ఫలించిన ఆశ

ఫలించిన ఆశ

రచన :తిరుపతి కృష్ణవేణి.

ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చిన రవి,
కావ్య! కావ్యా! త్వరగా భోజనం పెట్టు, అలా బ్యాంక్ వరకు వెళ్ళి రావాలి, అని కాళ్ళు చేతులు కడుక్కొని టీవీ ఆన్ చేసుకుని న్యూస్ చూస్తూ సోఫాలో కూర్చున్నాడు.
ఎంత సేపటికీ భార్య కావ్య భోజనం పెట్టక పోవటంతో ఎటు వెళ్ళి వుంటుందబ్బా! నేను వచ్చినట్లు కూడా గమనించి నట్లు లేదు. ఇల్లంతా నిశ్శబ్ధంగా వుంది. తలుపులు అన్నీ తెరిసే వున్నాయి. అని మనసులోనే అనుకొంటూ బెడ్ రూం లోకి తొంగి చూసాడు. అంతే ముసుగు తన్ని పడుకున్న భార్యని చూసిన రవికి ఒక్కసారిగా ఒంట్లో వణుకు మొదలైంది.
సోఫాలోనుండి లేచి పరిగెడుతున్నట్లుగా భయంతో బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. .
. కావ్య, కావ్య! ఏమైంది ఒంట్లో బాగా లేదా! జ్వరం గానీ వచ్చిందా? హాస్పటల్ కి వెళదామా? లేచి ఫ్రెష్ అవ్వు! అసలే కరోనా టైమ్!జాగ్రత్తగా ఉండాలి. ఎదైనా డాక్టర్ కి ముందుగా చూపిస్తే మంచిది. అంటూ ముసుగు తన్ని పడుకున్న భార్యని హడావుడిగా చెయ్యి పట్టి లేపాడు రవి. చెయ్యి పట్టి చూసిన రవి, కావ్య కి అస్సలు జ్వరం వచ్చినట్లుగానే లేదే, ఒళ్ళు చల్లగానే వుంది, మరి ఎందుకు అలావుంది!
ఎదో జరిగింది, తెలుసుకోవాలి. అనుకుంటూ, కావ్య!నీవు అంతలా బాధ పడుతున్నావు అంటే! ఏదో ఒక కారణం వుండే ఉంటుంది కదా! చెప్పు! అన్నాడు భర్త. ………. మరేమో! మరేమో! మరేమో, అండి అంటున్న కావ్యని ఊరికే నాన్సక విషయం ఏమిటో చెప్పవోయ్ అన్నాడు భర్త రవి.
మన పక్కింటి పిన్నిగారు వున్నారు కదండీ! ……… హా! వున్నారు. ఏమైంది? ఆవిడకి,అని అదుర్ధాగా అడిగారు రవి. అబ్బా! ఆవిడకు ఏమి కాలేదండి! మరేమో! వాళ్ళ అమ్మాయికి సీమంతం చేస్తున్నారండి!……….. అయితే మంచి విషయమే కదా! దానికి నువ్వు అంతలా వెక్కి వెక్కి ఏడవటం దేనికోయ్ అన్నాడు భర్త …………. అబ్బాబ్బా! అది కాదండీ! పిన్నిగారు మనతో అంత మంచిగా వుంటారు కదండీ! వీధిలో అందరిని పేరంటం పిలిచి నన్ను ఒక్కదాన్నే పిలవ లేదండీ? అంటూ మళ్ళీ బావురుమంది. కావ్య, చూడు! పిలవటం, పిలవకపోవటం అనేది ఆమె ఇష్టం తనకి పిలవాలనిపించలేదు! పిలవలేదు. దానికి నువ్వు అంతలా బాధ పడి చేసేది ఏమి లేదు కదా! మరీ అలాంటప్పుడు బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప! మరొకటి లేదు.
కావ్యకి భర్త మాటలు ఏ మాత్రం సహించటం లేదు. ఈయన ఎప్పుడు ఇంతే! ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకొని వదిలేస్తారు. అలా ఎలా ఉంటారో! ఏమో! అందుకే ఏ విషయం అయినా నాలో నేనే బాధ పడతాను.వీధి లో అందరిని పిలిచి నన్ను పిలువక పోవటం నాకు పిల్లలు లేరనేగా వాళ్ళ ఉదేశ్యం. కానీ ఈ విషయం మీకు అంతగా చెప్పాలనిపించదు. మీకేంటి ? ఆ బాధ అనుభవించేది నేను కదా! పెళ్ళి అయి పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లా, పీచూ లేరా అని అందరూ అంటుంటే నా మనసు ఎంత బాధ పడుతుందో! మీకేం తెలుస్తుందండీ! మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు కదా! నన్ను పేరంటం పిలవక పోవటానికి కారణం కూడ అదేనండి! అంటూమరలా బోరున ఏడవటం ప్రారంభించింది. . చూడు కావ్య లోకులు, కాకులు పది మంది పది రకాలుగా అనుకుంటారు లోకం తీరే అంతా అని సరి పెట్టుకోవలసిందే! అలా కాక పొతే మనం బ్రతకలేము. పిల్లలు లేనంత మాత్రాన పెళ్లిళ్లకు పేరంటాలకు పనికి రారు! అనేది వాళ్ళ మూర్కత్వం! ఎవరో! ఏదో! అన్నారని వాళ్ళు మనల్ని పిలవలేదని, మనం బాధ పడటం ఏడవటం కూడ మన వెర్రితనమే అవుతుంది. ఎవరైతే పిలుస్తారో! వాళ్ళ దగ్గరకే వెళితే పోలా! అని భార్యకు సర్థి చెప్పాడు.పిల్లలు లేరు అన్న ఒక్క కారణం తోనే తప్ప కావ్యకు ఏం తక్కువని!
డబ్బు విషయంలో గానీ హోదా విషయంలో గాని కావ్యకి ఏ లోటూ లేదు. ఇలా మిడి మిడి జ్ఞానం కలిగిన చుట్టుపక్కల ఉన్న మూర్ఖులు కొందరి విషయంలోనే కావ్య ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎదో ఒకటి చెయ్యాలి. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. కావ్య ఇలా బాధ పడకూడదు.
తను ఏ విషయాన్నైనా సీరియస్ గానే తీసుకుంటుంది. అలా అయితే తన ఆరోగ్యం కూడా పాడవుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి. అని మనసులోనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు రవి.
అలా కొంత కాలం గడిచింది. వున్నట్టుండి ఒక రోజు రాత్రి కావ్య విపరీతమైన కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతోంది. రవికి ఏమీ చెయ్యాలో అర్థం కావటం లేదు. ఏవో ఇంట్లో వున్న టాబ్లెట్స్ వేశాడు. కాస్త తగ్గితే ఉదయమే హాస్పిటల్ కి వెళదాములే అన్నారు. అయినా ఫలితం లేకపోయింది.
చేసేదేమి లేక భయంతో హడావుడిగా భార్యని తీసుకొని ఆ రాత్రే హాస్పటల్ కి బయలు దేరారు.
ఎంతో హుషారుగా చలాకీగా ఉండే కావ్య ని అలాచూస్తుంటే రవికి మనసంతా బాధగా వుంది. ఈ మధ్యన కావ్య కి పిల్లలు లేరన్న బాధ ఎక్కువైంది. మనం సంతోషంగా వున్నా చుట్టు ప్రక్కల వాళ్ళు వుండ నివ్వాలి కదా! కొంత మందికి అదోరకం ఆనందం. ఎదుటి వారు ఏడుస్తుంటే చూసి ఆనందించటం!
రవి ఓ ప్రభుత్వ ఉద్యోగి చాలా సౌమ్యుడు తన పనేంటో! తానేంటో! చాలా నెమ్మదిగా ఉంటాడు. ఎదుటి వారిని పెద్దగా పట్టించుకోడు. అదే విషయం ఎప్పుడు కావ్యకు చెప్తూ ఉంటాడు. తను అప్పుడప్పుడూ బాధ పడ్డా, అది కావ్యకు తెలియ కుండా జాగ్రత్త పడే వాడు. తను బాధ పడినట్లు తెలిస్తే తను ఇంకాస్త ఎక్కువగా ఫీల్ అవుతుందని ఎప్పుడూ సరదాగా ఉంటాడు. కావ్య పిల్లల గురించి ఈ మధ్య కాస్త ఎక్కువగా ఆలోచిస్తుంది. అలాంటప్పుడు తిండి తిప్పలు ఉండదు.
అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అలా ఆలోచిస్తూ కారులో హాస్పటల్ కు బయలు దేరారు కావ్య నొప్పితో ఇబ్బంది పడుతూనే వుంది.
రవి డ్రైవర్ తో కాస్త త్వరగా పోనీ బాబు అన్నాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న తుప్పలు పొదలు ఉంటాయి. చల్లగాలి గురించి కారు విండో ను కాస్త క్రిందికి దింపింది కావ్య. ఆ నిశ్శబ్ద వాతావరణంలో కావ్య చెవులకు ఉన్నట్టుండి ఎక్కడో ఓ పసి బిడ్డ ఏడుపు లీలగా వినిపించింది. అంత బాధలో వున్న కావ్య! ఇది కలా! నిజమా! రోడ్డు మీద జనసంచారంకూడ సరిగా లేదు. మసక మసక చీకట్లు కమ్ము కుంటున్నాయి ఈ సమయంలో ఈ పొదల మధ్య అప్పుడే పుట్టిన పసికందు ఏడ్పు వినపడటం ఏమిటీ? అని భర్త వైపు చూసింది? ఆయన భార్యకు బాగా లేదు అన్న ఆందోళనలో ఉంది కావునా,ఇవన్నీ పట్టించుకొనే పరిస్థితిలో లేడు . మరొకసారి ఏమండి! అని గట్టిగా పిలుస్తూ, ఓ సారి కారు ఆపమని గట్టిగా అరచింది.
రవి ఆందోళనగా ఏమైంది కావ్య హాస్పటల్ దగ్గరకు వచ్చేశాము! ఇక్కడ ఎందుకు ఆపావు?
వామ్టింగ్ గాని వస్తుందా? లేక కూర్చోలేక పోతున్నావా! కొంచం ఓపిక పట్టు దగ్గరకు వచ్చాము కదా! అన్నాడు. అది కాదండి నాకు పసిబిడ్డ ఏడ్పు వినిపిస్తుందండీ వినండి అన్నది.
ఇక్కడ పసిబిడ్డ ఏడ్పు ఏమిటీ కావ్య! నాకు ఏమి వినిపించటం లేదే? …. ఏమి బాబు నీకేమన్నా వినిపిస్తుందా అని డ్రైవర్ ని అడిగాడు రవి ………… లేదు సార్ నాకేం వినిపించలేదు అన్నాడు డ్రైవర్. . అంతా నీ భ్రమ కావ్య, ఇంత అడవిలో పసిపిల్ల ఏడుపేంటి? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. నీకు అలా వినిపించి ఉంటుంది.
త్వరగా హాస్పటల్ కి వెళదాం పదా!
లేదండీ! ఇక్కడే ఎక్కడో నాకు ఆ ఏడ్పు వినిపిస్తుంది!
కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం అండీ! అన్నది నొప్పితో బాధ పడుతూనే కావ్య. డ్రైవర్ కారును కాస్త వెనక్కి పోనివ్వు అన్నారు రవి. సరే సార్, అంటూ మెల్లగా కారు వెనక్కి పోనిచ్చాడు. కావ్య తన బాధనంతా మరచి ఆ చంటి బిడ్డ ఏడ్పు ను ఆలకించటం మొదలు పెట్టింది అలా కొంత దూరం వెళ్లే సరికి మరలా బిడ్డ ఏడ్పు వినిపించింది. రవికి డ్రైవర్ కు కూడ పసి పాప ఏడ్పు వినిపించ సాగింది. అందరూ ఆర్చర్యంగా ఆ దిక్కుగా మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లారు.అక్కడ రోడ్డు ప్రక్కన చెట్ల సందుల్లో ఓ టవల్లో మూటకట్టిన పసికందును పడవేసి ఉండటంతో కావ్య రవి దంపతులు ఆశ్చర్య పోయారు. చుట్టు ప్రక్కల చూస్తే మనుషులు ఎవరూ కనిపించలేదు. కావాలనే ఈ చిన్నారిని వదిలించుకోవటానికి ఇలా వదలి వెళ్ళి ఉంటారు. ఇంకా నయం మనం చూసాము కాబట్టి సరిపోయింది
ఏ జంతువులో చూస్తే లాక్కు పోయేవి. పిల్లలు లేని తమకు ఈ బిడ్డ కనిపించటం ఎంత అదృష్టం, అనుకుంటూ! గబగబా వెళ్ళిగుక్కపట్టి ఏడుస్తున్న పసిగుడ్డును చూసిన కావ్య! ఇంత చిన్న పసికూనను ఈ తుప్పల్లో వదలి వెళ్ళటానికి వాళ్ళకు చేతులెలా వచ్చాయి.
ఏ దైతేనేమి ఆనందంలో ఆ బిడ్డ దేవుని వరప్రసాదమనిభావించిన ఆ దంపతులు ఆనందంలో మునిగి పోయారు. ఇంకా కళ్లు కూడా తెరువని పసికందును ఎవరో అక్కడ పడవేసి ఉంటారని గ్రహించి ఆ దేవుడు తమ మొర ఆలకించి ఉంటాడని మనసులోనే మొక్కుకొని ఇంకా రక్తపు మరకలు కూడా ఆరని ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకొని ఎంతో సంతోషంగా తన గుండెలకు హత్తుకొని కారులో కూర్చుంది కావ్య.

బిడ్డకు హాస్పటల్ లో అన్ని టెస్టులు చేయించి క్షేమంగా ఉందని తెలుసుకొని అలాగే కావ్య కూడా చెకప్ చేయించుకొని కావలసిన మెడిషన్స్ తీసుకొని బిడ్డతో సహా ఆనందంగా ఇంటికి బయలు దేరారు.

ఇంత కాలంగా తానుపడ్డ బాధ నంతా మర్చి పోయి దేవుడిచ్చిన బిడ్డతో సుఖంగా సంతోషంగా కాలం గడిపారు కావ్య రవి దంపతులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!