శేష జీవితం

శేష జీవితం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్.

“అక్కయ్య! ప్రసాదు నీకు కూడా ఫోన్ చేశాడా?” ఫోనులో అడిగాడు అన్నపూర్ణను పరంధామయ్య.
ఆ చేసాడురా! అదే వచ్చే శుక్రవారము గృహప్రవేశానికి రమ్మని” చెప్పింది. నీకు గృహప్రవేశం అని చెప్పాడా? అన్నాడు పరంధామయ్య. గృహప్రవేశం అంటే, అక్కడ ఎక్కడో పెద్ద వాళ్ల కోసం వృద్ధాశ్రమం లాంటిది కట్టారట. అందులో ఒక ఇల్లు లాంటిది కొంటున్నాడుట. వాళ్ళ అమ్మ పోయి ఆరు నెలలే కదా అయింది. అప్పుడే వాళ్ళ నాన్న బరువు అయిపోయినట్టున్నాడు అంది అన్నపూర్ణ. ఆరు నెలలకే తండ్రిని బాధ్యతగా చూడలేకపోతున్నాడు. వాడిని ఎంత కష్టపడి పెంచారు అన్నయ్య, వదిన అన్నాడు. కష్టపడి పెంచబట్టే యోగ్యుడై, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బు గొప్ప చూపించడానికి ఏకంగా అనాధాశ్రమంలో కొంత భాగం కొని మరీ తండ్రిని పంపేస్తున్నాడు. అంది అన్నపూర్ణ. మా పిల్లలే నయం. నా భార్య పోయి అయిదేళ్ళు అయ్యింది. తలోక ఆర్నెల్లకు ఒకడు నన్ను పంచుకుంటున్నారు. విసుక్కుంటూనో, తిట్టుకుంటూనో నన్ను చూసుకుంటున్నారు. అంతేగాని నన్ను ఇలాగా వృద్ధాశ్రమంలో పెట్టలేదు అన్నాడు. నా పరిస్థితి అదే కదరా తమ్ముడూ. ఎవరికి అవసరం ఉంటే, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. అంతే గానీ ఇలా వేరే ఎక్కడా పంపించేయలేదు అంది అన్నపూర్ణ. విధి విచిత్రం కాకపోతే ఉన్న నలుగురు తోబుట్టువులకు, జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మిగిలాము. అన్నయ్య, వదిన అయినా జంటగా ఉంటారని అనుకుంటే, వదిన పోయి అన్నయ్య వంటరివాడై పోయాడు. వదిన ఉన్నన్నాళ్ళు, ఏ పండుగకో, పబ్బానికో అన్నయ్య వాళ్ళ ఇంట్లో నలుగురం కలిసే అవకాశం ఉండేది” విచారంగా అన్నాడు పరంధామయ్య. అన్నయ్యను వృద్ధాశ్రమంలో పెడితే పెట్టాడు అనుకో. గృహప్రవేశం అంటూ అందరికీ ఫోన్లుచేసి పిలిచి మరీ చూపించాలా? ఇప్పుడు మన పిల్లలు మన మంచిచెడులు చూసుకుంటున్నారు.  రేపు వీళ్ళకి కూడా కొత్త ఆలోచన వస్తుంది కదా!  వాడికంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఒక మంచి వృద్ధాశ్రమంలో కొంత భాగం కొని పెడుతున్నాడు. మన వాళ్ళకి డబ్బులు అంతంత మాత్రమే. మనల్ని ఇల్లు, ఇల్లు తిప్పడం మానేసి అనాధాశ్రమంలో పడేస్తారు. లేనిపోని కొత్త ఆలోచనలు ఇస్తున్నాడు వీడు అంది అన్నపూర్ణ నిష్టూరంగా. రమ్మని పిలిచాడు కదా! పెద్దరికం నిలబెట్టుకోవడం
కోసమైనా వెళ్లాలి. అక్కడే కలుద్దాము అంటూ ఫోన్ పెట్టేసాడు పరంధామయ్య. పచ్చటి చెట్లతో మధ్య మధ్య చిన్న కుటీరాలు నిర్మించి ఉన్న ఆశ్రమంలోకి అడుగు పెట్టారు పరంధామయ్య, అన్నపూర్ణలు. చెట్లమీద పక్షుల కిలకిలారావాలతో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ కుటీరాలు ఉండి, మధ్యలో ఒక ధ్యాన మందిరం ఉంది. ఒకపక్కన గ్రంథాలయం ఉంది. చుట్టూ వాకింగ్ చేయడానికి వీలుగా బండలతో వేసిన దారి ఉంది. ఆ పక్కన కూర్చోడానికి సిమెంట్ బెంచీలుతో ఉన్నాయి. అందరికీ అందుబాటులో శుభ్రతతో కూడిన వంటశాల ఉంది. అందులో ఒక వైపుగా పెద్దగా ఉన్న, నాలుగు పడకలు కలిగిన కుటీరం ఒకటి ఉంది. దాని ముందు జనాలు కోలాహలంగా ఉంది. అదే అన్నపూర్ణ మేనల్లుడు ప్రసాదు  తీసుకున్న భాగం. నాలుగు గదులు విశాలంగా,  సదుపాయంగా ఉన్నాయి. ఆ గదులలో నాలుగు టీవీలు, మంచాలు కూడా  ఉన్నాయి. చిన్న పూజా కార్యక్రమము, భోజనాలు అయిపోయిన తర్వాత ప్రసాదు మాట్లాడటం మొదలెట్టాడు. భార్యా భర్త ఒక్కసారే పోవడం అన్నది జరగదు కదా! ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలిపోతారు. ఇద్దరూ ఉన్నంత కాలము ఒకరికొకరు తోడు ఉంటారు. కానీ, ఒకరు పోయిన తరువాత జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఆరు నెలలకే నాన్నగారు ఒంటరి అయిపోయారని గ్రహించాము. రోజంతా ఆయనతో మేము ఉండలేము. మా జీవనోపాధి కోసం మేము అందరము ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటాము.
నాన్నగారు నాతో, నాకు అమ్మ లేని లోటు ఎక్కువగా అనిపిస్తోంది. నేను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో ఉంటాను. నా తోటి వాళ్లతో కాలక్షేపం జరుగుతుంది అని కోరారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మీరందరు తోబుట్టువులు కూడా నాన్నలాగా జీవిత భాగస్వామిని కోల్పోయి చాలా ఏళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. బహుశా, మీరు కూడా ఇలాగే బాధపడుతూ ఉండవచ్చు. అందుకే నాన్నతో పాటు మీరు కూడా కలిసి ఒకే చోట ఉంటే, చిన్నప్పట్నుంచి మీకు ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ ఉంటారని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు ఇష్టం అయి, మీ పిల్లలు ఒప్పుకుంటేనే మీరిక్కడ ఉండవచ్చు. ఇక్కడ మీరు వంట వండుకోవక్కర్లేదు. మీకు భోజనం వాళ్ళే చేసి పంపిస్తారు. జీవితకాలమంతా మాతో ఉంటూ, మా కష్ట సుఖాలు అనుభవించారు. ఇప్పటికి కూడా మాతో పాటు ఉంటూ, మా సమస్యలు మీకు భారం కాకూడదు. మీ శేష జీవితం మీకు నచ్చినట్టుగా ఉంటారనే ఈ ఏర్పాటు చేశాను” అన్నాడు. ప్రసాద్ చేసిన పనికి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!