పరవశం

(అంశం::” ప్రేమ”)

పరవశం

రచయిత :: సిరి “అర్జున్”

‘ ప్రేమ’ ఈ పదం తలుచుకుంటే మాటల్లో చెప్పలేని అనుభూతి. మది పరవశించి పోతుంది ఈ ప్రేమ లభిస్తే!!
బహుశా!ఒక చూపు, ఒక స్పర్శ  చాలు అనిపిస్తుందేమో ప్రేమ తెలియడం కోసం. ప్రేమలో పడితే గానీ తెలియదేమో
ప్రేమ లోతు, ప్రేమలో హాయిదనం.

సమయం సాయంత్రం ఆరు గంటలు. అక్క బావతో  ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఈ సారి అయినా రంగులరాట్నం ఎక్కాలి అనుకున్నాను. నాకు అదంటే చచ్చేంత భయం. నా స్నేహితులు ఎప్పుడూ దాని గురించి ఆటపట్టిస్తూ వుంటారు. ఈ సారి నేను రంగులరాట్నం ఎక్కి నాలుగు ఫోటోలు తీసుకుని వాళ్ళకి చూపించి, వాళ్ళ నోరు మూయిద్దాం అనుకున్నాను.

అక్క బావ ఎక్కేశారు. నేను ఎక్కబోయే సరికి వేరే వాళ్ళు అక్కా బావ ఉన్న పెట్టెలో ఎక్కారు. ఉసూరుమంటూ ఇంకో పెట్టెలో కూర్చున్నా.  రంగుల రాట్నం కదిలింది.మా పెట్టెలో నలుగురు నేను ఎవర్నీ అంతగా పట్టించుకోలేదు. నా భయం నాది. ‘అయ్యో ఫోన్ కూడా లేదు’ అనుకుని చుట్టూ చూశాను. ఆ ప్రదేశం అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. రంగుల రాట్నం వేగం పెరిగింది. దానితో పాటు నా గుండె వేగం కూడా!! నా పక్కన ఎవరు ఉన్నారో కూడా చూసుకోలేదు నేను. అతని చెయ్యి పట్టుకుని గట్టిగా కళ్ళు ముసుకున్నా. పై నుండి కిందకి వస్తుంటే గాల్లోనే ప్రాణాలు పొయ్యేలా అనిపించింది. “దేవుడా… దేవుడా! ప్లీజ్ నన్ను కాపాడు. నా కోరికలు చాలా ఉన్నాయి. అవేవీ తీరకుండా పొయ్యేలా వున్నాను. స్వామి నన్ను నువ్వే రక్షించు నీకు ఐదు కొబ్బరి కాయలు కొడతాను. అవి సరిపోకపోతే ఇంకో నాలుగు ఎక్కువ సరేనా? నేను పెళ్ళి చేసుకునే అతని చేత పొర్లు దండాలు పెట్టిస్తాను”  నా పాటికి నేను వాగుతూనే వున్నాను. నా పక్కన అతని దగ్గరకి జరిగి పోయాను నాకు తెలియకుండానే. అతని గుండెల్లో గువ్వ పిట్టలా ముడుచుకుపోయాను. అతని చేతులు నా వీపు మీద కి చేరాయి. అతని స్పర్శ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అతని కౌగిలి భద్రతనిస్తుంది.  ప్రమేయం  అతని కౌగిలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ వున్నాను. ఆ సమయంలో మది పరవశించి పోయింది. నా మేను పులకరించి పోయింది. అలాగే ఉండి పోవాలి అనిపించింది. ఇలా ఎప్పుడు లేదు నాలో.

రంగుల రాట్నం ఆగడంతో కళ్ళు తెరచి తల ఎత్తి చూశాను. అతను నా వైపు చూశాడు. ఇద్దరి చూపులు కలిసిపోయాయి. అతని కళ్ళలో అంతులేని భావాలు. అవి ఏమిటో అంతుచిక్కడం లేదు నాకు. చుట్టు పక్కల గొడవగా ఉంటే తేరుకుని అతన్నించి దూరం జరిగాను. ఇంకొక్క క్షణం కూడా అక్కడ వుండలేదు. అక్క వాళ్ళ దగ్గరకు పరుగు పెట్టాను. అక్క బావ ఏదేదో అడుగుతున్నారు. నా చెవులకి ఏమి వినిపించట్లేదు. అతని స్పర్శ నన్ను చుట్టుకున్నట్టుగానే ఉంది. అతని చూపు నన్ను తాకుతుంది. మదిలో అలజడి మొదలైంది. చిరు చెమట నా నుదిటిన.

“ఏమైందే నీకు?” నన్ను చెయ్యి పట్టి లాగుతూ అరుస్తుంది అక్క.
“మీ చెల్లికి పిచ్చి పట్టింది ఏమో!” ఆట పట్టిస్తున్నారు బావ నవ్వుతూ.

“కాదు దీనికి దెయ్యం పట్టింది. అనవసరంగా తీసుకు వచ్చాను”

“అక్కా! నాకేం పట్టలేదు నువ్వు ఆ ఏడుపు ఆపుతావా. ఆకలి వేస్తుంది. ఏదైనా తిందాం పదండి” ఆ టాపిక్ అక్కడితో వదిలేయ్యాలి అని లాక్కుపోయాను ఇద్దరినీ.

బావ ఎవరికో ఫోన్ కలిపి రమ్మని చెబుతున్నారు. నాకు వినిస్తుంది. మేము ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు. అక్కేమో బావ పక్కన కూర్చుంటుంది ఎప్పుడూ. బావ ని విడిచి అస్సలు వుండలేదు. ఏముంటాయి వీళ్ళకి ఎప్పుడూ ఏదొకటి మాట్లాడుకుంటూనే వుంటారు అనిపిస్తుంది నాకు. నా ఆలోచనల్లో నేనుండగా

“అభయ్ నువ్వెప్పుడు వచ్చావ్?” నా వైపు ఓరగా చూస్తూ అడిగింది అక్క.

‘ఎవరబ్బా ఇతను?’  అనుకుని అప్పటికి వరకూ చూడలేదు నేను. అప్పుడే చూశాను అతని వైపు. నా కళ్ళు పెద్దవి అయ్యాయి. అది ఆశ్చర్యమో లేక ఇంకేదో తెలియదు నాకు.

నా వైపు చూసి పలకరింపుగా నవ్వాడు అభయ్. నేను చప్పున తల దించేశాను. బిడియమో ఇంకేదో తెలియదు నాకు. అక్కా బావ అభయ్ తో మాట్లాడుతూ వున్నారు.
అభయ, బావ వెళ్ళారు తినడానికి ఏమైనా తీసుకు వస్తామని.
“అక్కా! ఎవరతను?” అడిగాను ఆతృతగా.
“మా మరిది”
“ఏంటి?” చిన్నగా అరిచాను.
“హా మీ బావగారి తమ్ముడు. చిన్నాన్న కొడుకు”
“నేనెప్పుడూ చూడలేదే”
“మా పెళ్ళికి వచ్చాడు. ముఖ్యమైన పని ఉందని వెంటనే వెళ్ళిపోయాడు”
“ఓహో” అంతకంటే ఇంకేం అడిగినా అక్కకి అనుమానం వస్తుంది. అందుకే ఇంకేం అడగలేదు.
అన్నీ నాకిష్టమైన ఐటమ్స్ తెచ్చారు. నాకు అనుమానం మొదలైంది. విషయం ఏదో ఉంది అని అనిపించింది. కానీ! నేను పట్టించుకోలేదు.
నేను తింటున్నంత సేపూ తల దించుకునే వున్నాను.
తర్వాత చాలా షాపింగ్ చేసాము అక్కా, నేను. ఎప్పటికో ఇంటికి చేరిపోయాము. మాతో అభయ కూడా వచ్చాడు.

నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. ఎంతకీ నిద్ర పట్టలేదు నాకు. అభయ్ రూపం, అతని చూపు, అతని స్పర్శ నన్ను విడిచి వెళ్ళట్లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అభయ్ ని
మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ముఖ్యంగా అతని చూపు తాకితే చాలు ఏదో పులకింత నాలో!!
నిద్ర పట్టలేదు అని డాబా మీదకి వచ్చాను. ఈ వెన్నెల రాత్రి నచ్చింది నాకు. కొత్తగా సరికొత్తగా ఉంది. ప్రతి వెన్నెల రాత్రి ఇంతేగా ఉండేది. కానీ! ఈ వెన్నెల రాత్రి నా  ఇంకా కొత్తగా వింతగా ఉంది నా జీవితంలో ఆ రోజు లాగా!! పున్నమి చంద్రునిలో  ప్రేమించినవారు కనిపిస్తారు అంటారు. నేను పిచ్చేమో వీరికి అనుకున్నాను. కానీ! అది నిజం అని ఇప్పుడు అర్థం అవుతుంది. అభయ్ నిండు చంద్రుణ్ణి దాచేసి నా ముందుకు వచ్చినట్టు. నా ఊహల్లో నేనుండగా

“హా అమ్మా! రెండు రోజుల్లో వచ్చేస్తాను” అభయ్ మాటలు వినిపిస్తున్నాయి. అతను డాబా మీదకి వస్తున్నాడు అని అర్థం అయింది. కాళ్ళూ, చేతులు ఆడట్లేదు నాకు. గుండె వేగం పెరిగింది. ‘అతని ముందుకు వెళ్ళడం నా వల్ల కాదు.
కిందకి వెళ్ళాలి అంటే అతన్ని దాటుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఎలా?’ నాలోనే కంగారు పడుతూ ఏమి చెయ్యాలో పాలుపోక అలాగే నిలబడి చంద్రుణ్ణి చూస్తున్నా. అతన్ని పట్టించుకోనట్టుగా నటిస్తూ.

“సరే అమ్మా! ఉంటాను” బహుశా! తర్వాత ఫోన్ పెట్టేశాడు
కాబోలు!! ఇంకేం వినిపించలేదు. అతని అడుగులు శబ్దం మాత్రం బాగా వినిపిస్తోంది. అతను నన్ను  సమీపిస్తున్నట్టు అతని అడుగుల చప్పుడు ద్వారా తెలుస్తుంది నాకు.

ఎగసిపడే నా మనసుని ఊరుకో బెట్టలేక, అదిరిపడే హృదయాన్ని శాంతిపజేయలేక, శరీరం లో అలజడి తగ్గించలేక నా కష్టం అంతా ఇంతా కాదు ఆ సమయంలో.

“అభిజ్ఞా!” పిలిచాడు నన్ను.
‘నా పేరు కూడా తెలుసా? నా గురించి తెలిసే ఉంటుంది లే’ అనుకుని గట్టిగా ఒక సారి ఊపిరి పీల్చుకుని అభయ్ వైపు తిరిగాను.

“నువ్వేంటి ఇక్కడ? ఈ సమయంలో”అన్నాడు
నిద్ర పెట్టట్లేదు అని చెబితే ఏమనుకుంటాడో అని
“చల్లగాలి కోసం” అన్నాను.
“చల్ల… గాలి…  కోసం” దీర్ఘం తీశాడు.
‘అవును’ అన్నట్టు తల గుండ్రంగా ఊపాను.
“నమ్మొచ్చా?” నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నారు?” నా ముఖం మారిపోయింది కాబోలు!
“ఏసీ ఉంది చల్లగాలి అని చెబితే నవ్వరా” అన్నాడు.
‘అవును కదా! ఇంకో కారణం ఏదైనా చెప్పొచ్చుగా తింగరిదానా’ నన్ను నేను తిట్టుకున్నా.
నేను తన వైపు అలాగే చూస్తున్నా ఏమి చెప్పాలో తెలియక.
కళ్ళెగరేశాడు. అడ్డంగా తల ఊపాను ఏమి లేదన్నట్టు.
“నీకు నేను తెలుసా?”
“అక్క చెప్పింది”
“ఇంతకు ముందు తెలుసా?”
‘తెలియదు’ అన్నట్టు అడ్డంగా తల ఊపాను.
“నాకొక చిన్న హెల్ప్ చేస్తావా?”
“ఏంటండి అది?”
“ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. నా పరిస్థితి అలా ఉంది”
“ఏమైంది అండి?”
“అమ్మ పెళ్ళి చూపులకి వెళ్ళమంటుంది”
అభయ్ అలా చెప్పగానే నా గుండెల్లో గుబులు మొదలైంది.
“అమ్మాయి ని చూసారు అందరూ. బాగుంది అంట. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియట్లేదు”
అభయ్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే బొమ్మలా బిగుసుకు పోయాను.
నా ముఖం ముందు చేతులు కదిలించాడు నేను ఎంతకీ పలక్కపోవడంతో.
“హా” అన్నాను తేరుకుని.
“ఏమి చెయ్యాలో సహాయం చేస్తావు అనుకుంటే మాట్లాడవేమీ? ఏమాలోచిస్తున్నావ్?”
“మీ ఇంట్లో చెప్పేయ్యండి మీ ప్రేమ సంగతి”
“నేను ఆ అమ్మాయికే చెప్పలేదు. ఇక ఇంట్లో వారికేమి చెప్పాలి?”
“ఆ అమ్మాయికే చెప్పలేదా?” ఆశ్చర్యంగా అడిగాను.
“అవును” అమాయకంగా చెప్పాడు.
“ముందు ఆ అమ్మాయికి చెప్పి, తర్వాత మీ వాళ్ళకి చెప్పండి” నా కళ్ళలో నీళ్ళు బయటకి వచ్చేలా ఉన్నాయి అనిపిస్తుంటే ఇక అక్కడ ఉండలేక కిందకి వెళ్దాం అని అభయ్ ని దాటుకుని ముందుకి కదిలాను. నా చెయ్యి పట్టుకున్నాడు. నస్ అడుగులు ఆగిపోయాయి.
వెనక్కి తిరిగి అభయ ని చూశాను గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ. నన్ను తన వైపు లాక్కున్నాడు. నేను అభయ్ ఎదమీద వాలిపోయాను. ఆశ్చర్యంగా అతని వైపు చూశాను తలెత్తి. ” జీవితాంతం నా తోడుంటావా?” నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో వున్నాను. అభయ్ కౌగిలిలో భద్రంగా అనిపిస్తుంది.

“ఓయ్” మెల్లిగా నా ముఖం మీద గాలి ఊదాడు. పరవశంతో నా కళ్ళు ముసుకుని పోయాయి. “అభి” అతని పిలుపులో తీయదనం నస్ చెవులకి తెలుస్తుంది.

కళ్ళు తెరచి చూశాను అభయ వైపు” చెప్పూ. నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అడిగాడు.

నాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి. “ఏమైంది?” కన్నీళ్ళు తుడిచాడు. తన కౌగిలి నుండి మాత్రం దూరం కాలేదు నేను.

“నిజంగా నేనంటే మీకు ఇష్టమా?” నా కళ్ళలో మెరుపు.
“నాకంటే” నా నుదురు తన నుదురుకి ఆనిచ్చాడు.
“ఎవరినో ప్రేమించాను అన్నారు”
“హా అవును. ఒక కుందనపు బొమ్మని ప్రేమించాను. చూడు ఎంతందంగా ఉందో” నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
“అంటే మీరు నా కోసమే ఇక్కడికి వచ్చారా? రంగుల రాట్నం లో కూడా నా కోసమే నాతో పాటు ఉన్నారా?”
‘అవును’ అన్నట్టు నవ్వి. నా నుదిటిన ముద్దు పెట్టాడు.

“ఎందుకో తెలియదు అండి. మీరు నా మనసులోకి చేరిపోయారు. మీ కౌగిలి ఒక ఆత్మీయ స్పర్శ లాగా అనిపించింది. మీ చూపులో, మీ స్పర్శ లో నా మనసుకు మీ ప్రేమ తెలుస్తుంది. నాకు తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు” నవ్వుతున్నా. నా కంట్లో నుండి నీరు చెంపల మీదుగా జాలువారుతున్నాయి. నా మనసు ఎక్కువ ఆనందం తట్టుకోలేక ఇలా కన్నీటిని బయటకి పంపుతున్నట్టుగా ఉంది.

‘అవునా?’ అన్నట్టు చూస్తున్నాడు.

“హ్మ్మ్. మీ ప్రేమకి నా మది పరవశించింది” అన్నాను.
“నిన్ను అన్నయ్య పెళ్ళిలో చూసినప్పటి నుంచే నిన్ను చూడాలి అని నా మది గోల చేస్తుంది” అన్నాడు నవ్వుతూ.

“అమ్మో! మీరు గడుసువారే!” అన్నాను ఆశ్చర్య పోతూ.

“హా మరి. మీరు మీరు ఏంటి అమ్ముడూ. అభి అనలేవా?” అన్నాడు చిలిపిగా నా కళ్ళలోకి చూస్తూ.

సిగ్గు ముంచుకు రాగా నా బుగ్గలు కెంపులే అయ్యాయి. వెన్నెల వెలుగులో మరింత ఎర్రగా కనిపిస్తున్నాయి. తల దించేశాను.

“అభి”
“హ్మ్మ్”
“పిలవ్వా?” మృదువుగా అడిగాడు.

“అభి” అన్నాను చిన్నగా.

నవ్వుతూ నన్ను చుట్టేశాడు. నా చేతులు అతన్ని చుట్టుకున్నాయి.

“నా చేత పొర్లు దండాలు పెట్టిస్తావా?” అన్నాడు.
“హి హి ఊరికే అలా” అన్నాను.
నవ్వాడు తను.

‘అభి’ మా పేర్లు లాగా మా మనసులు ఒక్కటే!!

‘అభిజ్ఞా అభయ్’ అనుకుని మురిసిపోయాను.

—— సమాప్తం—–/

You May Also Like

3 thoughts on “పరవశం

  1. 👌👌👌👌👌❤️❤️❤️❤️💕💕💕💕💖💖💖💗💗💞💞💞 సూపర్ అక్కయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!