జ్ఞాపకాల పందిరి

జ్ఞాపకాల పందిరి

 

సాయంత్రం ఐదు గంటల ముప్పైఐదు నిమిషాలు. వేడి వేడి ఫిల్టర్ కాఫీ పట్టుకుని బాల్కనీలో కూర్చున్నాను. నా కొడుకుని  ట్యూషన్కి పంపి మా ఆయనగారి కోసం ఎదురు చూస్తున్నా. పొగలు కక్కే కాఫీ తాగుతున్నా తృప్తి లేదు నాకు. నిన్న నేను చూసిన సంఘటనలు నా కళ్ళ ముందు మెదిలాయి.

నేను, మా ఆయనగారు, నాకొడుకు ముగ్గురం పార్కుకి వెళ్ళాం. మా ఆయనగారు, మాబాబు ఇద్దరు ఆడుతున్నారు. నేను చుట్టూ చూస్తూ వున్నాను. ఒక వైపు ఆడుకునే పిల్లలు, ఇంకో వైపు గర్భవతి అయిన భార్యని నడిపిస్తున్న భర్త, మరో వైపు ఒక అమ్మాయి, అబ్బాయి సుమారు పాతికేళ్ళు వుంటాయేమో వారికి. వారిని చూస్తుంటే భార్య భర్తల్లాగా కనిపించారు. అవునో కాదో మరి!! వీరిని చూస్తుంటే నా కళ్ళముందు ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయి.

అమ్మా నాన్నకి నేను, అన్నయ్య. మేము సిటీలోనే స్థిరపడ్డాం. మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు. అప్పుడప్పుడు ఊరు వెళ్ళి వచ్చేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ సాయంత్రంకాగానే పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ వుంటారు. పెద్దవాళ్ళు ఎవరో ఒకరి ఇంటి దగ్గర కూర్చుని ముచ్చట్లు పెడుతుంటారు. సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. రాత్రి అయితే ఆరుబయట పట్టె మంచాలు వేసుకుని కూర్చునేవాళ్ళం. నాతో పాటు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఉండేవారు.అమ్మమ్మ అందరికీ ముద్దులుగా కలిపి అన్నం పెట్టేది. కథలు చెప్తూ ఉంటే మేము నిద్రపోయేవాళ్ళం. ఎవరికి అయినా చిన్న సహాయం కావాలంటే నలుగురు ముందుకు వచ్చేవాళ్ళు. నిన్న మా వీధిలో ఒక పెద్దాయనకి గుండెపోటు వచ్చి రోడ్డు మీద కింద పడిపోతే ఏ ఒక్కరూ రాలేదు. మేము పార్క్ నుంచి వస్తుంటే గుమిగూడి ఉన్న జనాన్ని  చూసి అడిగితే విషయం తెలిసింది.  మేము అయినా ఆ సమయంలో లేకపోయామే అన్న బాధ నాలో. ఇలా ఎన్నో రకాల విషయాలు జరుగుతున్న ఎవ్వరిని ఎవ్వరూ పట్టించుకోరు. బహుశా! ‘మనకెందుకు లే అనుకుంటారేమో!’

ఇంకో విషయం నన్ను మరీ కృంగదీసింది. నేను గర్భవతి అయినప్పటి నుంచి మా ఆయనగారు తప్ప ఎవ్వరూ లేరు నాదగ్గర. అమ్మ ఊరిలోని ఉంటుంది. నాన్న నా పెళ్ళి తర్వాత ప్రాణం వదిలేశారు.

“అమ్మ దగ్గరికి వెళ్లనా?”అడిగాను మా ఆయనగార్ని.

“మీది పల్లెటూరు అక్కడ సౌకర్యాలు ఉండవు. ఇక్కడే నా దగ్గరే ఉండు” బుజ్జగిస్తూ చెప్పారు.

నేనేమి మాట్లాడలేదు. నాకు అర్థం అయింది ఆయన పంపరు అని.

“పోని అమ్మ దగ్గరికి వెళ్తావా?”

“వెళ్ళను. మీ చెల్లిని నన్ను చూసుకోవడానికి అత్తయ్యకి ఇబ్బంది అవుతుంది” బదులిచ్చాను.

ఆయన గారు “నీ ఇష్టం” అనేసి చక్కగా వెళ్ళిపోయారు డ్యూటికి.

అత్తయ్య దగ్గర నా ఆడపడుచు ఉంది. తను గర్భవతి కావడంతో అత్తయ్యే తనని చూసుకుంటుంది. నేను కూడా వెళ్ళి అత్తయ్యకి భారం కాదల్చుకోలేదు. అత్తయ్య చాలా సార్లు రమ్మని బ్రతిమాలారు. నేనే మాఆయన గారితోనే ఉంటాను అని ఉండిపోయాను. నెలలు నిండాయి. ఆయానగారు నాదగ్గరే ఉంటాను అన్నా నేనే వినలేదు. “వెళ్ళండి వెళ్ళండి” విసిగించి డ్యూటికి పంపేశాను.

అలా ఒకరోజు నొప్పులు మొదలు అయ్యాయి. మా ఆయనగారికి ఫోన్ చేసి ఆయనోచ్చేసరికి భరించడం కష్టంగా మారింది. ఆ సమయంలో అమ్మ పక్కనుంటే బావుండు అనిపించింది. అదే ఊరిలో అయితే నలుగురూ తోడుంటారు ఇక్కడ ఎవరూ లేరు అనే బాధ.

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక “క్షమించు” అన్నారు నా చేతులు పట్టుకుని.

“ఎందుకండి”

“పల్లెటూరు ని తక్కువ చేసి మాట్లాడాను”

‘పల్లెటూరు పల్లెటూరు అంటారు కానీ! పల్లె కంటే  ప్రశాంతత ఇంకెక్కడుంటుంది. అనుభవిస్తే ఏదైనా అర్థం కాదేమో!’ అనుకున్నాను.

“ఓయ్ ఏమాలోచిస్తున్నావ్?”

“ఏమి లేదు లెండి. ఇప్పటికి అయినా తెలుసుకున్నారు అది చాలు” అన్నాను.

ఇవే కాదు ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పిల్లలతో మనఃస్ఫూర్తిగా మాట్లాడే,  ప్రేమగా గోరుముద్దలు పెట్టే తల్లిదండ్రులు ఉన్నారా? కథలు చెప్తూ నిద్రపుచ్చే తాతయ్యా, బామ్మలు ఎక్కడ? అభిమానంగా ఇరుగుపొరుగు వారితో మాట్లాడదామన్నా ఏమనుకుంటారో అన్న భయం. ఏదైనా జరక్కూడదనిది జరిగితే పట్టించుకునే వారు ఉన్నారా?

పట్టణంలో ఉరుకుల పరుగుల జీవితాలు. పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంత వాతావరణం కూడా లేదు. భార్య భర్తలు ఏకాంతం అంటూ పల్లెలు వదిలేస్తున్నారు. వారికి మంచి చెడు చూసేవారు కరవు అవుతారని ఏదో ఒకరోజు తప్పక తెలుస్తుంది మాలాగా.ఇలా అన్నీ నా మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. మా ఆయనగారు ఇంటికి వచ్చాక మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను.

నా కప్లో కాఫీ లాగా సమయం కూడా కరిగిపోతుంది.  వచ్చారు ఆయనగారు. మంచినీళ్ళు, కాఫీ గట్రా ఇచ్చేసాను. తాగి బాల్కనీలో కుర్చీలో వాలి “ఇందాకటి నుంచి తెగ ఇదై పోతున్నావు ఏంటి సంగతి?” అడిగారు.

‘కనిపెట్టేశారు ఎంతైనా మా ఆయనగారు కదా!’ అనుకుని

“హి హి అది మనం ఊరు వెళ్దామా?” ఆతృతగా మా ఆయనగారి  ముఖంలోకి చూస్తూ.

“ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి?”

“అమ్మని చూడాలి అని ఉంది”

మా ఆయనగారు  ఇంకేమి అనలేదు “సరే” అన్నారు.

“మీరు?”

“నేనెందుకు?”

“రండి జ్ఞాపకాల పందిరి పిలుస్తుంది. వెళ్ళి కాస్త నడుము వాల్చి వద్దాం” అన్నాను.
“రేపే మన ప్రయాణం” నవ్వారు మా ఆయనగారు.
నేను సంతోషంగా మా ఆయనగారి చెయ్యి ఊపేసాను.

రచయిత :: సిరి

You May Also Like

18 thoughts on “జ్ఞాపకాల పందిరి

  1. చాలా బాగుంది సిరి… ఇంకా రాస్తూనే ఉండు నేను చదువుతూ ఉంటాను

  2. చాలా చాలా బాగుంది రా మంచి కథలు రాస్తున్నావ్

  3. చాలా బాగుంది అక్క… పల్లె కంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ వుంటుంది చెప్పు… పట్టణాల్లో ఇల్లు ఇరుకు మనుషుల మనస్తత్వాలు కూడా అంతే ఇరుకుగా ఉంటాయి… అని చాలా బాగా చెప్పావు…

  4. Bagundi…

    Nijame kada…manam perigina swachamaina environment mana pillalaki istunnama..

    Memu istunnam ani nirbhayam ga cheptanu ra…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!