పేర్లు

పేర్లు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

  రచన:ఉదయప్రసాద్

   కొంతమందంటుంటారు ‘ఈ కాలం పిల్లలు చాలా తెలివైనవాళ్లు, అస్సలు మాట్లాడలేము వాళ్ళతో’ అని. ఈకాలం ఆ కాలం అని లేదు, పిల్లలు ఏ కాలంలోనూ తెలివైనవాళ్ళే అని నా అభిప్రాయం. నా బాల్యంలోని ఓ ముచ్చట చెప్తాను, అది చదివి అవునో, కాదో మీరే చెప్పండి. మా ఊరి అమ్మవారి జాతరకి చాలామంది చుట్టాలతో పాటు వైజాగు నుండి పెద్దత్తయ్య, గణపవరంనుండి చిన్నత్తయ్య కుటుంబాలతో వచ్చారు. ఒకటే సందడి. చుట్టాలొస్తే భలే ఉంటుంది. ఒక్కక్కొరొచ్చినప్పుడల్లా ఆడపిల్లలకి గాజులు కొనుక్కోమని పదో పరకో ఇస్తారు. అవి పట్టుకోవటం, గుడిచుట్టూ వెలసిన దుకాణాలదగ్గరికి తూనీగలల్లే తుర్రుమనటం. పోటీపడి కొనుక్కోవటం. జాతర నాలుగురోజులూ అమ్మ, పిన్ని ఫుల్ బిజీ. నాన్న, బాబాయ్ అంతకన్నా బిజీ (నాన్న గుడి కమిటీ ట్రెజరర్)మరి. లోపల పెద్దవాళ్ళు పూజ ఏర్పాట్లతో బిజీగా ఉంటే, పిల్లలంతా బయట దాగుడుమూత లాడుకుంటున్నాము. అంతా పది పన్నెండేళ్ల లోపువాళ్ళం. పంటలేసుకున్నాక మొదట మా పిన్ని కూతురు జ్యోతి ‘దొంగ’ అయింది. తరువాత మావయ్య కూతురు రేఖ, పూజారిగారమ్మాయి ఉమ ఆడాక, మా పెద్దత్త కూతురు భాను దొంగ అయింది. వరుసగా రెండుసార్లు అదే దొంగ అయ్యాక, ఈ పరుగెత్తే ఆటలు వద్దు, నా కొత్త డ్రెస్ పాడైపోతోంది, ఇన్డోర్ గేమ్స్ ఆడుకుందాం అంది. స్టైల్గా కళ్ళు తిప్పుతూ. అసలే దానికి తెల్లగా ఉంటుందని పొగరెక్కువ. సరే అని ధాన్యంకొట్టు అరుగుమీదకి చేరామంతా. పులీమేక మొదలెట్టాం. మా చెల్లి (బాబాయ్ కూతురు) భానుని ఓడించింది. దానికంటే చిన్నదైన చెల్లి చేతిలో ఓడిపోయేసరికి ఉడుకుమోత్తనం వచ్చింది దానికి. నువ్వు తొండి చేసావు. నీకు పనిష్మెంట్ వస్తుంది. అదిగో చూడు, ఆ కర్రి రాజుగాడు నీ మొగుడు అంది కోపంగా కాస్త దూరంలో కొబ్బరికాయలు పీచు తీస్తున్న మా పాలేరు కొడుకు రాజుని చూపించి. వాడు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే నాకు మండింది. చెల్లి ‘ఛీ’ అంది. ఛీ లేదు, ఛా లేదు. నువ్వు రాణి, వాడు రాజు, అహ్హహ్హ అంది గట్టిగా నవ్వుతూ. చెల్లి ఏడవటం మొదలెట్టింది. ఏడవకు రాణీ, పాలేరుకిచ్చి పెళ్ళిచేస్తారా చెప్పు అన్నాను అనునయంగా. నీ మొగుడు నల్లనివాడేగా, ఫిక్స్. భలే పెట్టారు మీ పేర్లు అంది హేళనగా నవ్వుతూ.
నా పేరు శ్రీదేవి. దాంతోపాటు అందరూ నవ్వారు. నాకు పౌరుషమొచ్చింది. నా మొగుడు నల్లనివాడైనా చల్లనివాడు. నీ మొగుడు దుర్మార్గుడు అన్నాను రోషంగా. దాని పేరు భానుమతి. దాని మొహం వెలవెలబోయింది. నీ మొగుడు మరీ ఘోరం, నిన్నొదిలేసి పోతాడు అన్నాను దాని చెల్లెలివైపు చూస్తూ. అయోమయంగా చూసారిద్దరూ. అర్థం కాలేదా శకుంతలా, దుష్యన్తుడు వదిలేసిపోతాడుగా అన్నాను సాగదీస్తూ. అన్నయ్యతో చెప్తాను అందది కోపంగా.
అబ్బ..ఛా.. అన్నాను వెక్కిరిస్తూ. అన్నయ్యా అని పిలిచింది గట్టిగా. ఏంటి గొడవంటూ వాళ్ళన్నయ్య బయటికొచ్చాడు. పోరా..గాలో.. డా.. అని చెల్లి చెయ్యి పట్టుకుని లోపలికి పరుగెత్తా. మరి వాళ్ళన్నయ్య పేరు చెప్పాలికదూ..పవన్..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!