ఊసరవెల్లి

ఊసరవెల్లి

రచన: కమల ముక్కు (కమల ‘శ్రీ’)

“రేయ్! ఇయ్యాల మీ పార్టీ వాళ్లో మా పార్టీ వాళ్లో తేలిపోవాలా.”

” రండి రా నా కొడకల్లారా. మెడకాయ ల మీద తలకాయలు తీసేస్తాం.”

“చూస్కుందాం మీ సత్తా మా సత్తా.”

“అలాగే చూసుకుందాం.”

నవశకం పార్టీ, నేటి తరం పార్టీ కార్యకర్తల మాటలు కోటలు దాటుతున్నాయి. ఒక్కొక్కరూ కోపంతో ఊగిపోతున్నారు. అందరి చేతుల్లో కత్తులు, గొడ్డల్లూ, గునపాలు, కర్రలు.‌

ఎలక్షన్ లో నవశకం పార్టీ మీద, నేటితరం పార్టీ 10 ఓట్లు మెజారిటీ తో గెలిచింది. ఆ పది ఓట్లు తేడా రాదనీ… కౌంటింగ్ లో లోపం జరిగిందనీ, నేటితరం పార్టీ తో ఎన్నికల అధికారులు కుమ్మక్కైనారనీ… లేకుంటే గెలుపు తమదే అని  గొడవ.

చిన్న మాటలతో మొదలైంది కాస్తా కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇరు వర్గాల వారికీ దెబ్బలు తగిలాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జి చేయడం తో అందరూ చెల్లాచెదురు అయిపోయారు. ఆ ప్రదేశం మొత్తం రక్తంతో నిండిపోయింది. కొంతమందికి కత్తులు తగిలి చర్మం ఊడి రోడ్ పైనే పడిపోయింది. ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక మానదు.

దెబ్బలు తగిలిన వారిని అంబులెన్స్ లో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

నవశకం పార్టీ కార్యకర్తలను చూడటానికి ఆ పార్టీ ఎమ్మేల్యే, నేటితరం పార్టీ ఎమ్మెల్యే లు వచ్చి తమ కార్యకర్తలను పలకరించి పళ్లూ పుష్ప గుచ్ఛాలు ఇచ్చి వెళ్లిపోయారు.
కొన్ని రోజులకు దెబ్బలు తగిలిన వారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
రోజులు గడుస్తున్నాయి. నవశకం పార్టీ కార్యకర్త దాసు కి వారి  పార్టీ లోని సీనియర్ కార్యకర్త రాజన్న పనిలో ఉన్నప్పుడు నెలకింత అని జీతం కింద ఇచ్చేవాడు. దాసుకి దెబ్బలు తగిలిన కొన్ని రోజుల  వరకూ డబ్బుని పంపించాడు రాజన్న. ఆ తర్వాత పంపించడం మానేయడం తో వారికి ఇల్లు గడవడం చాలా కష్టం గా మారింది.

“ఏమయ్యా! ఓసారి మీ రాజన్న కి ఫోన్ చేయరాదు.ఇంట్లో సరుకులు అయిపోయాయి. పిల్లల స్కూల్ ఫీజ్ లు కూడా కట్టలేదు. రెండు రోజుల్లో కానీ కట్టకపోతే పిల్లల్ని స్కూల్ కి రావొద్దని చెప్పారట. నీకు కూడా మందులు కొనడానికి డబ్బులు లేవు.” అని దాసు పెళ్లాం మల్లి.

“ఇప్పటికే చాలా సార్లు చేశాను మల్లి కానీ రాజన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదే.” భాదగా అన్నాడు దాసు.

“నువ్వేమో ఇన్నిరోజులూ వారికోసం పని చేశావు. వారి కోసం అవతలి పార్టీ వారితో గొడవపడి ఉన్న కాలుని విరగ్గొట్టుకుని ఇంట్లో కూర్చున్నావు. బయటకి వెళ్లి పని చేయలేవు. పోనీ నేను వెళ్లి పని చేద్దామంటే రౌడీ పెళ్లాన్ని అని ఎవరూ పని ఇవ్వను అంటున్నారు. కొందరు ఇస్తాను అంటున్నారు కానీ…” అని వస్తున్న కన్నీటిని ఆపుకుంది మల్లి.

ఆమె ఏం చెప్పాలని ఆగిపోయిందో అర్ధమై భాద పడ్డాడు దాసు.ఇన్నాళ్లూ మహారాణిలా ఉండేది. ఇప్పుడు మెడలో మంగళ సూత్రం తప్పించి ఏమీ లేదు.పిల్లలు కూడా దర్జాగా ఉండే వాళ్లు. ఇప్పుడు స్కూల్ ఫీజ్ కట్టలేదని స్కూల్ కి రావోద్దన్నారని ఎంతలా భాదపడుతున్నారో. మరోసారి చేద్దాం.”అనుకుని రాజన్న కి కాల్ చేశాడు దాసు.

“ఏంట్రా! ఎన్నిసార్లు కాల్ చేస్తావు?.” చిరాగ్గా అన్నాడు రాజన్న.

“అన్నా! అదీ రెండు నెలల నుంచీ డబ్బు పంపించడం లేదు.” అంటూ నెమ్మదిగా అన్నాడు దాసు.

“సార్ పంపొద్దు అని చెప్పారురా దాసూ. ఇకమీదట మీకు డబ్బులు పంపించడం కుదరదురా దాసూ. దీని గురించి నాకు ఫోన్ చేయకు.” అని ఫోన్ పెట్టేశాడు రాజన్న.

అతను అలా ఫోన్ పెట్టెయ్యగానే ఆశ్చర్యం తో ఫోన్ వంకే చూస్తూ ఉండిపోయాడు దాసు. “సార్ డబ్బులు పంపొద్దు అన్నారా. అందుకే పంపించడం లేదా. ఇన్నాళ్లూ వారికోసమే కదా పని చేశాను. వారి గురించే కదా అవతలి వారితో గొడవపడి కాలు పోగొట్టుకుని ఇంట్లో ఉన్నాను. ఇలాంటి సమయం లో ఆదుకోకపోతే ఎలా?.” అనుకుంటూ భాదపడుతున్న దాసు ని కోపం గా చూస్తూ,

“ఏమన్నాడు మీ సారు. డబ్బులు పంపిస్తాను అన్నారా!.” ఆశగా అడిగింది మల్లి.

“లేదే ఇక మీదట డబ్బు పంపించడం కుదరదు అన్నాడు. మా సార్ పంపొద్దని అన్నారట.” బదులిచ్చాడు దాసు.

“ఇదెక్కడి అన్యాయం అయ్యా. వారికింద పనిచేసే వారి బాగోగులు చూసుకునే భాద్యత వారిదే కదా.పంపను అంటే ఎలా. ఇప్పుడైనా అర్ధం అయ్యిందా వాళ్లు ఎలాంటి వాళ్లో వారికి అవసరం ఉన్నంత వరకే మనల్ని  వాడు కుంటారు. అవసరం  తీరిపోయాక మనల్ని  కూరలో  కరివేపాకులా తీసి  పడేస్తారు. ఇన్నాళ్లూ  అతని  కోసం పని చేస్తే  సొమ్ము ఇవ్వొద్దని ఎలా చెప్తారయ్యా.  మొదటి నుంచీ  చేస్తూనే ఉన్నా ఈ రాజకీయ  నాయకులతో తిరగకయ్యా  అని. చెప్తే విన్నావా?. మా అన్న దేవుడు. మా అన్న బంగారం. మమ్మల్ని సొంత తమ్ముల్లెక్క చూసుకుంటారు అనేటోడివి. నువ్వు బాగున్నన్ని నాళ్లూ బాగానే చూశారు. ఎప్పుడైతే నీ కాళ్లు విరిగి మూలన పడ్డావో నిన్నీ పక్కన పడేశారు. రాజకీయ నాయకులెప్పుడూ అంతేనయ్యా ఊసరవెల్లి లాంటోళ్లు.” అంది కోపంగా.

“ఇప్పుడేం చేస్తాం మల్లీ. నాకేం తోచటం లేదు. ఇన్నాళ్లూ నాకేదైనా కష్టం వస్తే మా సారు చూసుకుంటా డనుకున్నా. కానీ ఇప్పుడు భయమేస్తోందే. నిన్నూ పిల్లల్నీ ఎలా పోషించాలి. పోనీ ఏదన్నా కూలికి పోదామన్నా కాలు లేదు.” అన్నాడు కంటనీరు పెట్టుకుని.

“అయ్యో! ఏడుస్తావేందయ్యా. నా మెడలో పుస్తెల తాడు ఉంది కదయ్యా. దాన్ని అమ్మి కూరగాయల కొట్టు ఒకటి పెట్టుకుందాం. నేను ఆపేసిన కుట్టు పని మొదలెడతాను.నువ్వు కూరగాయలు అమ్ము. అంతేకానీ ఇలా ఏడవమాకయ్యా. రాజా బ్రతికిన నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనయ్యా.” అని అతని కన్నీరు తుడిచి బయటకు వెళ్లి పుస్తెల తాడు అమ్మి డబ్బు తీసుకు వచ్చింది.

రెండు రోజుల్లో ఓ సెంటర్ చిన్న కూరగాయల దుకాణం మొదలుపెట్టారు భార్యాభర్తలిద్దరూ. రాత్రి పూట బట్టలు కుట్టేది మల్లి. కొద్ది రోజులకు వారి కష్టాలు అన్నీ తీరిపోయాయి.

ఓ రోజు రాత్రి టీవీలో వార్త చూసి ఆశ్చర్య పోయారు భార్యాభర్తలిద్దరూ.

“నవశకం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సారధి, నేటితరం పార్టీ లో కలిసిపోయారు. ఈ రోజు పార్టీ అధ్యక్షుల సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు అనీ.”

ఆ వార్త చూడగానే చెత్త  “నా….  వీళ్ల  స్వార్ధం కోసం మమ్మల్ని  బలి పశువులను చేశారు.  ఆ రోజు జరిగిన  గొడవలో చాలా మంది కాలూ  చేతులూ పోగొట్టుకున్నారు  మల్లీ.  పాపం ఎలా బ్రతుకుతున్నారో ఏంటో?. వీరిని ఊసరవెల్లి  అనడంతో తప్పే  లేదు. ” అన్నాడు దాసు.

“నిజమే అయ్యా.” అంది మల్లి కోపంగా.

“మల్లీ నేనో ‌మాట చెప్తే కోప్పడవు  కదా?!. “అన్నాడు దాసు.

“నేనెప్పుడైనా నీ మీద కోప్పడ్డానా. చెప్పయ్యా. ” అంది మల్లి.

“ఇప్పటి వరకూ నా వల్ల  ఎంత మంది  గాయపడ్డారో  వారికి నెలకు ఒకరికి చొప్పున  కొంత  సొమ్ము,  నిత్యావసరాల ఇద్దామని అనుకుంటున్నానే.  ఏమంటావు?.”

“చాలా మంచి ఆలోచనయ్యా.  అలాగే చేద్దాం.”అంది మల్లి నవ్వుతూ.

అప్పటివరకూ  తప్పుచేసానన్న  బాధలో ఉన్న దాసులో ఆ నిర్ణయం  తీసుకోగానే మదిలోని బాధంతా తీరి ప్రశాంతంగా  ఉంది మనసంతా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!