అనుకోకుండా ఒకరోజు (సంక్రాంతి కథల పోటీ)

అనుకోకుండా ఒకరోజు
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

చెమటలు కక్కుతూ వచ్చి మోకాళ్ళపై నిలబడి “అంతా అయిపోయిందిరా “అన్నాడు శ్రీకర్.
ఏమైందిరా కొంపలంటుకొన్నట్లు వచ్చావ్ అన్నాడు శరత్.
కొంపయితే ఒకదాంతో పోద్దిరా కానీ అక్కడ అంటుకుంది ఊరు అంటూ శ్రీకర్ ఆందోళనగా చెప్పాడు.
ఆ మాటతో శరత్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అసలేం జరిగిందో చెప్పు అంటూ తన చెమటను తుడుచుకుంటూ శ్రీకర్ భుజాలు పట్టుకొని అడిగాడు.
శ్రీకర్ “మీ చెల్లి మీనా మన రమణ మామ కొడుకు లోకేష్ ని ప్రేమించిందని మనకు తెలుసు కదా. తెలిశాక పోనీలే ఈ వయసులో ఆకర్షణ అనుకొని మీ నాన్నకి కూడా సర్ది చెప్పాం. దాంతో లోకేష్ , మీనా ఆనందంగా చిలకా గోరింకల్లా తిరుగుతుండడం చూసి మనూర్లో ఉన్న మీనా ఫ్రెండ్స్ ఎనిమిది మంది పక్కూరి కుర్ర నాయాళ్ళతో తిరగడం మనూరి కౌశల్యమ్మ చూసిందంట. ఆమె సంగతి తెలుసుకదా ఆమె కళ్ళల్లో పడితే అడ్డుతెర కూడా లేని వీధి భాగవతం చూసినట్లే. ఊరంతా సినిమా చూపించేసరికి ఆ ఎనిమిది మంది అమ్మాయిల నాన్నలు మీ నాన్నని నిలదీశారంట” అంటూ కాసేపు అలుపు తీర్చుకున్నాడు.
శరత్ “మా నాన్నకేం సంబంధం ఆయన్నేమని నిలదీశారు”అన్నాడు.
“ఏముంది మీ మీనా ని వీధుల మీద వదిలేశారు దాన్ని చూసి మా వాళ్ళంతా ఇలా తయారయ్యారు అని అనడంతో మీ నాన్న మీ బంగారం మంచిదైతే మా మీనా చెప్తే ఎలా వింటారయ్యా నా బిడ్డని అది ఇది అంటే మర్యాదగా ఉండదు అంటూ ఎదిరించే సరికి వాళ్ళందరూ శాంతపడి తమరి కొడుకు శరత్, వాడి ఫ్రెండు శ్రీకర్ ఎక్కడున్నారో చెప్తే ఆ మహానుభావుల్తో పనుంది అన్నారంట”అని శ్రీకర్ చెప్పడంతో శరత్ “మనమంటే ఎంత గౌరవంరా వాళ్ళకి రమ్మను వాళ్ళకీ హెల్ప్ చేద్దాం
“అంటూ గర్వంగా మీసం మెలేశాడు.
శ్రీకర్ శరత్ ని చూసి “ఒరేయ్ మీనాకి మనం అభయం ఇచ్చిన సీన్ ఒకసారి గుర్తు తెచ్చుకో”అన్నాడు.
నాన్న ఏదైనా అంటాడేమోనని “మీనా..!నీకేదైనా ఆపదొస్తే మా అన్నయ్యలకి మా విషయం చెప్పాం వాళ్ళే మాకు సపోర్ట్ గా ఉండి హెల్ప్ చేస్తున్నారు.”అని చెప్పమన్నాం అంటే ఇప్పుడు ఆ ఎనిమిది మంది అమ్మాయిలు మనల్ని ఇరికించారంటావా అంటూ శరత్ శ్రీకర్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.
“కాదురా ఇరికించింది నీ చెల్లి మీనా” అంటూ తన వీపుపై ఉన్న గాయాల్ని చూపించి మనం ఇక్కడి నుంచి పారిపోకపోతే ఇంట్లో వాళ్ళు మన శవాల్నే చూస్తారు అంటూ భయపెట్టేశాడు శ్రీకర్.
శరత్ “సరే పదరా ఎక్కడో ఒక దగ్గర దాక్కొందాం “అంటూ దెయ్యాలు ఉన్నాయని ముద్రేసుకున్న ఎవరూ వెళ్ళని గోడౌనులో దాక్కునేశారు ఇద్దరూ.

కాసేపటికి గోడౌను వైపు ఎవరో వస్తుండడం చూసి ఇద్దరూ కలిసి దెయ్యంలా అరవడం ప్రారంభించారు. అక్కడ వచ్చేదెవరో కాదు మాజీ సర్పంచి రమణయ్య. ఆయన మొదట జంకక పోయినా వీళ్ళ అరుపుల దాటికి దెయ్యమే అయ్యుంటుందని నమ్మి ఊళ్ళోకి పరుగులంకించాడు. అందరికీ గోడౌను వైపు ఎవరూ వెళ్ళొద్దంటూ చెప్పేశాడు. ఆ ఎనిమిది మంది అమ్మాయిల నాన్నలు వీరిద్దరినీ వెతికి కనిపించకపోయినా హ్యాపీగానే ఉన్నారు. అది తెలియని శ్రీకర్,శరత్ లు గోడౌనులో ఆకలితో అలమటిస్తున్నారు.
రాత్రయ్యాక శ్రీకర్”ఒరేయ్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంటికెళ్ళి ఎవ్వరికీ కనపడకుండా అన్నం తెస్తాను”అనడంతో శరత్ “మనం భయపడుతూ ఇక్కడే ఎన్ని రోజులుండగలం రా. మన పరిస్థితిని మార్చుకోవాలంటే భయపడకూడదు ఏం చేస్తారో చూద్దాం .ధైర్యంగా వెళ్దాం” అంటూ శ్రీకర్ చెయ్యి పట్టుకొని వెళ్తుండగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మైకులో పాటలు వస్తూ ఉన్నాయి. వింటూ వస్తున్నారు. దగ్గరికొచ్చాక మైకులో ఎవరో మాట్లాడుతున్నారు.
“శరత్,శ్రీకర్ లు మా అమ్మాయిల పాలిట దేవుళ్ళు, ఇంకా మన ఊరికే కాదు మన దేశానికే మేలు చేశారంటూ చప్పట్ల శబ్ధం మోగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కొట్టి చంపేస్తారని భయపడి దాక్కుంటే మనిద్దరినీ పొగుడుతున్నారు అనుకుంటూ గుడి దగ్గరికొచ్చేశారు. వీళ్ళని చూసిన వాళ్ళు పైకెత్తి ఊరేగిస్తున్నారు. పోలీసులు కూడా జనాల్లో చేరి వీరిపై పూలు చల్లుతున్నారు.శరత్ కైతే ఏమీ అర్థంకాక కళ్ళుతిరుగుతున్నాయ్. శ్రీకర్ కూడా నా వీపు విమానం మోత మోగించి ఇప్పుడు ఊరేగిస్తున్నారా అనుకుంటూ మోయండి నాయాళ్ళారా అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దర్నీ ఇంటి వరకూ మోసుకొచ్చి వదిలి ఒక్కొక్కరూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు.
అయోమయంలో ఉన్న వీరి తెల్లమొహాలు చూసిన మీనా ఇద్దర్నీ పిలిచి “అన్నయ్యా రండి..మీకెందుకు ఇలా వీళ్ళు సన్మానం చేస్తున్నారో అర్థం కాలేదు కదా. నేను చెప్తా వినండి”అంటూ “శ్రీకర్ ని కర్రలతో కొట్టాక తప్పించుకొని వెళ్ళిపోయాడు. నీ దగ్గరికొచ్చేసుంటాడులే అనుకున్నారు.దొరికితే చంపేయాలనేంత కసిగానే ఉన్నారు. నా దగ్గరికొచ్చి ఏమ్మా నా బిడ్డల్ని ప్రేమించమని నువ్వెందుకు చెప్పావ్. మీ అన్నలున్నారని వాళ్ళకెందుకు ధైర్యమిచ్చావ్ అని అడిగారు. అసలు నాకు మీ ఎనిమిది మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నారనే విషయం తెలియదు అన్నాను. అయితే మీ అన్నయ్యల గురించి ఎందుకు చెప్పావ్, అసలు పక్కూరి కుర్రనాయాళ్ళెవరో చెప్పమ్మా అంటూ నన్ను బతిమాలారు. నేను నా లవ్ స్టోరీ చెప్పేటప్పుడు మా అన్నయ్యల గురించి చెప్పానని, మా క్లాసులో పక్కూరి వాళ్ళెవరూ లేరు అని చెప్పడంతో వాళ్ళెవరో కనుక్కోడానికి తిరిగి తిరిగి చివరికి కనుక్కొన్నారు.”అని మీనా చెప్పింది.
ఆ కుర్రాళ్ళెవరు,మమ్మల్నెందుకు సన్మానిస్తున్నారే అని అనుమానంగా అడిగాడు శరత్.
అన్నయ్యా వాళ్ళు చైన్ శ్నాచింగ్ గ్యాంగ్ లో ఉన్న కుర్రోళ్ళు ,మొన్న జువలరీ షాపు దోపిడీ జరిగాక వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదాం అనుకున్నారంట. కానీ వెళ్ళలేక పోయారు. ఎందుకంటే ఒకసారి నన్ను ఏడిపించాడని మీరిద్దరూ వెళ్ళి ఒక బక్క పిల్లోడ్ని కొట్టారు కదా వాడు కూడా ఆ గ్యాంగే. వాడికి మీరు విరగ్గొట్టిన కాలు సెట్ అవడానికి పదహైదురోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈలోపు ఇదంతా జరిగిపోయింది. మీ ఇద్దరి వల్ల ఆ గ్యాంగ్ పోలీసులకు దొరికింది, ఆ ఎనిమిది మంది అమ్మాయిలు వాళ్ళని మీ పేర్లు చెప్పి బెదిరించడంతో నిజాన్ని ఒప్పుకొని వాళ్ళ గ్యాంగ్ అంతటినీ పట్టించేశారు. అందుకే మీకు జువలరీ షాపు ఓనరుతో సహా అందరూ సన్మానం చేసేది”అంటూ మీనా అన్నయ్యలు చేసిన గొప్పదనాన్ని వివరించింది.
అంతా విన్న శ్రీకర్ “ఒరే శరత్తా అనుకోకుండా ఒకరోజు మీనా కోసం ధైర్యం చేసి కొట్టినా పనికొచ్చేటట్లు ఎంత బాగా కొట్టాంరా మనం” అంటూ విజయ గర్వంతో శరత్ భుజంపై చేతులేసుకొని ఠీవీగా నడుచుకుంటూ వెళ్ళాడు.
దానికి శరత్ “ధైర్యంగా వేసిన అడుగు,ఫలితం ఆశించని శ్రమ ఎప్పటికీ వృధాగా పోవురా వాటివల్ల వ్యక్తిత్వం గొప్పదనం తెచ్చుకొని అభిమానాన్ని సంపాదించి పెడుతుంది” అంటూ తనదైన శైలిలో తాత్వికతను వల్లించాడు.

………….సమాప్తం……..

You May Also Like

5 thoughts on “అనుకోకుండా ఒకరోజు (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!