ప్రేమించు ప్రేమకై!

ప్రేమించు ప్రేమకై!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

అనురాగ్ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. మీ ఋణం ఎన్నిజన్మలెత్తినా తీర్చుకోలేనిదని, గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఎదురుగుండా రామారావు శవం వుంది. పీపీయీ కిట్ లో ఎవ్వరికీ వైరస్ రాకుండా చాలా జాగ్రత్తచర్యలు, బ్రతికుండగానే తనే, తీసుకున్నాడు, రామారావు. రామారావుకు కరోనా వచ్చి, పదిహేను రోజులయ్యింది. దాని పర్యావసానమే ఇది. మరి చుట్టము, పక్కము కానీ, అనురాగ్ గుండెపగిలేలా ఎందుకు ఏడుస్తున్నాడు? రామారావు మరణం, అనురాగ్ ను, ఋణగ్రస్తుడిని చేసింది. రామారావు చూపించిన ప్రేమవల్ల. అమ్మా, ఈ దగ్గు, జలుబు, జ్వరం తగ్గటంలేదు. బహుశ కరోనా అయివుంటుంది. మాస్కులు, పీపీయిా కిట్టుకూడా తెప్పించు అన్నాడు రామారావు. అలాగే నాన్న అంటూ, పీపీయీకిట్ మాస్కులు అన్నీ తెప్పించింది. కూతురు అర్చన. ఆన్లైన్లో డాక్టరును కన్సల్ట్ చేసి, మందులు వాడుతునేవుంది. రామారావు వయస్సు 85ఏళ్ళు భార్యపోయింది. బెంగుళూరులో కూతురు, అల్లుడు దగ్గరే ఉంటున్నాడు. బయట, ఎక్కడ, తిరగడు. బెంగుళూరును అతలాకుతలం చేసి, ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న కరోనా, రామారావు అల్లుడికి, కూతురికీ, వాళ్ళ ద్వారా రామారావుకీ వచ్చింది.                                                             అల్లుడిని మింగేసింది, కరోనా! రామారావుకు వచ్చి, పదిహేను రోజులయ్యింది. పరిస్తితి విషమించి, ఆక్సీజన్ లెవల్స్ పడిపొయ్యాయి. ఆన్లైన్ డాక్టరు, హాస్పిటల్లో జాయిన్ చెయ్యమన్నాడు. హాస్పటళ్ళన్నీ కిట, కిటలాడుతున్నాయి. బెడ్లులేవు. రెండురోజులు వెతగ్గా, వెతగ్గా హాస్పిటల్ నుంచి ఫోను వచ్చింది, పేషంట్ ను, తీసుకురమ్మనమని. హాస్పిటల్ కి వెళ్ళి, జాయిన్ అయ్యేసమయానికి, ఓ ముప్పైఏళ్ళ యువకుడిని తీసుకువచ్చారు. కండీషన్ సీరియస్ అని, ఆక్సీజన్ లెవల్స్ బాగాపడిపోయినయ్ అని, ఎంత బ్రతిమాలాడినా, హాస్పిటల్ వాళ్ళు బెడ్డులేదు, జాయిన్ చేసుకోమన్నారు. భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, అంతా, హాస్పిటల్ లో, చేర్చుకొమ్మనమని బ్రతిమాలుకున్నారు. ఏడ్చారు. కానీ, హాస్పిటల్ వాళ్ళు బెడ్లులేవు, ఇంటికి తీసుకువెళ్ళమన్నారు. అదంతా చూస్తునేవున్న, రామారావు కూతురుతో అమ్మా, అర్చనా, నాకా 85ఏళ్ళు వచ్చాయి. జీవితంలో అన్నీచూసేశాను. అతను, పాపం, చిన్నవాడు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నాబెడ్ అతనికిచ్చి ప్రాణాలు రక్షించమను. ప్రస్తుతం, నాకు బానే ఉంది అన్నారు. రామారావును ఇంటికి తీసుకువచ్చారు. పది రోజుల తర్వాత రామారావు మరణించాడు. ఆ హాస్పిటల్ లో, రామారావు బదులు జాయిన్ అయ్యిన యువకుడే అనురాగ్. ప్రేమించు ప్రేమకై అని నిరూపించాడు రామారావు. ఆ ఋణమెలా తీర్చుకోవాలో తెలియక వెక్కి, వెక్కి, ఏడుస్తున్నాడు, అనురాగ్. అతని భార్య కల్యాణి, అతనిని ఓదారుస్తూ, బాధపడకు, రామారావుగారు చూపించిన మానవత్వంతో, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడుదాం అంది. కల్యాణి మాటలతో తేరుకున్న అనురాగ్, రామారావు మనవళ్ళనిద్దరిని దగ్గరకు తీసుకొని, ఊరడిల్లాడు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు ఎలా కృతఙ్ఞతలు చెప్పుకోవాలో మనకు అర్ధంకాదు. ప్రేమించు ప్రేమకై.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!