నిర్ణయం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

నిర్ణయం

రచన: యం.టి.స్వర్ణలత

విజ్ఞ తాము ఎప్పుడూ కూర్చునే కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఎదురుచూస్తూ ఉంది.డిమ్ లైట్ లైట్ వెలుగు…మంద్ర స్థాయిలో వినిపిస్తున్న సంగీతం… అంతా ఓ అద్భుత ప్రపంచంలా ఉంది.
మనసు హాయిగా గాలిలో తేలుతుంది…. అవును ఇదే టేబిల్ దగ్గర తానూ అనురాగ్ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలను సెలబ్రేట్ చేసుకున్నారు…ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తడుముతున్నాయి.
కాలేజీ బ్యూటీగా..తెలివైన చురుకైన అమ్మాయిగా విజ్ఞకు మంచి పేరుంది. రోజూ ఎన్నో లవ్ లెటర్స్…వస్తుండేవి.ఎన్నో కళ్ళు తనవైపు ఆరాధనగా చూస్తూవుండేవి… అవేవి పట్టించుకోకుండా తన చదువే లోకంగా ఉండేది విజ్ఞ. అలాంటి సమయంలో తన క్లాస్ లోనే కొత్తగా జాయిన్ అయ్యాడు అనురాగ్..
వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ తో తనూ కాలేజీ మారాడు.విజ్ఞకు చదువులో పోటీగా మారాడు. చక్కని ఆకట్టుకునే రూపంతో.. బిడియంగా తక్కువగా మాట్లాడే తత్వం తో విజ్ఞను ఆకట్టుకున్నాడు…చదువులో వచ్చే డౌట్స్ తనతో చర్చించేవాడు.. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది, రాను రానూ అది ప్రేమగా మారింది…
ఆ సంవత్సరం రిజల్ట్స్ లో మొదటి స్థానంలో విజ్ఞ..రెండవస్థానంలో అనురాగ్ నిలవటంతో…ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మొదటిసారిగా ఇదే హోటల్లో… ఇదే టేబుల్ దగ్గర కలిసినప్పుడు అనురాగ్ తన ప్రేమ సంగతి విజ్ఞతో చెప్పాడు.
మొదటిసారిగా ప్రేమ అనే మాట వినటం తో కంగారుపడింది విజ్ఞ… తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని అక్కడి నుంచి వచ్చేసింది…ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు..సారీ అంటూ మెస్సేజెస్ పెట్టినా పట్టించుకోలేదు…
వారం తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళు అనురాగ్ కోసం వెతికాయి …కానీ తను ఎక్కడా కనబడలేదు… తను వస్తే ఏంటీ రాకుంటే ఏంటీ…అయినా నాకెందుకు… అనుకుంది కానీ సాయంత్రం అయ్యేకొద్దీ అదే ఆలోచన ఎక్కువయ్యింది. తన స్నేహితురాలిని అనురాగ్ కనిపించడం లేదేంటి అని అడిగింది.
“అయ్యో నీకు తెలియదా…అనురాగ్ కి ఆక్సిడెంట్ అయ్యింది… పరధ్యానంగా రోడ్డు దాటుతుంటే…కారు గుద్దేసింది… హాస్పిటల్ లో ఉన్నాడు “అంది వేణి.
ఆ వివరాలను బట్టి తను ఫోన్ కట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయ్యింది అని అర్థం అయ్యింది
ఏ హాస్పిటల్ , ఏంటీ వివరాలు తెలుసుకున్న విజ్ఞ కాలేజీ నుండి వస్తూ…హాస్పిటల్ కి వెళ్ళింది
బెడ్ మీద కాలు చేయి విరిగి దీనంగా ఉన్న అనురాగ్ ని చూడగానే హృదయం ద్రవించి పోయింది… ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది… కానీ అనురాగ్ గురించి ఆలోచించకుండా ఉండలేక పోయింది… ఆమెకు అనురాగ్ పట్ల తన మనసులో ఉన్న ప్రేమ అర్థం అయ్యింది… అవును తాను అనురాగ్ ని ప్రేమిస్తుంది . అందుకే ఇంతగా తల్లడిల్లిపోతుందని అర్థం అయ్యింది. మరుసటి రోజు హాస్పిటల్ కి వెళ్ళి తానూ ప్రేమిస్తున్న విషయం చెప్పింది.విషయం విన్న అనురాగ్ ఎగిరి గంతువేసాడు…కాలునొప్పి చేయి నొప్పి మర్చిపోయి…అతని ఆనందం చూసి ముసిముసిగా నవ్వింది విజ్ఞ.
ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు.. చదువు పూర్తై ఉద్యోగం లో చేరాక ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.తనకు ఫారిన్ లో జాబ్ అపర్చూనిటీస్ వచ్చినప్పటికీ… అనురాగ్ కోసం వదిలేసుకుంది..జాబ్ రావటం లేదని డిప్రెషన్ కి గురవుతున్న అనురాగ్ కి ధైర్యం ఇవ్వడం కోసం తనకు వచ్చిన ఉద్యోగాలను కాదనుకుంది…ముందు అనురాగ్ కి ఉద్యోగం వచ్చాకే తన ప్రయత్నాలు మొదలుపెట్టాలనుకుంది…ఎట్టకేలకు అనురాగ్ మంచి ప్యాకేజి తో జాబ్లో జాయిన్ అయ్యాడు..విజ్ఞ ఆనందానికి అంతులేదు.త్వరలో పెద్దలకు తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్ళికి ఒప్పించాలనుకుంది.
ఎన్నిసార్లు పెళ్ళి గురించి ప్రస్థావించినా మాట్లాడకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టాడు.. ఒకసారి గట్టిగా నిలదీసేసరికి…తను పనిచేస్తున్న సంస్థ యజమాని తన ఒక్కగానొక్క కూతురిని పెళ్ళిచేసుకో మన్నాడని.. దానితో తనకు మంచి భవిష్యత్ ఉంటుందని తన అవకాశవాదాన్ని బయటపెట్టాడు.
కొయ్యబారిపోయింది విజ్ఞ… ఆశలన్నీ పేకమేడల్లా నేల రాలుతుంటే… చేష్టలుడిగి నిలబడిపోయింది. ఆ దెబ్బనుండి కోలుకోవటానికి చాలా కాలం పట్టింది విజ్ఞకు…
ఇప్పుడిప్పుడే అనురాగ్ ను మర్చిపోతున్న టైమ్ లో….అనురాగ్ నుండి పోన్… మొదట ఎత్తలేదు…వాట్సప్ మెస్సేజెస్… ఏం పెట్టాడో అన్న ఆతృత ఆపుకోలేక చూసింది….
“సారీరా..ఓక్కసారి మాట్లాడు ప్లీజ్… ప్లీజ్” ఇదీ మెస్సేజ్.
ఈ సారి ఫోన్ లిఫ్ట్  చేసింది…
తెలియకుండానే కళ్ళ నుండి నీళ్ళు కారిపోతున్నాయి అనురాగ్…తన ప్రాణం…
“ప్లీజ్ రా …నిన్ను కలిసి మాట్లాడాలి..సాయంత్రం ఆరింటికి కాఫీ డే కి రా ..ప్లీజ్…” బ్రతిమాలుతున్నాడు ఫోన్ లో అనురాగ్.
అనురాగ్ పిలిస్తే వెళ్ళకుండా ఉండగలదా… పిచ్చి మనసు అప్పుడే అనురాగ్ ను కలవాలని తొందరపడుతుంది. ఓ అరగంట ముందే వెళ్ళి కూర్చుంది విజ్ఞ.. ముఖం వేలాడేసుకుని వచ్చాడు అనురాగ్… వస్తూనే…
“సారీ విజ్ఞా…నిన్ను చాలా బాధ పెట్టాను…నన్ను క్షమించరా..ఐ మిస్ యూ ఎ లాట్….అది ఇప్పుడు
నాకు బాగా తెలిసివచ్చింది…మనం పెళ్ళి చేసుకుందాం” అన్నాడు అనురాగ్  విజ్ఞ కంటి నుండి నీటి బొట్టు జారి చేతిమీద పడింది.
“అయ్యో ..విజ్ఞా ఏడుస్తున్నావా…వద్దురా ఇక నిన్ను కంట తడి పెట్టించను…”కళ్ళు తుడవబోయాడు వెనక్కి జరిగింది విజ్ఞ…
“చూడు అనురాగ్… నీ కోసం నేను ఎంతో బాధపడ్డాను ఎన్నో పోగొట్టుకున్నాను …మన బంధం నిలబెట్టుకోవాలని… కానీ…నువ్వు అవకాశవాదంతో నన్ను వదిలేసావు… అప్పుడు నేనెంత బాధ పడ్డానో నీకు తెలియదు…ప్రాణం పోయినంతపనైంది… మరోసారి నీకు ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు మళ్ళీ మరోసారి బాధపడే ఉద్దేశ్యం నాకు లేదు
గుడ్ బాయ్….” అంటూ కారే కన్నీటిని తుడుచుకుంటూ వడివడిగా బయటకు అడుగులు వేసింది…
ఇల్లు చేరాక తన స్నేహితురాలు వేణికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది
“మంచిపని చేసావు…వాళ్ళ బాస్ కూతురు ఎవరినో ప్రేమించానని అనురాగ్ ను రిజెక్ట్ చేసిందంట..అందుకే
మళ్ళీ నీ కోసం వచ్చాడు” అంది వేణి.
తన నిర్ణయం సరియైనదే అని స్థిరంగా అనుకుంది విజ్ఞ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!