శెట్టి కొట్టు

శెట్టి కొట్టు

రచయిత్రి: మంగు కృష్ణకుమారి

మా ఊర్లో మా సందుకి గొప్ప ప్రచారంతెచ్చి పెట్టినది మా శెట్టికొట్టే. వీధి చివర చిల్లర సామాన్లు అమ్మే కొట్టే అయినా, అక్కడ దొరకని వస్తువు ఉండదు. ఆ రోజుల్లో ఎవరికీ నెలంతటికీ సరిపడా సరకులు కొనుక్కొని ఉంచుకోగలిగే స్థోమతు ఉండేది కాదు. అలా నెలకి ముందే కావలసిన సామాన్లన్నీ ఒక‌ పద్దుపుస్తకంలో రాసి నాలాటి పిల్లలకి ఇచ్చి పంపిస్తే, శెట్టిగారు ఆ సరకులన్నీ పొట్లాలు కట్టి ఇచ్చి, మళ్ళా తన పద్దు పుస్తకంలో ఎక్కించుకొనేవారు. ఇంత మంచి మనిషంటే ఎందుకో, చాలామంది పెద్దలు కూడా ఎగతాళిగా
మాటాడ్డం వినేవాళ్ళం.
“గురవయ్యా? వామ్మో ఒకటో తారీకున డబ్బు కట్టి తీరాలంటాడు”
“అరువు సరకులకి ధర ఎక్కువ వేస్తాడండీ”
“మనకి ఇంకో దారిలేకగాని, ఈ కోవటాడితో పడలేకపోతున్నాం.”
“ఇహ తప్పదని తీసుకుంటున్నాం కానీ, ఇష్టమయీ కాదు”ఎందుకో ఇలా మాటాడ్డం నాకు
నచ్చీదికాదు. ఏ పిల్లలకి చిరుతిళ్ళు కావాలన్నా శెట్టి కొట్టే. నాలుగు బంగాళదుంపలు ఉల్లిపాయలూ శనగపిండి కావాలన్నాశెట్టి కొట్టే కదా!మరెందుకు వాళ్ళని తిట్టడం.ఇంటికి ఏ చుట్టమో వచ్చి చేతిలో ఓ రూపాయో, అర్థో ఉంచితే పరుగెత్తుకు శెట్టి కొట్టుకెళ్ళో ఓ మరమరాల ఉండో, కొబ్బరుండో కొనుక్కొని తినీడమే.
“ఆ శెట్టుగారు మరో షాప్ తీస్తారట. మన పిల్లల మహత్యం” రుసరుసలాడేది అమ్మ.

కాలం ముందుకెళ్ళీ కాస్త నెలవారీ సరకులు ఒక్కసారే కొనుక్కొనే స్థోమతు వచ్చిన వాళ్ళు బజార్ లోపెద్ద దుకాణాల్ల నించీ, సామాన్లు తెచ్చుకోడం మొదలెట్టేరు.

నాకు మాత్రం శెట్టిగారి కొట్లో దుంపల వాసనా, సామాన్లు వాసనా మహా ఇష్టం. చిల్లర తిళ్ళకి అక్కడకి వెళ్ళి తెచ్చుకోడమే మోజు.
నన్ను చదువలకి పై ఊరు పంపించేసారు. ఎక్కడున్నా, ఓ చిల్లర కొట్టు చూస్తే నాకు మా గురవయ్య శెట్టిగారి దుకాణమే తలపులోకి వస్తుంది. అది మా ఇంటి మీద బంధంతో పెనవేసుకున్నది.

ఉరుకుతూ రామం వచ్చేడు. అచిన్నాన్న కొడుకు‌. “అన్నా, గురవయ్య శెట్టి హఠాత్తుగా చనిపోయేడుట. కొడుకు శరభయ్య తేరుకోలేక పోతున్నాడుట” నాకు చాలాబాధ వేసింది. వెళ్ళాలంటే పరీక్షలు. ప్రాక్టికల్స్. అన్నీను. అన్నీ తెముల్చుకొని మా ఊరు వెళ్ళి చూసేను. గురవయ్య శెట్టి కొట్టు తాళం వేసింది. ఆవిడ‌ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళిపోయిందిట. ఈ దుకాణం అమ్నేసి అక్కడ మాల్ ఓపెన్ చేసే ప్రయత్నం వాళ్ళ తమ్ముడు చేస్తున్నాడుట. పిన్నిచెప్పింది.

నా బాల్యం అనే ముత్యాల‌పేట తెగిపోయినట్టే ఉంది నాకు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!