అలకో అసహ్యమో

అలకో అసహ్యమో

రచయిత :: బండి చందు

అలక అమ్మాయికి అందమే కానీ ఆభరణం కాదు. ఆరు సంవత్సరాలుగా తెలిసిన అమ్మాయే అయినా తన గొంతు విన్న ప్రతిసారి కొత్తగా పరిచయమయిన అనుభూతి. తెలియని ఆ భావనకు పేరు పెట్టాలి అని అనిపించలేదు. తన పేరు ప్రత్యూష నేను మాత్రం పొట్టీ అని పిలుస్తుంటా. మొదటిసారి తనని కాలేజ్ లో చూసాను. చాలా అల్లరి చేస్తుంది అందరితో ఇట్టే కలిసిపోతుంది. తనతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. ఎప్పుడూ నవ్విస్తుంది అప్పుడప్పుడు ఏడిపిస్తుంది అయినా తనపై కోపం రాదు.

ఏమైందో తెలియదు కానీ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుండే తాను ఓరోజు మాట్లాడడం మానేసింది. నాకు ఆరోజు తెలిసింది నరకం అంటే ఇలా ఉంటుందా అని. కారణం తెలియదు ఫోన్ చేస్తే తీయదు మెస్సేజ్ చేస్తే బదులు పంపదు. ఇలా వారం రోజులు గడిచాయి ఏమి చేయాలో తెలియక తన స్నేహితురాలికి ఫోన్ చేసి అడిగా. తనకి కూడా ఫోన్ చేయలేదని చెప్పింది. అలా మరో పది రోజులు పోయాక తన ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రత్యూష నుండి ఫోన్ వచ్చింది. తనకు నీపై చాలా కోపంగా ఉంది. ఇక తను నీతో మాట్లాడనని నాతో చెప్పింది అంది. నాకేమి అర్థం కాక ఎందుకు నేనేం అన్నాను కారణమేమిటని తనని అడిగాను. దానికి బదులుగా ఆమె ఏమో నాకు అవన్నీ చెప్పలేదు అని ఫోన్ పెట్టేసింది.

ఇక లాభం లేదని కారణం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ తను నేను చెప్పే మాటలు వినకుండా నన్ను వెళ్ళిపొమ్మని మొహం మీదే తలుపేసేసింది. కారణం చెప్పమని ఎంత బ్రతిమాలినా ఫలితం లేకపోయింది. చేసేది లేక నిరాశతో వెనుదిరిగాను. మొదట్లో తనది అలక తర్వాత కోపం అనుకున్న. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తనకు నాపై ఉన్నది అసహ్యమని ఇక అది ఎప్పటికీ తగ్గదని.

నిజానికి చెప్పాలంటే తన వల్లే నేను డిగ్రీ పాసయ్యను. తన వల్లే నాకు ఇష్టమైనవారికి దగ్గరయ్యాను. అలాంటిది ఇప్పడు తను నన్ను ఇంతలా ద్వేషిస్తుందంటే నేను ఖచ్చితంగా తనకి నచ్చని పని ఏదో చేసుంటాను. ఆ కారణం తెలుసుకునే దిశగా నా ఆలోచనల అడుగులు వేస్తూ అన్వేషినై పయనిస్తున్నాను…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!