బంధాల విలువ

(అంశం:: “అర్థం అపార్థం”)

బంధాల విలువ

రచన:: నాగ మయూరి

అన్నదమ్ముల అనుబంధానికి ప్రతిరూపమైన ఆ రామ లక్ష్మణులే మళ్ళీ పుట్టారా ! అనిపించేంత ప్రేమాభిమానాలతో ఉండేవారు శ్రీరామ్,సాకేత్ లు.
అలాంటి అన్నదమ్ముల జీవితంలోకి వివాహబంధంతో అడుగుపెట్టిన భార్యలు శారద,పవిత్ర.

శ్రీరామ్ భార్య శారద “కుటుంబ బంధాలు చాలా బలమైనవి అని నమ్మేది” తన వారందరిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది.

సాకేత్ భార్య పవిత్ర దృష్టి లో మాత్రం “బంధాలన్నీ బూటకాలే”, తను తన భర్త ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల తమ సంపాదన కోసం మాత్రమే కుటుంబ సభ్యులు ప్రేమని కురిపిస్తున్నారని, తన చుట్టూ అల్లుకున్న ఈ “బంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే” అని అభిప్రాయ పడుతూ….
అత్త , తోటికోడలు ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోకుండా ప్రతిరోజూ
ఏదో రకంగా ఇంట్లో వారితో గొడవపడుతుండేది.

శారద మాత్రం పవిత్ర చిన్నపిల్ల తనే మారుతుంది అంటూ తోటికోడలిలా కాక తన తోడబుట్టిన చెల్లెలు లాగానే పవిత్రను చూసుకునేది.

ఆ ప్రేమంతా కూడా నటన అనే అభిప్రాయంతో పవిత్ర మరింతగా శారదను అపార్థం చేసుకునేది.

ఎలా అయినా వారినుంచి దూరంగా వెళ్ళి, సంతోషంగా బ్రతకాలి అని నిర్ణయించుకున్న పవిత్ర భర్తతో “ఇక్కడే ఉంటే మన సంపాదన అంతా ఈ ఉమ్మడి కుటుంబానికే సరిపోతుంది”. పైగా మీ అన్నయ్య సంపాదన అంతంత మాత్రం, మీవదిన కూడా ఇంట్లోనే కూర్చుని తింటుంది. ఎన్నాళ్ళని మనం వాళ్ళని పోషించగలం? మన పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి కదా! …కాబట్టి మనం వేరు కాపురం పెట్టి, మన బ్రతుకు మనం బ్రతుకుదాం అని చెబుతుంది…

చిన్నతనంలో తండ్రి దూరమైతే… తమ్ముడిని ఉన్నత చదువులు చదివించటం కోసం, తన చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యోగంలో చేరిన అన్నయ్య అంటే సాకేత్ కి ఎంతో అభిమానం, గౌరవం. ఈరోజు తను ఇంతటి స్థాయిలో ఉండడానికి కారణం అయిన అన్నని వదిలి దూరంగా వెళ్ళడం సాకేత్ కి ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా….
“కనీసం అలా కొంత కాలం వారందరికీ దూరంగా ఉంటేనయినా బంధాల విలువ తెలిసి,పవిత్ర మనుషులని అర్థం చేసుకుంటుందన్న ఆశతో”
భార్య మాటని ఒప్పుకున్నాడు.

చివరికి భర్తని ఒప్పించాను అన్న సంతోషంతో పవిత్ర వేరుకాపురం పెడుతుంది.

సాకేత్ ఆఫీస్ పనిమీద క్యాంప్ లకి వెళితే వారంరోజులకి కానీ ఇంటికి చేరేవాడు కాదు.
ఇంతకు ముందు అయితే ఇంట్లో అందరూ ఉండేవారు కాబట్టి, తను ఏ టైమ్ కి ఆఫీసు నుంచి వచ్చిన ఇబ్బంది ఉండేది కాదు.

ఈ విషయాలేవి అర్థం చేసుకోకుండా డబ్బు గురించి మాత్రమే ఆలోచించే పవిత్ర
ఇక నుంచి తన భర్త,పిల్లలతో ఆనందంగా ఉండాలనుకుంటూ పనులన్నింటికీ ప్రణాళికలు వేసుకుంటుంది.
ఆ ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రావడానికి అరగంట ముందే పవిత్ర ఇంటికి చేరుకునేది.

కానీ ఒకరోజు అనుకోకుండా పవిత్ర ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ కి హజరవ్వాల్సి వచ్చింది.

సమయానికి పిల్లలని చూసుకోడానికి సాకేత్ కూడా ఊళ్ళో లేడు. కనీసం ఇరుగు,పొరుగు కూడా ఉండకూడదని పట్టు బట్టి మరీ సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ తీసుకుంది.
స్కూల్ నుంచి వచ్చిన పిల్లలని చూసేవారైనా లేరే అని బాధపడుతూనే….
తప్పని పరిస్థితులలో ఆ మీటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది.

గేటు లోపలికి వెళ్ళి చూసేసరికి పిల్లలు ఇద్దరూ గుమ్మంలో చలికి వణుకుతూ, భయంతో ఏడుస్తూ కూర్చున్నారు.
వాళ్ళని అలా చూసిన పవిత్ర ఎంతో బాధపడుతూ గబగబా తాళం తీసి లోపలికి తీసుకువెళుతుంది.

ఇంటి చుట్టూరా చెట్లు ఉండటం వల్ల చల్లగాలి పైగా మంచులో ఎక్కువసేపు గడపడం దానికి తోడు భయం వల్ల తెల్లవారేసరికి పిల్లలిద్దరికీ విపరీతమైన జ్వరం వచ్చింది.

మరోవైపు ముఖ్యమైన పనులుండటం వల్ల ఆఫీసుకి వెళ్ళక తప్పదు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలని ఏమి చేయాలో తెలియక శారద కి ఫోన్ చేసి విషయం చెబుతుంది.

శారద వెంటనే అక్కడికి వచ్చి పిల్లలని తను చూసుకుంటానంటూ పవిత్రకి ధైర్యం చెప్పి ఆఫీసు కి పంపిస్తుంది.

నాలుగు రోజుల పాటు శారద కంటికి రెప్పలా పిల్లలని చూసిన విధానం తో ఏ “బంధం అయినా అనుబంధం గా మారాలి అంటే అవసరానికి మించిన ఆత్మీయత కావాలి” అన్నిటినీ ఆర్థిక సంబంధాలుగానే చూడకూడదు అని పవిత్ర తెలుసుకుంటుంది.
శారద చూపించే ప్రేమను అర్థం చేసుకుంటుంది.

భర్త ఊరి నుంచి రాగానే అన్నదమ్ములని విడదీసినందుకు తనని మన్నించమని, మరలా అందరం కలిసుందామని అడుగుతుంది.

తన కోరుకున్న మార్పు భార్యలో వచ్చినందుకు సాకేత్ ఎంతో సంతోషిస్తూ, ఈ మార్పుకి కారణమైన వదినకి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకుంటాడు.

ఆరోజు నుంచి వారంతా “బంధాలనే పూలతోటలో ప్రేమనే ఎరువుని వేసి అనురాగమనే నీటిని పోసి ఆత్మీయతా కుసుమాలను విరబూయిస్తూ” ఎంతో ఆనందంగా జీవిస్తారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!