నేటి కాలంలో జన్మదినోత్సవం ప్రాధాన్యం

నేటి కాలంలో జన్మదినోత్సవం ప్రాధాన్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

ఉపోద్ఘాతం

ఏ కాలంలోనైనా ఎవరికైనా జన్మ దినోత్సవమే తొలి పండుగ , తొలకరి పండుగ. పుట్టిన మొదటి సంవత్సరమే ఊహ తెలియని వయసులోనే తల్లి దండ్రులు ఇది నీ పుట్టినరోజు అంటూ తమకు ఉన్నంతలో అపురూపంగా బందు మిత్రులతో అత్యంత సంతోషంగా జరుపుతారు. అప్పటి నుండి మొదలు ఈ రివాజు.
“విషయ వివరణ”
ఒకప్పుడు కాస్తా సంపన్నులు మాత్రమే జరుపుకునే ఈ పండుగ నేడు దాదాపు ప్రతి ఇంట, పేరు పేరున ఇంట్లో సభ్యులందరూ జరుపుకునే ఉత్సవంగా మారింది. ఇది ముదావహామే. ఎందుకంటే ఇది పెరిగిన వారి ఆర్ధిక పరిస్థితికి ఓ సూచిక. ఇది ఓ కోణం అయితే మరో కోణంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులందరికి ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమాభిమానాలు వ్యక్తం చేసుకునేందుకు ఓ చక్కని అవకాశం కల్పిస్తుంది.
పుట్టినరోజున సాధారణంగా నూతన వస్త్రాలు ధరించి, తల్లి దండ్రులు, పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందుతారు. దైవదర్శనం చేసుకుంటారు. ఇది ఒక మంచి సంప్రదాయం. వినయ, విధేయతలు అలవరుచుకునే సాధనం. పెద్దల ఆశీస్సులు, పిన్నలకు శ్రీ రామరక్షలు.
నేడు జీవన ప్రమాణాలు పెరిగినందు వలనో లేదా సమాజంలో తమ ఘనతను చాటుకునేందుకో ఏదేమైనా కొంతమంది ఒకడుగు ముందుకు వేసి పుట్టినరోజు పూట అనాధశ్రమాలు, వృద్ధాశ్రమాలు దర్శించి వారికి ఒక పూట ఐనా భోజనాలు పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నారు. ఇది ఎంతైనా హర్షించదగినది. దీని వలన చిననాటి నుండే పిల్లలలో మానవతా విలువలు పాదుకొల్పిన వారమవుతాము.

విశ్లేషణ

అయితే నేడు జన్మ దినోత్సవ వేడుక అంటే సంప్రదాయబద్ధంగా జరుపుకునే పవిత్ర దినం కాకుండా ఎంత ఎక్కువగా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడితే అంత ఘనంగా జరుపుకునే దినం అనే భావనలో సాగుతుంది. ఆత్మీయత కరువై ఎవరు తనకు ఎంత ఖరీదైన బహుమతులు ఇస్తే దానినే తమపై వారికి గల అభిమానానికి ప్రతీక అనే సంస్కృతి నెలకొంది. పాశ్చాత్య సంస్కృతి అనుకరణ, అనుసరణతో నేడు పుట్టినరోజు అంటే కేవలం కేకు కటింగ్ లు, తినడం తాగడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం అనే విష సంస్కృతి బాగా పెరిగిపోయింది. దీనిని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ముగింపు
మానవజన్మ ఎంతో ఉత్కృష్టమైనది. దానిని సార్ధకం చేసుకోవలిసిన బాధ్యత మనిషై పుట్టిన ప్రతి ఒక్కరిది. ఉన్నంతలో పక్క వారికి సాయపడుతూ మానవతతో మెలిగినపుడే మన పుట్టినరోజు ప్రతిఒకరికి పండుగ రోజు అవుతుంది మనం ప్రత్యేకంగా జరుపుకోకుండానే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!