మట్టి మనిషిని
రచన: వాడపర్తి వెంకటరమణ
ఈ మట్టినే ప్రేమించానన్నావు
ఈ మట్టినే శ్వాసించానన్నావు
ఈ మట్టిలోనే
కాసిన్ని ఆశల విత్తులు చల్లి
కలల పంటను పండించుకున్నావు!
రంగు రంగుల విదేశీ ఛాయాచిత్రం
నీ మనో ఫలకంపై మెదులుతున్నప్పుడు
డాలర్ కందిరీగలు కోరికలై
నీ మది గదిలో ముసురుకున్నప్పుడు
స్వేచ్ఛా విహంగమై
సుదూరాలకు ఎగిరిపోయి
పండించుకున్న ఫల సాయాన్ని
పరులకు పంచిపెడుతున్నావు
ఇప్పుడు నీకీమట్టి
ఉత్త మట్టిగానే కనిపిస్తోంది!
నేనూ ఆశల విత్తులు చల్లి
బంగారు పంటను పండిస్తున్నాను
నన్ను నమ్ముకున్న
నా దేశం డొక్కలు నింపడానికి
ఇప్పుడు నాకీమట్టిలో
అవ్యాజమైన ప్రేమ కనిపిస్తోంది!
ఎందుకంటే…
ఈ మట్టిలో జీవిస్తున్న
ఈ మట్టినే నమ్ముకున్న
మట్టి మనిషిని కదా
నా శ్వాస చివరిదాకా
ఈ మట్టిలో కలిసేదాకా
నా దేశ మట్టినే గర్వంగా శ్వాసిస్తాను!!