ వేగానికి ఎడ్లు పక్క పక్క కి తూలుతూ నడుస్తున్నాయి. వాగు మధ్యకు వెళ్ళగానే అవి ఇక నడవలేమని మొరాయించాయి. ఆ వేగానికి బండి ఒకవైపు ఒరిగిపోతుంది. బండిలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ అమ్మాయిని చూస్తే మాకు జాలేస్తుంది. హాయ్ గా బండిలో పోవచ్చని వచ్చిన ఆ అమ్మాయి అనవసంగా మాతో పాటు నీటిలో మునిగి పోతదేమో అనిపించింది. ఊరి వరకు మేము వెళతామన్న నమ్మకం కోల్పోయాము. ఆ అమ్మాయి వాళ్ళది ఊర్లో మా ఇంటి  వెనకాల ఇల్లే. కాని ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేది. చిన్నప్పుడే పెళ్ళి చేశారు.

చిన్నప్పటి నుండి మా ఇంట్లో అందరి మీద ‘జోక్స్’ వేస్తు నవ్వించేది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి నవ్విస్తుండేది. అలాంటి అమ్మాయి భయంతో పసి పిల్లను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమని కూర్చుంటే ఎంతో జాలేసింది.

అందరము  ఒణికి పోతున్నం. భయం, చలి, చీకటి. అందరం గట్టిగా చేతులు పట్టుకుని కూర్చున్నము. ఇంకా ఆ రోజు చివరి రోజు అనుకున్నాము దేవుణ్ణి తలుచుకుంటు జ్ఞాపకమున్న శ్లోకాలన్ని చదివేస్తున్నం. అందరం మా అమ్మని తలుచుకుంటూ పైకి శబ్దం రాకుండ ఏడుస్తున్నం.

ఒక్క నిమిషం తర్వాత జీతగాడు గట్టిగా అధిలించగా ఎడ్లు దయతలచి ముందుకు అడుగేశాయి. ఆ వాగు దాటే వరకు నమ్మకం లేదు. మళ్లీ ఏ ప్రమాదం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాము.

వాగు అంటే అక్కడ పడ్డ వర్షమే కాదు,  పై ఊళ్ళలో ఎక్కడ వర్షం పడ్డా వర్షం నీరు వాగులో కలిసి ఉద్ధృతం పెరుగుతుంది. ప్రమాదాలు జరుగుతాయి. దానినే ‘పైవాగొచ్చింది’ అంటారు.

ఆ విధంగా ఒక గంట నరకయాతన అనుభవించి దూరంగా మా ఊరి దీపాలు కనిపించేసరికి మా ప్రాణాలు లేచివచ్చాయి. ఇంటికి వెళ్ళేసరికి, వాళ్ళు కూడ మేము ఎలా వస్తున్నామో అని దిగులుగ కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే మా అమ్మని పట్టుకొని గట్టిగ ఏడ్చేశాము.

మా చిన్నప్పుడు ప్రయాణాలు అలాగా ఉండేవి. ఇప్పుడు అదే ఊరికి కారులో గంటన్నరలో వెళుతున్నాము.

అందుకే వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు ఊళ్ళకు వెళ్లే వాళ్ళము కాదు. కానీ దసరా పండగ ఊళ్లో ఎంత బాగుంటుందో చెప్పనలవి కాదు. ఇప్పటికీ వర్షం పడింది అంటే, ఆ రోజు మేము అనుభవించిన నరకం గుర్తు వస్తుంది.

ఇది వర్షాకాలం లో నాకు జరిగిన అనుభవం.” అని మా కథ ముగించేసరికి మా మనవడు మనవరాలు, ఒక్కమాట మాట్లాడకుండ కథలో లీనమై భయంభయంగా చూస్తు “అమ్మమ్మ అప్పుడు మీకు  ఎంత భయమేసిందో కదా” అన్నారు.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!