పాస్ ఫోటో

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

పాస్ ఫోటో

రచన: కమల ముక్కు (కమల ‘శ్రీ’)

ఉదయం నాలుగు గంటలు. రింగ్ రోడ్డు మీద 120 స్పీడ్ లో వెళుతున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టి ఫ్లై ఓవర్ పై నుంచి కింద ఉన్న రోడ్డు పై పడింది. బైక్ నడుపుతున్న ప్రశాంత్ పక్కనే ఉన్న పెద్ద బండరాయిని ఢీకొనడం తో అతని తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు.

ఆరు గంటల సమయం లో అటుగా వెళుతున్న కొందరు పశువుల కాపరులు చూసి వెంటనే పోలీసులకు చెప్పడం తో వాళ్లు వచ్చి ప్రశాంత్ అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపించారు.అతని ఫోన్ కిందపడి పగిలిపోయింది. పర్స్ లో ఓ ఫోటో ఉంది చిన్న అబ్బాయి ని ఎత్తుకుని ఉన్న ఒకామే. దాని వెనకాల ఓ ఫోన్ నంబర్ ఉంది. వెంటనే ఆ నంబర్ కి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రెస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పి ఆక్సిడెంట్ కేస్ ఫైల్ చేశారు.తలకి దెబ్బ తగలడం తో డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ప్రశాంత్ ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు.

ఓ అరగంట తర్వాత కన్నీరు నిండిన కళ్లతో వచ్చిందో నలభై ఎనిమిదేళ్ల వయసున్న ఆమె.

“మీ పేరు?!.” అడిగాడు పోలీస్.

“ధరణి…”

“అతను మీకు ఏమౌతాడు?.”

“నా కొడుకు సర్…” అందామే.

“ఏం చేస్తుంటాడు?.”

“తెలీదు సర్.”

“అదేంటీ అతను మీ కొడుకు అంటున్నారు మరి ఏం చేస్తున్నాడో తెలీదా మీకూ?.” అన్నాడా పోలీస్ ఆశ్చర్యం గా.

“నిజంగా తెలీదు సర్.” అంది తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.

“అసలు మీరు తన కన్నతల్లేనా.కొడుకు ఏం చేస్తుంటాడో కూడా తేలికపోవడం ఏంటీ?.” కాస్త చిరాగ్గానే అన్నాడు పోలీస్.

“వాడికి నేను కన్నతల్లినే సర్. కానీ పెంచింది నేను కాదు. చిన్నప్పుడు వాడిని తీసుకుని తిరుపతికి వెళ్లి వస్తుండగా ట్రైన్ లో మిస్ అయ్యాడు.రైల్వే పోలీస్ లకు కప్లైంట్ ఇచ్చాము. వాళ్లు వెతికారు. అయినా లాభం లేకపోయింది.కొడుకు పోయాడన్న దిగులుతో ఆయనా చనిపోయాడు.

నా కొడుకుకి నేనంటే చాలా ఇష్టం. ఓ సారి మా ఊర్లో జాతర జరిగేటప్పుడు మా ఆయనా నేనూ, వాడూ కలిసి ఫోటో తీసుకుందాం అంటే కాదూ, కూడదు… నీతోనే తీసుకుంటాను… నాన్న వద్దు మనిద్దరి తో, అని నానా రభసా చేశాడు. దాంతో మా ఇద్దరమే తీసుకున్నాం ఫోటో.అదే ఫోటో ని వాడి జేబులో ఎప్పుడూ ఉంచుకునేవాడు. దాని వెనుక మా ఆయన సెల్ నంబర్ కూడా ఉంటుంది. ఆయన పోయినా ఆ నంబర్ మాత్రం నేను మార్చలేదు. ఎప్పుడైనా వాడు చేయకపోతాడా అన్న ఆశతో.” అని కళ్లోత్తుకుని,

“ఆ పాస్ ఫోటో నే వాడి చావుకి కారణం అయ్యింది.” అంది బాధగా.

“ఏంటీ?!.” ఆశ్చర్యంగా అడిగాడు పోలీస్.

“మా ఇద్దరం కలిసి తీసుకున్న పాస్ ఫోటో ని పేపర్ లో వేయించా ఎవరికైనా నా కొడుకు ఆచూకీ కనిపెట్టడానికి.

కానీ ఇన్నేళ్లైనా ఏ సమాచారం లేకపోయేసరికి వాడిపై ఆశలు వదులుకుని బ్రతుకున్నా. మొన్న పొద్దున్న లేచి స్నానం ముగించి దేవునికి పూజ చేసి కాఫీ తాగుదాం అనుకునేలోపు ఫోన్ మ్రోగడం మొదలైంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుని ఫోన్ ఆన్సర్ చేశా… “అమ్మా!” ఎవరో మగపిల్లాడి గొంతు.

మా స్కూల్ లో పిల్లలు కూడా నన్ను మేడమ్ అని పిలకుండా అమ్మా అనే పిలుస్తారు. అందుకే వాళ్లెవరో అని అనుకుని “హా చెప్పు నాన్నా” అన్నాను.

“అమ్మా… నేనమ్మా… నీ ప్రశాంత్ నమ్మా.” అంటూ ఏడుపు వినపడేసరికి “ప్రశాంత్… నాన్నా నువ్వేనా” అన్నాను ఆనందం ఆపుకోలేక. ఎప్పుడో వీడిపోయిన బంధం మళ్లీ ఎదురైతే ఎలా ఉంటుంది చెప్పండి. కడుపులోని ప్రేగులు మెలిపెట్టినంత బాధ. కళ్లనుండి జాలువారే కన్నీటిని ఆపుకుంటూ వింటున్నా వాడు చెప్పింది.

“నేనేనమ్మా. ఇప్పుడే పేపర్ కనిపించడం లేదు అని నువ్వు వేయించిన యాడ్ చూశాను. నేనిప్పుడు బెంగుళూర్ లో ఉంటున్నా. పని మీద ముంబై వెళ్లడానికి రైల్వే స్టేషన్ కి వచ్చాను. ఈ రైల్వే స్టేషన్ లో నువ్వు వేసిన యాడ్ అని అంటించారు. కింద ఫోన్ నంబర్ ఉంది. అలాంటి ఫోటోనే నా బీరువా లో ఉన్నట్టుగా గుర్తుకొచ్చి వెంటనే ఇంటికి వెళ్లి విషయం కనుక్కున్నా నన్ను పెంచిన వాళ్ళని.

ఓ ముప్పై ఏళ్ల వయసున్న ఆమె పిల్లలు లేని తమకి ఐదు లక్షలకి వారికి అమ్మేసింది అన్న నిజం చెప్పి , వారిద్దరూ నన్ను కన్నవాళ్లు కాదనీ, పెంచిన వాళ్లనీ చెప్పారు. నిన్ను చూడాలని ఉందమ్మా. బయలుదేరుతున్నా. రేపటికల్లా నీ ముందుంటా.” అంటూ ఫోన్ కట్ చేశాడు.

నాకు పట్టరాని సంతోషం కలిగింది. చిన్నప్పుడు వాడికి ఏమేం ఇష్టమో తెలుసు కాబట్టి అవన్నీ సిద్దం చేసే పనిలో పడ్డాను. నా కొడుకు తో గడపాలి అని స్కూల్ కి లీవ్ కూడా పెట్టేశాను. మా చుట్టుపక్కల ఉండే వాళ్లందరికీ చెప్పాను నా కొడుకు వస్తున్నాడని.ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి వస్తాడని చెప్పడం తో ఇంటికి మామిడి తోరణాలు కట్టించాను. గుడిలో వాడి పేరున అర్చన చేయించాను. కానీ ఏడింటికి వచ్చిన మీ ఫోన్ కాల్ నా సంతోషం మొత్తాన్ని ఆవిరి చేసింది.” అని చెప్పడం ముగించి భోరున ఏడ్వడం మొదలుపెట్టింది ధరణి.

అంతవరకూ ఆమె చెప్పేదంతా విన్న పోలీస్ ఆయన కళ్లల్లో కూడా నీళ్ళు చిప్పిల్లాయి. ఆమెని ఎలా ఓదార్చాలో అక్కడ ఉన్నవారికి అర్ధం కాలేదు. కాసేపటికి తేరుకుని “ఇప్పుడు ఎలా ఉంది సర్?.” అంది ధరణి.

“అంటే మేడమ్…మరీ.” అంటూ చెప్పేందుకు సంశయిస్తున్న అతన్ని చూసి “పర్లేదు సర్, మీరేం చెప్పినా విని తట్టుకునే శక్తి ఈ గుండెకి ఉంది.” అంది ధరణి.

“తలకి బలమైన గాయం కావడం తో మీ అబ్బాయి చనిపోయాడు.ఇవన్నీ అతని బిలాన్గింగ్స్.” అంటూ ఓ బ్యాగ్, పర్స్ ఇచ్చాడు.

బ్యాగూలో కొత్త చీర, కొంత ఎమౌంట్ ఉంది. పర్స్ లో తామిద్దరం తీసుకున్న పాస్ ఫోటో ఉంది.

ఈ ఫోటోనే నిన్ను నా నుంచి దూరం చేసిందిరా. ఇది నా దగ్గర లేకుండా ఉన్నా బాగుండు. నేను పేపర్ లో యాడ్ వేయించక పోయుందును. నువ్వు నా దగ్గరకు బయలుదేరకపోయే వాడివి. ఎక్కడో ఓ చోట సంతోషంగా బ్రతికే వాడివి.” అంటూ అవి గుండెకు హత్తుకుని రోధించింది.

కాసేపటికి తేరుకుని “సర్ నేనోసారి చూడొచ్చా…” అంది.

“హా వెళ్లండి.” అని పక్కకి తప్పుకున్నాడు పోలీస్.

లోపలికి వెళ్లిన ధరణికి బెడ్ పై నిస్తేజం గా ఉన్న ప్రశాంత్ ముఖం చూడగానే కన్నీళ్లు ఆగలేదు. ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆమెకి ఊపిరి ఆగి, మట్టిలో కలిసేందుకు సిద్దం గా ఉన్న బిడ్డను చూడగానే దుఃఖం పొంగి పొర్లింది. అతన్ని ఓ సారి తనివితీరా చూసుకుని అతని నుదుట ముద్దుపెట్టి చెమర్చిన కళ్లతోనే బయటకు వచ్చింది ధరణి.

ఆమె బయటకు వచ్చేసరికి అప్పుడే వచ్చిన అంబులెన్స్ నుంచి దించిన ఓ వ్యక్తి ని స్ట్రెచర్ మీద వేసి కాజువాలిటీ లోకి తీసుకుని వెళ్తున్నారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఏం చెప్పారో కానీ బోరున ఏడ్వడం మొదలుపెట్టారు అతని కుటుంబ సభ్యులు.

“రవీ! ఎంత కష్టం వచ్చింది రా. కూలి పని చేసి ముసలి తాతయ్యా, నాయనమ్మ ల మైన మమ్మల్ని సాకుతున్నావు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ మమ్మల్ని చూసుకునే నీకు ఇలాంటి జబ్బు ఉందనీ మాకు తెలీదయ్యా. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటున్నారు. ముసలి వాళ్లం మా దగ్గర ఏం డబ్బులు ఉంటాయి.” అంటూ ఓ బల్ల మీద కూర్చుని ఏడుస్తున్నారు ఇద్దరు ముసలి వాళ్లు. కొంత దూరం లో ఉన్న ఓ వ్యక్తి ఎవరెవరికో కంగారుగా ఫోన్ చేస్తున్నాడు.

“బాబూ!”అంది అతని దగ్గరకు వెళ్లి.

“ఏంటీ…?” అన్నాడతను.

“ఏమయ్యింది వాళ్ల మనవడికి?.”

“వీడు చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడే పనికి వెళ్లిన కన్నవారు ఆ భవనం కూలిపోవడం తో ఆ శిథిలాల మధ్య ఇరుక్కుపోయి చనిపోయారు.అప్పటి నుంచీ వీడిలోనే వాళ్లిద్దర్నీ చూసుకుంటూ వాణ్ని ఇంతవాన్ని చేశారు. పెద్దయ్యాక వీడే పని చేస్తూ వాళ్లని చూసుకుంటున్నాడు. వీడికి అప్పుడప్పుడూ విపరీతమైన కడుపునొప్పి వచ్చేది.

ఈ రోజు పొద్దున్న పనిలోకి వచ్చాక విపరీతమైన నొప్పి మొదలైంది. అంబులెన్స్ ఎక్కించి ఇక్కడికి తీసుకుని వచ్చాము.వీడికి ఏదో పెద్ద జబ్బే ఉందట. దాంతో రెండు కిడ్నీలు పోయాయట. అర్జంట్ గా కిడ్నీలు మార్చాలి అన్నారు.”అన్నాడు అతను.

అప్పుడే “మేడమ్” అంటూ నర్స్ పిలవడం తో అటువైపు వెళ్లింది ధరణి.

“మేడమ్ పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఈ ఫామ్ మీద సిగ్నేచర్ చేయండి.” అంటూ ఓ ఫామ్ ఇచ్చింది నర్స్.దానిమీద సైన్ చేయబోతుండగా నొప్పితో విలవిల లాడుతున్న రవి ముఖం గుర్తుకు వచ్చింది.

దాదాపు గా ప్రశాంత్ వయసే ఉంటుంది. ఆ క్షణం ఆక్సిడెంట్ అయినప్పుడు బాధతో వాడు ఎంతలా విలవిలలాడిపోయుంటాడో అనుకుంటూ గగుర్పాటుకి లోనయ్యి “నేనోసారి డాక్టర్ గారితో మాట్లాడొచ్చా?!.” అంది.

“అలాగే మేడమ్.” అంటూ డాక్టర్ రూమ్ లోకి తీసుకుని వెళ్లింది నర్స్.

“సర్ ఆ డెత్ కేస్ వాళ్ల తాలూకు వాళ్లు ఏదో మాట్లాడాలి అంటున్నారు.” అని బయటకు వెళ్లిపోయింది నర్స్.

“హా.. చెప్పండి మేడమ్.” అన్నాడు డాక్టర్.

“సర్ నేను మా అబ్బాయి అవయవాలు డొనేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఆ అబ్బాయి రవీ ఉన్నాడు కదా కడుపునొప్పి తో జాయిన్ అయ్యాడు, అతనికి మా అబ్బాయి కిడ్నీలు యూజ్ అవుతాయేమో చూడండి. నా బిడ్డ ఎలాగూ పోయాడూ. వాడి అవయవాలను దానం చేయడం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది అంటే సంతోషించదగ్గ విషయమే.” అంది ధరణి.

“థాంక్యూ మేడమ్.స్వచ్ఛందం గా ముందుకు వచ్చి అవయవ దానానికి ఒప్పుకున్నారు. వాళ్లకి ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పుడే ఆపరేషన్ కి సిద్ధం చేయిస్తా.” అంటూ నర్స్ ని పిలిచి రవి వాళ్ల తాతయ్య వాళ్లని పిలవమని చెప్పాడు.

“అయ్యా!”అంటూ ద్వారం దగ్గరే నిలబడిపోయారు వాళ్లు.

“రండయ్యా! మీరేం కంగారు పడకండి. మీ మనవడికి ఆపరేషన్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే అతను ఆరోగ్యంగా మీ ముందు ఉంటాడు.” అన్నాడు డాక్టర్.

“మరీ…?!.” అన్నారు వాళ్లు ప్రశ్నార్థకంగా.

“మీ అనుమానం నాకు అర్థం అయ్యింది. ఇదిగో ఇక్కడ కూర్చున్నారే ఈ మేడమ్ వాళ్ల అబ్బాయి పొద్దున్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అతని కిడ్నీలను మీ మనవడికి ఇస్తానని చెప్పారు.” అంటూ ధరణిని చూపించారు డాక్టర్.

“అమ్మా! దేవతలా వచ్చి మా మనవడిని రక్షిస్తున్నారు. మీ మేలు ఈ జన్మలో మరువలేము.” అంటూ చేతులు జోడించ బోతున్న ఇద్దరినీ వారించి,

“అయ్యో! మీరు పెద్దవారు. ఇలా చేయకూడదు. చనిపోయిన నా బిడ్డ ని ఎలాగూ బ్రతికించుకోలేను. వాడి అవయవాలను దానం చేయడం వలన ఒక ప్రాణం నిలబడుతోంది అంటే నా కొడుకు ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషిస్తుంది.వాడి అవయవాలు ఎవరికి ఇచ్చారో వారిలో నా బిడ్డను చూసుకుంటాను.డాక్టర్ వీరి మనవడి ఆపరేషన్ కి అయ్యే ఖర్చుని కూడా నేనే భరిస్తాను. మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆపరేషన్ చేయండి.” అని ఎమౌంట్ ఎంతో కనుక్కుని బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరకు వెళ్లింది ధరణి ప్రశాంత్ పాస్ ఫోటో ని గుండెలకు అదుముకుంటూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!