మారిన మనిషి

మారిన మనిషి

రచయిత: స్వాతికృష్ణ సన్నిధి

         అదొక అందమైన పల్లెటూరు. పైరవరం పేరుకు తగ్గట్టే పచ్చని పైరుతో కళలాడుతూ ఉండేది.అన్నీ మధ్య తరగతి,పేద కుటుంబాలకు చెందిన వారే. వారి వారి చేతి వృత్తులను నమ్ముకుంటూ పిల్లలకు చదువుతో పాటు ఆ వృత్తిపై కూడా మమకారాన్ని కలిగిస్తూ వుండేవారు.అన్నిటికీ మించి మంచి మనసుతో కులమతాలను పక్కనెట్టి బందువుల్లా కలిసి మెలిసి వుండేవారు.
బాగా ధనవంతుల కుటుంబాలు రెండు,మూడు కంటే లేవు.అందులో ముకుందం గారి కుటుంబం ఒకటి.డబ్బున్న అహంతో కళ్ళు నెత్తి మీద ఉండేవి ఆయనకు.ఇంట్లో నుండి బయటకు కుటుంబ సభ్యులు ఎవరిని రానిచ్చేవారు కాదు.ఏ సరుకులు కావాలి అన్నా ఒక్క ఫోన్ చేసి పట్నం నుండి కావాల్సిన వస్తువుల్ని,
సరుకుల్ని కూడా తెప్పించుకునేవారు.
వారి పక్క వీధి చివర చిల్లర కొట్టు ఉండేది.ఆమె పేరు రాజమ్మ.అందరికి కావాల్సిన వస్తువుల్ని పద్దు రాసుకుని కూడా ఇచ్చేది.ఏ సరుకు కావాలన్నా అక్కడ దొరికేది.సరుకు కూడా నాణ్యతతో ఉండేది.తన దగ్గర లేని సరుకైనా కూడా తాను పట్నం వెళ్ళినపుడు తెచ్చి పెట్టేది.అందరూ కూడా వ్యాపారం దగ్గర మంచి కాదు మాటకారితనం ఉండాలని అన్నా కూడా మీ డబ్బు ఏమవుద్దీ.ఇయాల కాపోతే రేపిత్తారు అనేసి నవ్వేసేది.
ఊరంతా నచ్చే మెచ్చే ఆ కొట్టు ముకుందం గారికి అత్యవసరమైనా నచ్చేది కాదు. ఇలా పిల్లలకు కూడా ఆ అహం ఎక్కడ అబ్బుతుందో అని ముకుందం గారి భార్య రాధమ్మ భయపడేది.ఇలా రోజులు గడుస్తున్నాయి.
అనుకోని ఓ వింత వ్యాధి మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తోంది.రాకపోకలు బంధు చేశారు.ఇరుగు పొరుగు మాటలు లేవు.కలయికలు లేవు.అందరూ భయంతో గడిపేవారు.ఊళ్ళో వారికి ఆ చిల్లర కొట్టు ఆధారం ఉంది కాబట్టి ఏ క్షణంలో వెళ్లినా రాజమ్మ సరుకులు ఇచ్చి పద్దు రాసుకునేది. డబ్బు కోసం ఇబ్బంది పెట్టేది కాదు.మాములు పరిస్థితులు వచ్చాక ఇవ్వచ్చులే .
పట్టుకెళ్లండి.వ్యాపారానికి నమ్మకం పెట్టుబడి.నా ఊరోళ్లను నేను కాపోతే ఎవరు నమ్ముతారు అనేది.అలా ఆ కొట్టు అవసరానికి అక్షయ పాత్ర అయ్యింది.
ఆ ఊళ్ళో ఆ రోగం రాకుండా తగు జాగ్రత్తలు ఊరి వారంతా పాటిస్తున్నారు.ఎవరు బయటకు వెళ్ళకుండా,ఎవర్ని రానీయకుండా చర్యలు తీసుకున్నారు. ఇంతలో ముకుందం కుటుంబంలో సరుకులు నిండుకున్నాయి.ఫోన్ చేస్తే తెచ్చే మనిషి ఆ వింత రోగం తనకు వచ్చిందని ,రాలేనని–ఎవరినైనా పంపుదాం అన్నా కుదరదని,తాము కూడా రావడం మంచిది కాదు కాబట్టి ఊళ్ళో ఎక్కడైనా కొనుక్కోమని చెప్పాడు.
ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.ఎందుకంటే ఏనాడు ఆ ఊరి వీధుల్లో అడుగెట్టి కానీ ఎవరినైనా పలకరించి కానీ ఎరుగడు. ఈ రోజు ఎలా అనుకుంటూనే పిల్లలు కోసం ఆలోచించి చిల్లర కొట్టుకు వెళ్ళాడు.ఎవరు జనం తిరగకపోయినా అక్కడక్కడా చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
కొట్టుకొచ్చేసరికి రాజమ్మ కూర్చోమని కుర్చీ వేసింది. రాజమ్మ తమ్ముడు శీనయ్య ఎందక్కా కూర్చునేది.మన సేవలు కావాలి గాని ఈ కొట్టు అక్కర్లేదు ఆయనకు.ఇప్పుడైనా తప్పక వచ్చాడు.లేకపోతే ఏనాడన్నా మన కొట్టు ముఖం చూసాడా. అసలు మనం అంతా కలిసి కట్టుగా చాకలి,మంగలి,ఇలా ఏ వృత్తుల వాళ్ళు కూడా ఆ డబ్బున్న అయ్యగారికి ఏ సేవ చేయకుంటే తెలుసోస్తది.అందుకు కావాలి మనం అంటుంటే రాజమ్మ శీనయ్యను వారించి లోపలకు పంపేసింది.
ఆడి మాటలేమి మనసులో పెట్టుకోకండయ్యా ఏమి కావాలి చెప్పండి.నేనే మీ ఇంటికి అట్టుకొస్తా అంటుంటే చచ్చిన శవంలా మారిన ముకుందం తడిసీ తడవని ఓ చీటిని రాజమ్మ చేతిలో పెడుతూ తప్పు తెలుసుకున్నా, సిగ్గు పడుతున్నా,ఎప్పుడైనా ముందు ఊరి వాళ్లే అండగా వుంటారు.మంచితనం,మానకత్వంతోనే ఏదయినా సాధ్యపడుతుందని తెలుసుకున్నాను.ఇన్నాళ్లు ధన గర్వముతో అందరిని చులకనగా చూసాను.ఈ రోగం నాకు గురువై నా అంహంకార రోగాన్ని కుదిర్చింది రాజమ్మ అన్నాడు గద్గద కంఠంతో.!
డబ్బున్నా లేకపోయినా ఎవర్ని చులకన చేయకూడదయ్యా.ఎవరి గొప్పదనం వారిదే అని రాజమ్మ చెప్పిన మాటలకు కళ్ళు నీళ్లు చిప్పరిల్లాయి..ఆరోజు నుండి మారిన మనిషిగా ప్రజలలో ఒకడిగా మెలిగాడు ముకుందం..!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!