పరిష్కారం (సంక్రాంతి కథల పోటీ)

పరిష్కారం
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: శ్రీదేవి విన్నకోట

స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నాకూతురు ఐశ్వర్యను చూస్తూ “ఏం ఐసు అంత డల్ గా ఉన్నావు క్లాసులో వర్క్ ఎక్కువైందా ఏంటి. మొహం అలా వాడిపోయింది” అంటూ మంచి నీళ్ల గ్లాసు అందిస్తూ ప్రశ్నించాను.
“ఏం లేదమ్మా బానే ఉన్నాను” అంటూ షూస్ విప్పి రెక్ లో పెట్టి పుస్తకాల బ్యాగ్ తో సహా తనరూమ్ లోకి వెళ్ళిపోయింది.

నాపేరు జానకి నేను గృహిణిని. మావారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోపరేటివ్ బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తున్నారు.మాకు ఇద్దరు పిల్లలు. ఐశ్వర్య (ఇంట్లో ఐసు అని పిలుస్తాను) టెన్త్ చదువుతుంది. తర్వాత బాబు పవన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్ లోనే ఇద్దరూ ఒకేస్కూల్. చాలాచక్కగా చదువుతారు. ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లల్లా ఫోను ఇంటర్నెట్టు గూటిపక్షులు అసలే కాదు.ఇంట్లో మామాట వింటారు. చదువు సంధ్య, ఆటపాటలు, కబుర్లు, పెద్దలపట్ల వినయ విధేయతలు, అన్నీఉన్న చక్కనిపిల్లలు మాపిల్లలు,(మాపిల్లలు అని ఎక్కువ పొగుడుతున్నా ఆని అనుకోకండి నేనుచెప్పేది నిజమే, మాచుట్టాలు స్నేహితులు అసలు మీపిల్లలు ఈకాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు, నాకు అది పొగడ్తో వెటకారమో అర్థం కాదనుకోండి), పిల్లలకు ఎలాంటి అలవాట్లు అయినా మన  పెద్దవాళ్ళు నుంచే వస్తాయి.వాళ్ల మనసులు తెల్లకాగితం లాంటివి. మనం ఏంచెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్లు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్న బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.

ఎప్పుడూ స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో ఫ్రెండ్స్ ఎవరేమన్నారో టీచర్స్ ఏం లెసన్స్ చెప్పారో చెప్తూ, వస్తూనే తినడానికి ఏమైనా పెట్టు అమ్మ  అంటూ వచ్చే నాకూతురు ఐశ్వర్య అలా ముభావంగా ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. స్కూల్లో కానీ బయట ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి ఉంది నాదగ్గర. మేం ఇద్దరం స్నేహితుల్లా ఉంటాం. తల్లి కూతుర్లం అయినాసరే.

ఇంతలో నాకొడుకు పవన్ కూడా వచ్చేసాడు వస్తూనే అక్క ఏది అని అడిగాడు,
రూమ్లో ఉంది అని చెప్తూనే స్కూల్లో ఏమైనా జరిగిందా? అక్క ఎందుకు అలా ఉంది అని అడిగాను.
ఏమో నాకు ఏమీ తెలియదు అమ్మ ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూల ఉన్న బ్యాట్ తీసుకుని, పాలుతాగి బయటికి వెళ్ళరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక్క మ్యాచ్ అడేసి ఇప్పుడే వస్తా అమ్మ అంటూ తలుపు  తీసుకుని తుర్రుమని బయటికి వెళ్లిపోయాడు.
పిల్లలకి ఆటలు కూడా అవసరమే కదా అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరము చెప్పము నేను కానీ మా వారు కానీ,

ఒక గ్లాస్ బూస్ట్ కలిపి నాకూతురు గదిలోకి వెళ్లాను. ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకొని ఉంది. ఏమైందితల్లి అలా ఉన్నావ్. రోజు స్కూల్ నుంచి రాగానే కబుర్లు చెప్తూ చాలా అల్లరి చేస్తావు కదా. ఎందుకలా డల్ గా ఉన్నావురా, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఏమైనా హోం వర్క్ ఫినిష్ చేయలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? టీచర్ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చెయ్యనా?. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నావంక చూస్తూ అబ్బా చాలు ఆపమ్మా నువ్వు నీ ప్రశ్నలు నాకు తలనొప్పి వస్తుంది అందుకే పడుకున్నా, అంతకుమించి ఏం లేదు అంది.
నేను గబగబా పెయిన్ బామ్ తీసుకుని తలకి రాద్దామని వెళ్లాను.
ఏమీ వద్దు అన్నట్టుగా నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. తన కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. నాకు గాభరాగా అనిపించింది. ఎంతో సందడిగా  ఉండే పిల్ల ఏంటి అసురసంద్య వేళ ఇలా ఏడుస్తుంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోపెట్టాను, ఏంజరిగింది ఐసు ఎందుకు అలా ఏడుస్తున్నావ్ అని దగ్గరికి తీసుకుని బుజ్జగించి అడిగేసరికి ఒకేసారి గట్టిగా వెక్కివెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య రేపటినుంచి నేనింకా స్కూల్ కి వెళ్లనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది.
అయ్యో స్కూల్ కి వెళ్లక పోవడం ఏంటే. అసలు ఏంజరిగింది. ఎందుకు ఏడుస్తున్నావ్. ఎవరేమన్నారు. నాకు తెలియాలి కదా అని అడగ్గాఅడగ్గా పావుగంట తర్వాత  తేరుకుని ఏంజరిగిందో చెప్పసాగింది
మా స్కూల్ లోనే బి సెక్షన్ లో ఉండే టెన్త్ క్లాస్ చదివే మల్లికా వాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతి రోజు నేను స్కూల్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పిల్లా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు, నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు, ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా, కానీ ఈరోజు అయితే వాడి ప్రవర్తన శృతిమించి పోయింది, నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకోకుండా ఇంటికి వచ్చేస్తూ వాడికి సమాధానం చెప్పలేదని నా డ్రెస్ చున్నీ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్ని చిరిగిపోయింది కూడా. అక్కడ చాలామంది అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరూ ఏమీ అనలేదు పైగా అందరూ నన్ను చూసి వెటకారంగా నవ్వుకుంటున్నారు, నాకు ఏడుపొస్తుంది అమ్మ నేను ఇంకా స్కూల్ కి వెళ్ళను, వాడు నన్ను కనిపించినప్పుడల్లా ప్రతిసారి ఏడిపిస్తూనే ఉంటాడు, నాకు చాలా భయమేస్తుందమ్మ అంటూ మళ్ళీ పెద్దగా  ఏడవడం మొదలుపెట్టింది.
ఛా పిచ్చిమొద్దు ఏంటిది ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా వాళ్ళకి బుద్ధి చెప్పాలి గాని. ఏమన్నావ్ వాడిపేరు. వాడి ఇల్లు ఎక్కడ? ఏం చదువుతున్నాడు. మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా. రేపు నేను వాడితో మాట్లాడుతాను, మీ స్కూల్ కి కూడా వస్తాను నువ్వు వెళ్ళు. అని ధైర్యం చెప్పాను.
వద్దు అమ్మ చాలా చెడ్డవాడు చాలా పిచ్చి పిచ్చిగా బూతులవి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలామంది జులాయి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్లే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు నాకు భయమేస్తుంది అంటూ  ఏడుస్తూనే నాకు నచ్చచెప్పబోయింది ఐసు.
సరే నేను రానులే దీనికి ఏదో ఒక మరో పరిష్కారం ఆలోచిద్దాం, నువ్వు కంగారు పడకు  అమ్మకి చెప్పావు కదా ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను ఏం చేయాలో ఏడవకు ముందు లేచి ఈ బూస్ట్ తాగు. పద హాల్లో కూర్చుందుగాని. నాన్న గారు వచ్చే టైం అయింది. నిన్ను ఇలా డల్ గా చూస్తే మళ్లీ కంగారు పడతారు, అసలే నువ్వు మీ నాన్నకి గారాల కూతురివి కదా అంటూ తనని నవ్వించే ప్రయత్నం చేశాను.

తర్వాత నేను రూమ్ నుంచి బయటికి వచ్చేసాను. రేపు ఏం చేయాలి నాబిడ్డని ఇంతగా ఏడిపించిన వాడికి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని  తీక్షణంగా  ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది, రేపు నాఆలోచన ప్రకారమే చేయాలి అనుకుంటూ  రిలాక్స్ అయ్యాను.

పొద్దున లేవగానే పనంతా చక చక ముగించుకుని మావారిని బ్యాంకుకి, పిల్లల్ని స్కూల్ కి పంపించిన తర్వాత, రెడీ అయ్యి నాక్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మాఇంటికి అర్జంటుగా రమ్మని చెప్పాను, ఈలోపు నాకూతుర్ని ఏడిపించే గిరీష్ గాడి అడ్రస్ కనుక్కున్నాను.

రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను, ఒక మంచి ఇత్తడి పళ్లెంలో చీర జాకెట్ ముక్క పువ్వులు గాజులు పళ్ళు పసుపు కుంకుమ అన్ని నీట్ గా సర్దుకుని వాళ్ళింటికి వెళ్ళాము నేను రమణి కలిసి, గిరీష్ అమ్మానాన్న తాతయ్య నానమ్మ ఇంట్లోనే ఉన్నారు, మేముఎవరో తెలియక ఎవరు మమ్మల్ని ఎందుకు వచ్చారు అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ మీ అమ్మాయి మల్లిక మాపాప ఐశ్వర్య క్లాస్మేట్స్, మా పాప కోసం స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయిని చూశాను, నాకు చాలా నచ్చింది, రాకేష్ అని మాఅన్నయ్యగారి అబ్బాయి ఉన్నాడు, వాడు పెద్దగా చదువుకోలేదు, 10 వరకు చదివి అటూ ఇటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు, వాడు మీఅమ్మాయిని ఎక్కడో చూశాడు అంట, బాగా నచ్చింది అని చెప్పాడు, మీరు పెళ్లికి ఒప్పుకుంటే మీ అమ్మాయికి మాఅన్నయ్యగారి అబ్బాయికి పెళ్లి చేసేద్దాం, ఇద్దరు చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకునీ పిల్లల్ని కంటారు మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను..
వాళ్లంతా మతిపోయినట్టు చూశారు నావంక
ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు, 15 ఏళ్ల పదో తరగతి చదివేపిల్లకు పెళ్లి ఏంటి, అదిగాక ఏపని పాట లేని అలాంటి జులాయి వెధవతోనా, అంటూ నన్ను కొట్టినంత పని చేశారు.
నేను తప్పుగా మాట్లాడానా మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా మీ పిల్లని అనిఅడిగాను.
చాల్లే ఊరుకో ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటి పిచ్చి వాగుడు వాగకుండా ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడువు అన్నాడు గిరీష్ తండ్రి.
ఇంతలో లోపల్నుంచి గిరీష్ వచ్చాడు, ఏం వాగుతున్నావు నువ్వు, నా చెల్లెలు అంత చిన్న పిల్ల దానికి అప్పుడే పెళ్లి చేయాలా అంటూ,
ఇక నాకు కోపం ఆగలేదు, లాగిపెట్టి గట్టిగా వాడి గుబమీద కొట్ట, అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు.
నిజమే మల్లిక చిన్నపిల్ల, తన గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు, కానీ మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా, మరి నువ్వు చేసే పని ఏంటి, తను స్కూల్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకుంటా అని ఏడిపించడం, చున్నీ లాగడం, వెకిలిగా మాట్లాడడం, ఆడపిల్ల ఏడుస్తుంటే పైశాచికానందం అనుభవించడం, అసలు అమ్మాయిల్ని స్వేచ్ఛగా బ్రతకనీవ్వరా, అది చిన్నపిల్ల చదువు ఆటపాటలు తప్ప మరో ధ్యాస లేని పసిపిల్ల. నీలాంటి పనికిమాలిన వాడికి భయపడిపోయి తనకు ఎంతోఇష్టమైన చదువుకూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చిపిల్ల అంటూ మరో రెండు వాయించా వాడిని,

ఇంతలో వాళ్ళ అమ్మానాన్నకి జరిగింది అర్థమై తెలివి వచ్చినట్టుంది, ఏం జరిగింది అంటూ అడిగారు
నా స్నేహితురాలు రమణి వాళ్లకి జరిగిందంతా వివరంగా చెప్పింది.
నేను ఈ విషయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు మీవాడి మీద, అప్పుడు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి, మీ పరువు పోతుంది, అది మీకు ఎంత అవమానం, అలాగే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకుని మీ కొడుకుని దారిలో పెడతారు అని మీకు ఈ విషయం చెప్పాలని మీఇంటికి వచ్చాను అన్నా,

వాళ్ల నాన్నకి నామాటలు వినగానే కొడుకుపై చాలాకోపం వచ్చేసింది, మనకి ఒకఆడపిల్ల ఉంది మరో ఆడపిల్లను అలా ఏడిపించవచ్చా తప్పుకదా అంటూ ఆయన మరో రెండు తగిలించాడు గిరీష్ కి, చదువుసంధ్యా మానేసి పనీపాటా లేకుండా తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే నువ్వే మారతావు అనుకున్నాను, రోడ్లమీద పడి ఇలాంటి పిచ్చివేషాలు వేస్తున్నావు అన్నమాట, మరొక్కసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను
అంటూ, వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పు మరోసారి ఇలాంటి తప్పు చేయనని అన్నాడు.
వాళ్ళ అమ్మ నానమ్మ తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు,ఏమో చూస్తుంటే  వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది.
మరోసారి ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను ఆంటీ నన్ను క్షమించండి అంటూ నాకాళ్ళ మీదపడ్డాడు.
నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను, మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే, నోరులేని జంతువులు పక్షులే ఎవరైనా తమ పిల్లలు జోలికొస్తే ఊరుకోవు, అలాంటివి అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటాను అనుకున్నావ్ నా కూతురిని ఏడిపిస్తే అన్నాను.
వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదుఆంటీ అంటూ రెండు చేతులు జోడించాడు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే, మరోసారి ఇలా జరగకుండా మేమే చూసుకుంటాము అనడంతో ఇకబయటికి వచ్చేసాము.
కన్నతల్లిని నాకు తెలియదా  ఇలాంటి రాబందుల నుంచి నా చిన్నారిబిడ్డని ఎలా రక్షించి కాపాడుకోవాలో, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విరిసిన సిరిమల్లెపువ్వులా నవ్వుతున్న నాబిడ్డ ఐశ్వర్యని చూశాక అప్పుడు నా హృదయం సమస్య పారిపోయిందిలే అనుకుంటూ సంతోషంగా కుదుటపడింది.

************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!