మన బంగారం మంచిదైతే?

       *మన బంగారం మంచిదైతే?*

 

కావడి భుజంపై బెట్టుకొని బ్రహ్మం ఆది ఉంటున్న డైమండ్ అపార్ట్ మెంట్స్ దగ్గరకి వస్తూ ఉన్నాడు.ఆది ఎవరో కాదు బ్రహ్మం కొడుకు, సిటీలో మంచి ఉద్యోగం చేస్తూ లవ్ మ్యారేజ్ చేసుకొని సొంత ఇల్లు కట్టుకొని సెటిలయ్యాడు.బ్రహ్మాన్ని చూసిన ఆ వీధి జనం వింతగా చూస్తున్నారు.ఒక కుర్రాడు “ఓయ్ ముసలాయనా ఏంటమ్ముతున్నావ్ తాటి ముంజలా “అన్నాడు.బ్రహ్మం “కాదబ్బయా..నా కొడుకు కోసం తేగలు,జంతికలు,లడ్డూలు “అన్నాడు.”నీ కొడుకా ఇక్కడెవరయ్యా నీ కొడుకు.ఎంత కొడుకు కోసం తెస్తే ఈ కర్రకి కట్టుకొని రాకపోతే సంచుల్లో తేవచ్చుగా ,  భలేవాడివి కదయ్యా పదో ఫ్లోర్ నుంచి తాటి ముంజలనుకొని మెట్లన్నీ దిగి వచ్చాను”అంటూ తిట్టడం మొదలెట్టాడు ఆ కుర్రాడు.”నా కొడుకు పేరు ఆది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ .అయినా నా కావడి నా ఇష్టం నేను మోసుకుంటా.నువ్వు పొరబడితే నేనేమి చేసేది .అదేదో లిఫ్టు ఉంటాది గదా దాంట్లో రాకపోయావా యాబై మెట్లు దిగేటప్పటికి అలసిపొయినట్లున్నావ్.”అంటూ కుర్రాడి మాటలని తిప్పికొట్టాడు.ఆ కుర్రాడు”మా లిఫ్టు చెడిపోయిందిలే.మంచి గేమ్ ఆడతా ఉంటే నీ వల్ల అంతా పోయింది.ఆది అంకుల్ వాళ్ళిళ్ళు ఎదురుగా ఫోర్త్ ఫ్లోర్లో రెండో ఇల్లు”అంటూ వెళ్ళిపోబోతా ఉంటే బ్రహ్మం ఆపి ఇదిగో తాటిముంజలు లేకపోతేనేం తేగలు తీసుకో అంటూ ఓ పది తేగలు చేతిలో పెట్టాడు.ఆ కుర్రాడు డబ్బులెంతివ్వమంటావ్ అన్నాడు.”ఏం వద్దయ్యా అయన్నీ మా ఇంట్లోవేలే అంటూ వెళ్ళబోతుంటే ఆ కుర్రాడు బ్రహ్మం చేతిలో ఓ ఇరవై రూపాయలు పెట్టి పరిగెత్తుకెళ్ళిపోయాడు.బ్రహ్మం చేసేదేమీ లేక డైమండ్ అపార్ట్ మెంట్స్ వైపు తిరిగాడు.ఎదురుగా ఆది బైక్ ఆగింది.బ్రహ్మం ఆనందంగా ఏం నాయనా ఎలా ఉన్నావ్? కోడలెలా ఉంది? అన్నాడు.ఆది కోపంగా ఇక్కడ కూడా తేగలమ్మి నా పరువు తీస్తున్నావా?ఆ కావడి అక్కడే పారేసి ముందు ఇంటికి పద.!అని గద్దించాడు.”ఒరేయ్ ఆది నీకిష్టమని లడ్డూలు తెచ్చానురా ,కావడి లేకుండా ఎలా రమ్మంటావ్.”అన్నాడు బ్రహ్మం.అప్పుడు ఆది “ఆ కావడి ఊరేగించుకుంటూ వస్తావ్ వద్దంటే వినవు.ముందు దాన్ని అక్కడే పారేసి బైకెక్కు.కోడలి ముందు నా పరువు తీయకు” అన్నాడు.బ్రహ్మం ముఖం చిన్నబోయింది తేగలు కట్ట ఒక్కటే తీసుకున్నాడు.కావడి ని లడ్డూలు,జంతికలతో పాటు వదిలేసి ఆది బైకెక్కాడు.

 

ఇప్పటికి కోడలి మొహమెరగని బ్రహ్మం బిక్కు బిక్కుమంటూ బైకుపై నుంచి దిగాడు.లిఫ్టులో కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించి పడబోయాడు.ఆది “నీరసంగా ఉన్నావు.కడుపునిండా తింటే గదా.ఎప్పుడూ సేద్యం గొడవలోనే ఉంటావు.” అంటూ ఇంటి తలుపు తీశాడు. ఇంట్లో కోడలు నవీన ఎర్రచీర కట్టుకొని ,అప్పుడే తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని ,తాంబూలం నములుతూ అచ్చం ఆదిపరాశక్తి రూపంలో దర్శనమిచ్చింది.ఆది లోపలికెళ్ళి “నవీనా..!రోజూ నన్ను పోరు బెడుతున్నావ్ గా ఇదిగో మా నాన్న వచ్చాడు.”అన్నాడు.రండి మామయ్యా.!అత్తమ్మ ఎలా ఉంది?అంటూ ఆప్యాయంగా పలకరించింది నవీన.వేషానికి మాటతీరుకి పోలికే లేకుండా ఉన్న కోడలివైపు బిత్తరపోయి అలాగే చూస్తూ బయటే నిలబడిపోయాడు బ్రహ్మం.నవీన బయటికెళ్ళి రా మామయ్యా అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది.బ్రహ్మం సినిమాల్లో చూపించినట్లు ప్రేమగా పిలిచి చెంప చెల్లుమనిపిస్తుందేమోననే అనుమానంతో లోపలికెళ్ళాడు.ఆది స్నానానికని వెళ్ళి వచ్చే లోపు నవీన తను ఆది ఎలా కలిశారో ఎలా పెళ్ళి చేసుకున్నారో మొత్తం  కళ్ళకు కట్టినట్లు మామయ్యకి చెప్పింది.అంతా విని బ్రహ్మం “ఏమ్మా..నువ్వు పల్లెటూరి పిల్లలా ఉన్నావ్.మా ఆది కి పల్లెటూరన్నా ఆ  అలవాట్లన్నా నచ్చవ్.నిన్నెలా చేసుకున్నాడు.”అని అడగడంతో నవీన “అదే మావయ్య లవ్ అంటే.ప్రవర్తనలు,మాటతీరు,జాబ్ గమనిస్తాం గాని పల్లెటూరా,సిటీనా ,భాష,యాస గమనించలేం.నేను మిమ్మల్ని ఇక్కడికే తీసుకొచ్చెయ్ మంటుంటే ఆయన వినడంలేదు.ఎందుకో నాకర్థం కావట్లేదు.”అంటూ వసపిట్టలాగా మాట్లాడేసింది.ఆశ్చర్యపోయిన బ్రహ్మం “అంటే  కోడలేదో మనూరికి వాన్ని రానియ్యట్లేదని మేమూ,మేమేదో ఇష్టం లేక రావట్లేదని కోడలు అనుకుంటూ విభజించబడ్డామన్నమాట చివరికి.దీనికంతా సూత్రదారి పల్లెను మరిచిన నా పుత్ర రత్నం ఆది అన్నమాట.”అని మనసులో అనుకుంటూ “వాడికి పల్లె టూరి చేష్టలంటే కష్టమమ్మా అందుకే మాతో కూడా సరిగా కలవడు”అన్నాడు.నవీన “ఆయన పల్లెటూళ్ళో పెరిగిన వాడేగా సిటీకొచ్చేసరికి కొమ్ములొచ్చాయా”అనడంతో బ్రహ్మం “అమ్మా గట్టిగా అనకు వింటాడు ,ఉద్యోగం వచ్చినప్పట్నుంచి క్లాసుగా ఉండాల అనేది వాడి మనసులో పెట్టుకొని వింతగా ప్రవర్తిస్తున్నాడు అంతే.సర్దుకొని పోతా ఉండడమే మన పని “అన్నాడు.”భలే వాళ్ళు మావయ్యా ఆయనకీ పల్లెటూరంటే ఏంటో తెలిసేలా చేద్దాం.కన్నతల్లిని పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువకూడదు .ఆ స్టేజి దాటేశాడు కాబట్టి వెనక్కి లాగడమే మన పని “అంటూ నవీన నవ్వుతూ ఉండగా ఆది వచ్చాడు.బ్రహ్మం తన చేతిలోని తేగలను తీసి నవీన చేతిలో పెట్టాడు.నవీన ఆదికి ఇవ్వడంతో తేగలను చూసిన ఆది కోపంతో నాకు ఈ బోడి తేగలేం వద్దు వాటిని ముందు బయట పారేయమన్నానా అంటూ తండ్రిపై ఎగిరాడు. ఇంతలో బ్రహ్మం తేగలిచ్చిన కుర్రాడు కావడి తెచ్చి “ఏం పెద్దాయనా  లడ్డూలు ,జంతికలు అక్కడే వదిలోసొచ్చావ్ .ఆది అంకుల్ నాకు తెలుసు కాబట్టి తెచ్చా.”అంటూ కావడి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.ఆదికి పిచ్చెక్కిపోయింది “అదిగో మళ్ళీ ఆ లడ్డూలు,జంతికలు వచ్చాయి,నాకు అవంటేనే ఇష్టం ఉండదు .” అంటూ ఊగిపోయాడు.నవీన” ఎందుకండీ మీకు పల్లెటూరంటే అంత అసహ్యం నిన్నమొన్నటి వరకు ఆ ఊర్లోనే బతికారు కదా,ఇప్పుడు అంత లోకువయిపోయిందా.ఆ వాతావరణం,ఆ బలమైన తిండి సిటీలో సాధ్యమా.మీరేమైనా పైన్నుంచి ఊడిపడ్డారా పల్లెటూరి వస్తువులను చూస్తే విసుక్కుంటారు,క్లాస్ గా ఉండాలంటారా పల్లెటూరు కూడా క్లాసే ,నన్ను చూడు నేను పల్లెటూరి పిల్ల లాగా కన్పిస్తానా ,నా యాస విన్నావా ఎప్పుడైనా? ఇకనుంచి ఆ యాసలోనే మాట్లాడుతా.”అనడంతో ఆది మాట్లాడు నాకేం ఇబ్బంది లేదు పల్లెటూరంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు.”అన్నాడు. “ముసలోళ్ళయిన అత్తామామలకోసం నేనొక నిర్ణయానికొచ్చాను.మనం వారం లోపల మనింటిని రెంట్ కి ఇచ్చేసి మన సొంత ఊరు అదే నీ పల్లెటూరికి వెళ్ళి అక్కడే ఉండబోతున్నాం” అంటూ మనసులో గుట్టు విప్పేసింది నవీన.ఏం చెప్పావు నాయనా నువ్వు నవీన ఇలా మాట్లాడుతుంది అంటూ బ్రహ్మం పైకి దూకాడు ఆది.”మావయ్యని ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు.నీకు నిజంగా సిటీ పిచ్చి పట్టింది. కన్న తల్లిదండ్రులను,ఉన్న ఊరిని మరిచి సిటీ  మోజులో బతుకుతూ ఆనందకరమైన జీవితాన్ని కోల్పోతున్నావ్.మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలంటే నువ్వూ నేను పల్లె బాట పట్టాల్సిందే,పెద్దవాళ్ళతో ఉండాల్సిందేనంటూ” కుండబద్దలు కొట్టింది నవీన.తను తండ్రిని కాబోతున్నాననే విషయం అప్పుడే తెలుసుకున్న ఆది నవీన మాటను కాదనలేక పోయాడు.బ్రహ్మం మన బంగారం మంచిదైతే కోడలేమి చేస్తుంది అంతా మన వెధవ మనసులోనే ఉంది అనుకుంటూ మాకు తగిన కోడల్ని నా కొడుకే ఎంచుకునేలా చేశావు దేవుడా. అంతా దైవేచ్ఛ అంటూ మనసులో భగవంతుని ధ్యానించాడు.

రచయిత:: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!