స్నేహితులు

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

స్నేహితులు

రచన: సుశీల రమేష్

రోహిత్, అంకిత్ ఇద్దరూ నర్సరీ నుండి ఇప్పుడు ఆరో తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారు అదే స్కూల్లో. రోహిత్ నర్సరీ క్లాస్ లో మొదటి రోజు ఏడుస్తున్నప్పుడు అంకిత్ చాక్లెట్లు ఇచ్చి రోహిత్ కళ్ళు తుడిచి నప్పుడు ఏం అర్థమైందో కానీ రోహిత్ కి ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.

ఆనాటినుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ ఇద్దరి మధ్యలో గొడవ జరగలేదంటే ఆ చిట్టి మనసులలో స్నేహం అనే నిజం మొలకెత్తింది అది ఈనాటికీ కొనసాగుతోంది.

రోహిత్ శ్రీమంతుడు, అంకిత్ మధ్యతరగతి ఇంటి బిడ్డ, తరగతిలో ఇద్దరికీ ఒకేలా మార్పులు వచ్చేవి, కానీ అంకిత్ చదువులో చురుకైన వాడు, రోహిత్ కి ధైర్యసాహసాలు ఎక్కువ.

రోహిత్ కి టీచర్ చెప్పిన పాఠం అర్థం కాకపోతే అంకిత్ చక్కని ఉదాహరణ తో వివరించి చెప్పేవాడు.అలా సాగుతున్న వీరి స్నేహం మధ్యలోకి గిరి వచ్చాడు. గిరి ఎవరో కాదు రోహిత్ మేనత్త కొడుకు…

పై నుంచి కింద వరకు టెక్కు ఎక్కువ గిరికి వీళ్ళ తరగతిలోనే చేరాడు. మధ్యాహ్నం భోజనం సమయంలో రోహిత్ అంకిత్ ఇద్దరూ పంచుకుని తినడం అలవాటు చిన్ననాటి నుండి.

గిరి కి నచ్చేది కాదు, రోహిత్ ఎందుకు అంకిత్ టిఫిన్ తింటావు నువ్వు తెచ్చుకున్నావు కదా అది తినొచ్చు కదా అంటాడు గిరి.తింటే ఏంటట అంటాడు రోహిత్. వాళ్లు లేని వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో తెలియదు అంటాడు గిరి.

రోహిత్ కి కోపం వచ్చింది. ఇంకోసారి మా మధ్యలో కి వచ్చావ్ అనుకో బాగుండదు. అంకిత్ లేనివాళ్ళు కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు.

మరి నువ్వు పుట్టిన దగ్గర నుండి మా ఇంట్లోనే ఉంటూ తేరగా తింటున్నా ఎప్పుడైనా నేను గానీ ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా ఏమైనా అన్నామా అన్నాడు రోహిత్. మనం బంధువులం అంటాడు గిరి. “నాకు బంధుత్వం కన్నా ఎక్కువ అంకిత్ అంటాడు రోహిత్”. ఆ రోజు నుండి గిరి ఎలాగైనా రోహిత్ కి అంకిత్ ను‌ దూరం చేయాలనే దురాలోచనతోకక్ష పెంచుకుంటాడు.

రోహిత్ అంకిత్ ఇద్దరిని అంతా జంట కవులు అంటారు. వీరి స్నేహం గురించి తెలిసిన టీచర్లు. చిన్ననాటి నుండి ఇద్దరు ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవుతున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఉంటుంది కానీ, వీళ్లు స్కూల్లో చేరినప్పటి నుండి వీళ్ళిద్దరికీ ఫస్ట్ ప్రైజ్ లు రెండు ఇవ్వాల్సి వస్తుంది.

ఏ విషయంలోనైనా వీరిద్దరికీ పోటీ ఉండేది కాదు స్కూల్లో ఆ విషయం గిరి కి మింగుడు పడేదికాదు.

రోహిత్ పుట్టినరోజు సందర్భంగా తన తరగతి పిల్లలందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు సాయంత్రం. పిల్లలంతా వచ్చారు చాలా ఘనంగా చేస్తున్నారు రోహిత్ పుట్టినరోజు వేడుక. రోహిత్ మాత్రం అంకిత్ చేయి వదలకుండా తన ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు.

కాసేపటికి రోహిత్ మెడలో ఉండాల్సిన గొలుసు కనిపించడం లేదని కలకలం రేగింది. అది మామూలు గొలుసు కాదు తరతరాలుగా ఆ వంశంలో మొదటగా పుట్టిన మగ పిల్లవాడికి ఆనవాయితీగా వేసే గొలుసు. అక్కడున్న వాళ్లందర్నీ తనిఖీ చేయగా అంకిత్ జేబులో దొరికేసరికి అంకిత్ దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకంటే తను దొంగతనం చేయలేదు. అక్కడున్న వాళ్లంతా తిట్టే సరికి మౌనంగా ఇంటికి వెళ్లిపోయాడు ఏడుస్తూ అంకిత్.

వీళ్ళిద్దరి స్నేహబంధం విడిపోయినందుకు గిరి ఆనందానికి అవధులు లేవు.

స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది.
గిరిని ప్రిన్సిపాల్ గారు పిలిచి ఏదో చెప్పి పంపించారు… కాసేపటికి ప్రిన్సిపాల్ గారి ఫోను కనబడలేదు ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు రోహిత్ సార్ ఫోన్ మిస్ అయ్యే ముందు ఎవరైనా వచ్చారా మీ దగ్గరకు అని అన్నాడు. గుర్తు చేసుకున్న ప్రిన్సిపాల్ గారు ఆ గిరి వచ్చాడు అని చెప్పారు.

గిరి ని పిలిచి తనిఖీ చేయగా గిరి జేబులో ఫోన్ దొరికింది.. గిరి మాత్రం నేను తీయలేదు ఫోను ఎవరో నా జేబులో పెట్టి ఉంటారు అన్నాడు.
అంత పక్కాగా ఎలా చెప్పగలవు. అని రోహిత్ అడిగేసరికి గిరి నీళ్లు నమలుతున్నాడు.

నేను చెప్పనా ఆనాడు అంకిత్ జేబులో గొలుసు వేసింది నువ్వే. అంకిత్ దొంగ కాదు, అసలు దొంగవి నువ్వే కాదని నీ స్నేహితుడు ముందు చెప్పు అన్నాడు రోహిత్.

గిరి ఏడుస్తూ నన్ను క్షమించండి అంటాడు. సారీ సార్ గిరి చేత ఈ నిజం చెప్పించాలని మీ ఫోన్ మేము గిరి జేబులో వేసాము. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో అంతే సర్ అంటాడు రోహిత్. మరి అంత తెలిసిన వాడివి అంకిత్ తో ఎందుకు మాట్లాడటం లేదు అంటారు టీచర్.

అందరూ తిడుతుంటే చేయని తప్పుకు మౌనం గా ఉన్నందుకు నాకు కోపం వచ్చింది అందుకే సార్ అన్నాడు రోహిత్.

ఏరా అంకిత్ ఇప్పటికైనా నోరు విప్పు తావా నేను దొంగను కాను అని చెప్తావా లేదా అని అడుగుతాడు రోహిత్.

వెంటనే అంకిత్ వచ్చి రోహిత్ ని హత్తుకున్నాడు ఏడుస్తూ. ఇడియట్ తప్పు చేస్తే బాధ పడాలి గాని చేయని తప్పుకు ఎందుకు బాధ పడాలి అన్నాడు రోహిత్….

చూడు గిరి మా తాతయ్య ఎప్పుడు చెప్తారు నాతో ఒక మాట అదేంటంటే, స్నేహం అంటే ఏ ప్రతిఫలాన్ని ఆశించదని, నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల నుండి మనసులకు చేరుకుని, తన పరిమళాన్ని తరతరాలకు పంచుతుందని, నా అంకిత్ ఎలాంటి వాడో నాకు తెలియదా, విడిపోయింది అనుకున్నా మా స్నేహబంధాన్ని ఎదురెళ్లి తెచ్చుకున్నాను నేను అంటాడు రోహిత్.

రోహిత్ మాటకు అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టి రోహిత్ ను అభినందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!