శ్వాసిస్తుందేమో

శ్వాసిస్తుందేమో??

రచన: మీసాల చినగౌరినాయుడు

అదిప్పుడు గతి తప్పిన పదం
ఒకప్పుడు మతి నిల్పిన పదం
ఎటుపయనిస్తుందో??
ఎలా మలచుకుంటుందో??
దాని ఉనికేమిటో??
దాని స్థితిఏమిటో??
నాడు పాపభయం ఒడిలో
జర భద్రంగాఉండేది
నేడు భయమేలేని పాపం లోకమేలుతుంది.

సనాతనంలో సంస్కారబద్ధంగా
వికసించినది
ప్రాచ్యపోకడలో విలువలులేని
వలువలు కట్టుకొని కన్నీరౌతుంది..
దైవభీతి దానవరీతిని ప్రశ్నించలేకపోతోంది…
అడుగడుగునా నీతిపతాకం
అవనతమౌతోంది…

జనంమాత్రం గుళ్లలో కిటకిటలాడుతున్నారు
నీతిమాత్రం గుండెలవిసేలా కటకటలాడుతోంది
ప్రవచనాలు బాగా
మాట్లాడుతున్నాయి
పరుషభావాలు
పరవళ్లుతొక్కుతున్నాయి..
ఆ నీతికి జాడెక్కడో!!
ఆ నీతికి విలువెక్కడో!!

బాల్యానికి ఇతిహాసపు
రెక్కలు తొడుగు
శిశుత్వానికి పురాణపు
తావులను పొదుగు
పసితనానికి ధర్మపు
రంగులు దిద్దు
మనిషితనానికి మానవత్వపు
మహిమను అద్దు
కాస్తయినా నీతి శ్వాసిస్తుందేమో???

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!