కర్తవ్యం

కర్తవ్యం

రచయిత: శ్రీదేవి విన్నకోట

నాకు కావాల్సిన వారి కోసం జాలి పడడం కాదు, అది నా కర్తవ్యం. నా బాధ్యత వారి కోసం నేను ఏమైనా చేస్తాను, చూడు రవళి ఆ ఇద్దరు పిల్లలు అనాధలు కాదు, వాళ్లకి నేను ఉన్నాను, వాళ్లకి అమ్మ అయినా నాన్న అయినా నేనే, నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లు మన ఇంట్లోనే ఉంటారు ఇదే నిజం, నీకు ముందుగా ఈ విషయం చెప్పకపోవడం నా తప్పే,

కానీ ఇంతలోనే  ఆ పసిపిల్లలు నీకు నచ్చలేదు వాళ్లు మన ఇంట్లో ఉండకూడదు అని అనడం న్యాయం కాదు,మన పెళ్లి అయ్యి నెల రోజులే అయింది, నేను వాళ్లని ఏడు సంవత్సరాలుగా పెంచుతున్నాను, మన ఇంట్లోనే పనిచేసే రంగయ్య బాబాయ్ మనవలు ఆ పిల్లలిద్దరూ, రంగయ్య బాబాయ్ మా కోసం చాలా చేశాడు  కరెంట్ షాక్ కొడుతున్న నన్ను రక్షించి
నా గురించే తన ప్రాణాలు కోల్పోయాడు, నేను అతనికి మాటిచ్చాను చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆ పిల్లల్ని నా సొంత పిల్లల్లా చూసుకుంటాను బయటికి ఎక్కడికి పంపించను అని , అందుకే నేను మాట తప్పలేను అంటూ నేను రవళికి  చెప్పాల్సిందంతా అయిపోయినట్టుగా నా మాటలు అంతటితో ఆపేశాను,

అది కాదు రామ్ ఆ అనాధలు మన ఇంట్లో ఎందుకు ఏదైనా హాస్టల్లో ఉంచి చదివిద్దాం నాకు నచ్చచెప్ప బోయింది రవళి, నేను తాను చెప్పేది ఏమి వినేది లేదు అన్నట్టుగా అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాను, అప్పటి నుంచి రవళి నాతో సరిగా మాట్లాడట్లేదు, మా బెడ్రూమ్ లోకి రావట్లేదు, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళం ఎన్నో తీయటి కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరం వదిలి ఉండలేకుండా ఉండాల్సిన వాళ్ళం, కానీ మ్చ్ ఏం చేస్తాం, నేను తన మాట వినెంతవరకూ తను
నా మాట వినదు, ఆ విషయం నాకు అర్థం అయింది.

దీనికి పరిష్కారం ఏంటో ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు, పెళ్లి చూపుల్లోనే నాకు రవళి ఎంతో నచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, రెండు రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ తన సూట్ కేస్ సర్ధేసుకుని నిద్రపోతున్న నన్ను లేపి నేను మా ఇంటికి వెళ్తున్నాను, డ్రైవర్ కి చెప్పండి నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దిగపెట్టమని, అని అతి మామూలుగా చెప్తున్న ఆమెను చూస్తే నా కోపం నషాళానికంటింది, కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్లడం అన్నాను, ఏదైనా నాకు నచ్చనిచోట నా మాట విననిచోట ఉండాలి అని నాకు అనిపించదు, నేను వెళ్తాను అంది మొండిగా, సరే డ్రైవర్ ఎందుకు, నేను తీసుకెళ్తాను టిఫిన్ చేసి బయల్దేరుదాం, అంటూ బయటికి వచ్చి చిన్ను హాని  (పాప బాబు ఇద్దరు కవల పిల్లలు సెకండ్ క్లాస్ చదువుతున్నారు ) మీరు కూడా రెడీ అవ్వండి మనం బయటికి వెళ్తున్నాం ఆంటీ తో అని చెప్పాను వాళ్ళని లేపి, సరే డాడీ అంటూ ఇద్దరు రెడీ అవడానికి వెళ్లారు

రవళి మొహానికి గంటు పట్టుకుని కూర్చుంది, మనకి పిల్లలు పుడితే డాడీ అని పిలవాలి, ఆ అనాధలు డాడీ అని పిలవడం నాకు నచ్చలేదు అని విసురుగా హాల్లొకి వెళ్లి పోయింది, నేను ఆమె వెనకే వెళుతూ నేను ఉండగా వాళ్ళు అనాధలు కాదు ఇంకోసారి  ఆ మాట అంటే బాగుండదు అని సీరియస్ గా చెప్పాను.
అన్నట్టుగానే టిఫిన్లు చేసి రవళి వాళ్ళ ఇంటికి బయలుదేరాము, కారులో పిల్లలు తనని ఎంత మాట్లాడించాలని చూసినా తను కోపంగా ఉండడంతో నేను వద్దు అని చెప్పాను, ఎవరికీ వాళ్ళు సైలెంట్గా ఉండి పోయాము,

ఒక రెండు గంటల్లో రవళి వాళ్ళ ఇంటికి చేరాము, రవళి వాళ్ళ అమ్మానాన్న చాలా మంచివాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు రవళి సీరియస్గా కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. నేను పిల్లల్ని తీసుకుని లోపలికి వచ్చాను, రవళి వాళ్ళ నాన్నగారు బయటికి వస్తూ చిరునవ్వుతో మనవలని కూడా తీసుకువచ్చారు అంటూ ఇద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకున్నారు వాళ్లని ముద్దు చేస్తూ, సాయంత్రం వరకు హ్యాపీగా అక్కడే గడిపేసాము, వెల్దామా అని అడిగాను రవళిని సాయంత్రం, నేను రాను మీరు వెళ్ళండి ఆ అనాధ పిల్లల్ని ఇంట్లో నుంచి మీరు ఎప్పుడు పంపిచేస్తే అప్పుడే నేను మన ఇంటికి వస్తాను అంతవరకు రాను అదే ఫైనల్ అన్నట్టుగా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది,

నేను ఇంకేం మాట్లాడలేక మేము బయలుదేరతాము అని అత్తయ్య మామయ్య కి చెప్పి బయలు దేరుతుంటే మామగారు చిన్నగా మీకు రవళికి ఏమైనా గొడవ జరిగిందా అని అడిగారు, నేను జరిగింది అంతా చెప్పి, నేను ఇప్పుడు ఆ పిల్లల్ని దూరంగా ఉంచలేను, నాకు రవళి ఎంతో ఆ పిల్లలు కూడా అంతే, తను ఎప్పటికీ అర్థం చేసుకుని వస్తే అప్పుడే అర్థం చేసుకుని ఇంటికి వస్తుంది అప్పటి వరకు ఎదురు చూస్తాను, అంటూ పిల్లల్ని తీసుకుని వచ్చేసాను,

అలా రోజులు భారంగా గడుస్తున్నాయి నాకు రవళి బాగా గుర్తొస్తుంది, నేను ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడట్లేదు, తనైతే అసలు ఫోనే చెయ్యట్లేదు చాలా మొండి ఘటం అనిపించింది,ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రవళి ఇంటికి వచ్చేసింది, చాలా ఏడ్చినట్టుగా మొహం అంతా పీక్కుపోయి ఉబ్బి ఉంది,ఎవరితో ఏమి మాట్లాడకుండా  రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుంది, నేను వెంటనే మామయ్యకి ఫోన్ చేశాను, ఏం జరిగింది మావయ్య రవళి ఎందుకు అలా ఉంది, మీరు ఏమైనా అన్నారా అని అడిగాను,

అదేం లేదు రామ్ నా కూతురికి బుద్ధి వచ్చేలా చేసాను అంతే మరి ఏం కాదు రెండు రోజుల్లో సెట్ అయిపోతుంది మీరు కంగారు పడకండి అన్నారు మామగారు, అత్తయ్య కూడా మాట్లాడుతూ మీ మామయ్య అది మారడానికి ఒక చిన్న డోస్ ఇచ్చారు బాబు, ఏం కాదులే రెండు రోజులు ఓపిక పట్టండి అంతా సర్దుకుంటుంది అంటూ ఫోన్ పెట్టేశారు.

అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ రవళి దగ్గరికి వెళ్లాను, ఏం జరిగిందిరా అలా ఉన్నావ్ అంటూ తనని దగ్గరికి తీసుకున్నాను, నేను అలా అనగానే ఒకేసారి బోరున ఏడ్చేసింది, నాకు కంగారుగా అనిపించింది, అసలు ఏం జరిగింది చెప్పు ఏడవకు అంటూ ఆమెను బుజ్జగించసాగాను, ఈరోజు మా డాడీ మమ్మీ నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు, నేను అనాధను అని, వాళ్లకు పెళ్లి అయి ఐదు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోతే నన్ను తెచ్చుకుని పెంచుకున్నాము
అని, నన్ను తెచ్చుకున్న మూడేళ్ల తర్వాత వాళ్లకి అబ్బాయి అంటే మా తమ్ముడు డు డు డు పుట్టాడు అని డాడి మమ్మీ చెప్పారు అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది,

వాళ్లు అబద్ధం చెబుతున్నారు ఏమో అన్నాను నేను, లేదు నిజమే చెప్పారు, డాడీ నన్ను అనాధాశ్రమం నుంచి ఎప్పుడు తీసుకు వచ్చారో ఆ పేపర్స్ అక్కడి ఫోటోలు అన్నీ చూపించారు, డాడీ అసలు ఎప్పుడు పొరపాటున కూడా  అబద్ధం చెప్పరు నిజమే చెప్పారు, అంటూ ఇంకా బిగ్గరగా ఏడవసాగింది, ఇంతలో అక్కడికి వచ్చిన చిన్నూ, హాని  డాడీ ఆంటీ ఎందుకు ఏడుస్తుంది, నువ్వు ఆంటీని ఎందుకు తిట్టావు అంటూ వాళ్ళు నాపై కోప్పడుతుంటే  రవళి ఆ ఇద్దరిని దగ్గరికి తీసుకుంది, వాళ్లని ముద్దాడుతూ సారీరా నన్ను క్షమించండి, నేను ఒక అనాధనయి ఉండి మిమ్మల్ని అనాధలు అంటూ మాట్లాడాను, ఒకవేళ మా డాడీ వాళ్లు నన్ను పెంచుకోకపోతే నా బ్రతుకు ఏమైపోయిఉండేదో అంటూ ఇంకా ఏదో చెప్పసాగింది, వాళ్లకి ఏమీ అర్థం కాలేదు కానీ వాళ్ల చిట్టి చేతులతో రవళి  కళ్ళు తుడుస్తూ ప్లీజ్ ఆంటీ ఏడవకు అంటూ ఓదార్చారు, ఇక నుంచి నన్ను ఆంటీ అని పిలవద్దు అమ్మ అని పిలవండి, నిజంగా అంత గొప్ప తల్లిదండ్రులు లభించడం నా అదృష్టం వాళ్లు నిజం చెప్పి నాకు బుద్ధి వచ్చేలా చేశారు, అంటూ నన్ను క్షమించు రామ్  నేను తప్పుగా మాట్లాడాను, ఇంకెప్పుడు అలా మాట్లాడను వీళ్లిద్దరూ మన పిల్లలే, వీళ్ళకి మనమే అమ్మ నాన్న అన్నిను, అంటూ పిల్లల్ని దగ్గరగా హత్తుకుని పదండి బంగారాలు తినడానికి ఏమైనా పెడతాను అంటూ పిల్లలిద్దరినీ చెరోవైపు పట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లిపోయింది, ఇప్పటికీ నా మనసు కుదుట పడి హమ్మయ్య అనిపించింది,

వెంటనే మామయ్యకి ఫోన్ చేసి రవళి చెప్పేదంతా నిజమా మామయ్య అని అడిగాను, ఆయన ఎస్.వి.రంగారావు గారిలా పెద్దగా నవ్వుతూ, ఊరుకోండి అల్లుడు ఒక చిన్న నాటకం నా కూతురికి కనువిప్పు కలిగించింది, మనకి అది చాలు కదా అన్నారు,అవును కానీ తనకి సాక్ష్యాలు కూడా చూపించారు అంట కదా అన్నాను అర్థం కానట్టు, అయ్యో అల్లుడు ఏ కాలంలో ఉన్నారు
మంచి కోసం కదా, అలాంటి అబద్ధాలు ఎన్నైనా ఆడొచ్చు అనిపించింది, అందుకే ఆ పేపర్స్ మన రవళి కి బుద్ధి రావడానికి మాత్రమే అప్పటికప్పుడు సృష్టించాను, మీరు ఇవన్నీ మర్చిపోండి మీ భార్యతో పిల్లలతో సంతోషంగా ఉండండి, మాకు త్వరగా మూడో మనవణ్ణి ఇవ్వడానికి ప్రయత్నించండి అంటూ నవ్వుతూ ఆయన ఫోన్ పెట్టేసారు, అతి పెద్దదైన సమస్య నీ చిటికెలో దూరం చేసినందుకు,మావగారి తెలివితేటలకు ఆయన మంచితనానికి మనస్సులోనే ఆయనకి నమస్కరిస్తూ నేను కూడా చాలా రోజుల తర్వాత ఆనందంగా రవళి చెంతచేరి కబుర్లు  చెప్పడానికి వీలైతే సాయం చేయడానికి వంటింట్లోకి నడిచాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!