ఓ పిచ్చిమనసా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పద్మజ రామకృష్ణ.పి
నా మనసుకు తప్ప ఎవరికి రాయగలను ప్రేమలేఖ.
ఎందుకె మనసా ప్రేమించిన ప్రతిసారి నన్నింతగా ద్వేషించడం నేర్చావు. జీవితాన్ని అందంగా మలచాలని, చేతనైన రంగాల్లో అద్భుతంగా రాణించాలని ఎన్నెన్నో ఆశలతో కెరటంలా ముందుకు సాగే నన్ను ఒక్కసారిగా వెనక్కి లాగేస్తూనే ఉంటావు. వెనక్కి లాగే నీకు విసుగే రాదు, ముందుకు సాగే నాకు అలుపేలేదు. చూడవే మనసా! జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు తెలిసి నడుచుకోవే ఓ పిచ్చిమనసా. ఎదుటి వారి సానుభూతి ఎప్పుడూ కోరుకోకే అది నీపై జాలితో బాటే విలువ దిగజార్చే ప్రక్రియ అని తెలుసుకోవే మనసా. కొందరితో పోలుస్తూ నాకేం తక్కువ డబ్బు, హోదా అంటూ ఒక్కింత గర్వంగా ఎగసిపడతావు, అంతలోనే తుళ్ళిపడి నీకై నువ్వే ఎక్కడో ఏదో లోపం వ్యాపించిందని తడిమి తరించి ఆ లోపానికి లేపనం పూసేస్తావు. అందుకే నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ నే మనసా. అప్పుడప్పుడు ఇలా అందంగా రాస్తుంటా నీ కొరకు ఓ ప్రేమలేఖ. నా మనసుకి ఇదో ప్రేమలేఖ, జీవితానికే ఒక అద్భుత పూలబాట ఈ లేఖ.
సూపర్ అక్క