సూక్తులు
రచన: సావిత్రి కోవూరు
చిటపటలాడుతూ చిందులేయకే పిల్ల – బొక్క బోర్లా పడి మూతి పండ్లు రాలు,
ముట ముటలాడుతూ మూతి తిప్పకే పిల్ల – మూతి ముక్కంతయు ఏకమై పోవు,
పకపకమని నీవు పళ్ళు ఇకిలించకె పిల్ల – పదిమందిలో నీవు పలుచనౌతావు,
గొంతు పెద్దగ చేసి మాటాడకే పిల్ల – గయ్యాళి అని నీకు ముద్దరేత్తారు,
సందె యేలల్లోన నెత్తి దువ్వకే పిల్ల – లచ్చిందేవి నీ గడప తొక్కదూ మల్ల,
పట పట మని పళ్ళు నూరకే పిల్ల – కోపిష్టి అని నిన్ను లెక్క కడతారు,
కడప మీద కాలు పెట్ట బోకే పిల్ల – అదృష్ట దేవత కడప తొక్కదు మల్ల,
పసుపు కుంకుమలతో కడప పూజించు పిల్ల – ఆరోగ్యదేవత నిన్ను వదులదు మల్ల
పర్వదినాన ఏడు పొద్దే పిల్ల – ఎల్లకాలము ఇంట చింతలే మిగులు,
చీకటి ఏలపుడు ఇల్లు దాటకే పిల్ల – చిక్కులొస్తే నిన్ను రచ్చించ లేరు,
చదువు సందేలన్ని నేర్చుకోవే పిల్ల – చదువుల తల్లని మెచ్చుకుంటారు,
కోటి కష్టాలైనా కొలువు చేయవే పిల్ల – ఒంగి ఒంగి సలాములు సేత్త ఉంటారు,
అమ్మ నాన్నల మాట జవదాటకే పిల్ల – బుద్ధిమంతురాలని పొగడి పోతారు,
అమ్మ నాన్నల నెపుడు తూలనాడకే పిల్ల – ఈశ్వరుండయినా నిన్ను క్షమించబోడు,
ఆలుమగలన్నాక అలకలుంటయి పిల్ల – పట్టువిడుపులతోడా గడుపుకోవాలి,
మంచి మగడైతేను మాట వినవే పిల్ల – కాపురం సల్లగా సాగిపోతాది,
ఆత్మగౌరవమెప్పుడు విడనాడకే పిల్ల – పూచికపుల్ల కు కొరగావు నీవు,
అన్నదమ్ముల తోటి సక్కగుండే పిల్ల – ఆపదొస్తే నీకు అండగుంటారు,
అక్క చెల్లెళ్ళతో కలిసి ఉండే పిల్ల – కష్టసుఖాలపుడు కాచుకుంటారు,
ఊరి వాళ్ళ తోటి కొట్లాడకే పిల్ల – పలకరించే వారు నీకు కరువవ్వుతారు.