ఎందుకో మరి!
రచన : సుజాత P. V. L
మరచిపోవాలని
మనసుని మభ్యపెడుతూనే వున్నా..
అయినా
నీ ఊసులనే మోస్తోందెందుకో?!..
గతాన్ని దొలిచేసే..
జీవితకాల శిక్షను విధించిందని తెలిసినా..
నీ ఆలోచనలతోనే ఊగిసలాడుతోందెందుకో?
ప్రేమ, ఆకర్షణ రెండూ ఒకటేనా!??
కాదని తెలుసుకొనేలోపే..
కాలం కోలుకోలేని గాయాన్నిచ్చి వెళ్ళిపోయింది..
అయినా కూడా..
నీ మాటల లేపనం కోసం మనసింకా
పరితపిస్తూనేవుంది!.
ఎందుకో మరి!?