అంశం: నేనో వస్తువుని
ప్రియమైన వస్తువు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మక్కువ. అరుణకుమారి
అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న వేళ నేనో అపురూప వస్తువుని
అమ్మ పేగు తెంచుకొని ఈ భువిపై
కనుతెరిచిన వేళ ఇంటిల్లిపాదికి
నేనో అరుదైన అద్భుత వస్తువుని
చిరు చిరు నవ్వుల ,చిట్టిపొట్టి నడకల పారాడే వేళ
నేనో కదిలే చిత్ర విన్యాసాల వస్తువుని
యవ్వనారంభ వేళ తుళ్ళింతల ,కవ్వింతల పదనిసలొలుకుతూ వీక్షించే కనులకు
నేనో నయనానందకర వస్తువుని
పరిణయ మహోత్సవ శుభవేళ
నా పాణిగ్రహణం ఒనరించిన ఆవేళలో
నా రారాజుకు నేనో తన గృహసామ్రాజ్యం ఏలే శాశ్వత వస్తువుని
తొలిచూలు ధరియించి వంశోద్ధారుకున్నందించే వేళ
మెట్టినింటిన నేనో పూలపాన్పుపై నడిచే అపురూప వస్తువుని
తోడుగా,నీడగా ,కష్ట సుఖాలను ,పంచుకొని ,ఇష్టంగా మసలుకొని,
భవ బంధాలను ఈడేర్చిన వేళ
ప్రియమైన శ్రీవారికి నేనో ప్రియాతిప్రియమైన వస్తువుని.
సర్వవేళలందు,సకల బంధాలందు
నేనో వస్తువునేనా?
అదే మరి నాకు నేనే నచ్చని ప్రియమైన నేనో వస్తువుని!