ఆడపడచు

(అంశం:: “అర్థం అపార్థం”)

ఆడపడచు

రచన:: అనురాధ మురుగము బూజుల

ఈసారి పండుగకు మన రాజ్యం ని పిలవాలి అండి అని భర్త “శంకరయ్య” కు చెప్పింది పార్వతమ్మ. నీ ఇష్టం…… ఏది అనిపిస్తే అలా చేసేయ్ అన్నాడు శంకరయ్య. అలా కాదండి పెద్దదాని పెళ్లి అయ్యాక, దాని బాగోగులు,చీర,సారెలు పెట్టడంలో రాజ్యం కి పెట్టిపోతలు తగ్గాయి కదా, ఈ ఏడాది పిలిచి పెడదాము, మళ్ళీ చిన్నదానికి పెళ్లి కుదిరితే రాజ్యం తనని పట్టించుకోవట్లేదు అని బాధ పడుతుంది. ఇంటి ఆడపిల్ల బాధ పడటం, కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదు కదండి అంది పార్వతమ్మ.
చూడు పార్వతి నాకు వచ్చే సంపాదన తోనే నువ్వు అన్ని సర్దుతున్నావు, నాకు తెలియదా? చెప్పు, సంపాదన నాది అయినా, ఎవరికి ఎంత పెట్టి పంపించాలో నీకు బాగా తెలుసు అందుకే, నిన్నే చూసుకోమన్నాను. రాజ్యం అయినా, మన పెద్దమ్మాయి అయినా నువ్వు తక్కువ చేసావు అంటే, అది నీ తప్పు కానే కాదు, అది అందరూ గుర్తుంచుకుంటే మంచిది, వాళ్ళు ఏదయినా మాటలు అన్నా విని విననట్లు వదిలేయటం కూడా అలవాటు అయింది. నేను ఫోన్ చేసి ఇద్దరినీ పిలుస్తాను అని చెప్పాడు శంకరయ్య.
సాయంత్రం కొడుకు రాగానే పార్వతి మేనత్త, అక్క పండక్కి వస్తున్నారు అని చెప్పింది.
సరే అమ్మ….. నేను నాన్నకు తోడుగా సంపాదించడం మొదలుపెట్టాను కదా , ఈసారి ఇంకా బాగా చేద్దాం, ఏమి ఆలోచించకు, అని హామీ ఇచ్చాడు కొడుకు వివేక్.
అనుకున్నట్టుగానే పండగకు ఇద్దరూ వచ్చారు. పార్వతి ఉన్నంతలో ఏలోటు లేకుండా చేసింది, ఇద్దరూ బయలుదేరుతున్నప్పుడు పార్వతి రాజ్యం కి కొత్త చీర, ఉంగరం పెట్టింది, రాజ్యం వాటి వైపు చూసి “వివేక్ సంపాదన మొదలుపెట్టిన, నాకు ఈ బోడి ఉంగరమేనా? “, అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంది.
శంకరయ్య మౌనంగా చూస్తున్నాడు. పెద్దదాని చీర చూసి నాకు ఇది నచ్చింది, నాకు పెట్టింది నాసిరకంగా వుంది, కూతురి మీద ఒక ప్రేమ, ఆడపడచు మీద ఇంకో ప్రేమ, అదే మా అమ్మ వుండింటే, అని ఇంకాస్త గొంతు పెంచింది.
వివేక్ వచ్చి, “అత్త”, నీకు నచ్చింది తీసుకో, ఆలోచించకు అని అక్క కిచ్చిన చీర తీసి, రాజ్యం కి ఇచ్చాడు. అదే అదనుగా చూసిన రాజ్యం, తన చీర మేనకోడలుకి ఇవ్వకుండా రెండు తీసుకొని ఊరికి బయలుదేరింది.
పెద్దమ్మాయి వందన పర్లేదులే అమ్మ, మా అత్తగారింటిలో ఇన్ని పట్టింపులు లేవులే? అత్త తీసుకుని పోయినా నాకు బాధలేదు, వెళ్ళొస్తాను అంది. వద్దు అక్క నీకోసం ముందే తెప్పించాను, అత్త ప్రతిసారి ఇలాగే చేసిన అమ్మ ఇంకొకటి కొనాలని అనుకోలేదు, నాకు తెలుసు అని అక్కబావలకు బట్టలు పెట్టాడు వివేక్.
బాగా ఎదిగావు వివేక్, ఎవరిని నొప్పించకుండా బాగా చూసుకుంటున్నావు అని బావ పొగిడి వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు.
రాత్రి భోజనాలు చేస్తుండగా, పార్వతి ఆలోచిస్తోంది, వివేక్ చూసి “అమ్మా ఆలోచించకు ముందు తిను,” అని చెప్పాడు.
అలా కాదు వివేక్ నేనూహించలేదు, రాజ్యం అలా చేస్తుందని అంది.
అమ్మా ప్రతిసారి అత్త అలాగే చేస్తోంది, నాన్న నీకు తెచ్చిన చీర బాగుంది అని తీసుకునేది, ఇప్పుడు వందన అక్క చీర, అంతే ఏ మార్పు లేదు, నాకు ఊహ వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ఈసారి జాగ్రత్త పడ్డాను అంతే అని నవ్వాడు వివేక్.
అన్నా అందరికి కొన్నావు నాకు అంది చెల్లి హరిణి. వేసుకున్నావు కదే అంది పార్వతి. వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు, వెళ్ళేటప్పుడు ఇంకొన్ని ఇచ్చారు కదా, నాకు కూడా ఇంకొకటి ఇవ్వొచ్చు కదా అంది.
వచ్చే పండుగకు పెళ్లి చేసి పంపిస్తే, అప్పుడు నీకు పెట్టి పంపిస్తాంలే అంది పార్వతి. హరిణి అదోలా మొఖం పెట్టి వెళ్ళిపోయింది. అంతా చూస్తున్న శంకరయ్య నోరు మెదపలేదు.
కొన్నిరోజులకు హరిణి కి కూడా మంచి సంబంధం కుదిరి పెళ్లి జరిగింది. అన్ని తతంగాలు పూర్తి అయ్యాక, అందరూ వెళ్ళిపోయాక ముగ్గురూ కూర్చొని లెక్కలు వేసుకోగా, రాబడి, పోబడి పోను ఒక మూడు లక్షల అప్పు కనిపించింది.
వివేక్ చూసి ధైర్యంగా ఏమి కాదులే నాన్న, నేను ఈసారి టీం లీడర్ అయ్యానుకదా, శాలరీ పెంచుతారు అన్నాడు.
శాలరీ నే కాదు వివేక్, పని ఒత్తిడి కూడా వుంటుంది కదా అన్నాడు శంకరయ్య.
పర్లేదు నాన్న, కొన్నిరోజులకు అన్ని సర్దుకుంటాయిలే, అంతేనా మీరు రిటైర్డ్ అయ్యేలోపు మనం సొంత ఇంట్లోకి చేరుకోవాలి అన్నాడు వివేక్. అవసరమా రా అంది పార్వతి.
అవసరమే అమ్మ, మనం మన గౌరవం కోసం ఉండాల్సిన ఇల్లు, మేము ముగ్గురం పిల్లలము, వందన, హరిణి కుటుంబాలు, అత్త వాళ్ళు వచ్చినప్పుడు బాగుండాలి కదా, ఏది తక్కువ కాకూడదు, నాన్న, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అని తన నిర్ణయం చెప్పి వెళ్ళిపోయాడు వివేక్.
పార్వతి ఆలోచనలు కుదురుగా లేవు, భర్తతో వివేక్ ఎక్కువ కష్టం కొని తెచ్చుకుంటాడేమో అండి అంది.
బాధ్యతలు తెలిసిన కొడుకు కి ఏది కష్టం అనిపించదులే పార్వతి అని సర్దిచెప్పాడు శంకరయ్య.
శంకరయ్య, వివేక్ కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. ఇంకోవైపు వందన తొలి కాన్పుకు వచ్చింది. ఇంటిని పార్వతమ్మ, ఖర్చులు వివేక్ చూసుకుంటున్నాడు. హరిణి అక్కను ఎక్కువగా చూస్తున్నారు, తనను తక్కువగా చూస్తున్నారు అనుకున్నా పైకి చెప్పేది కాదు.
కొన్నిరోజులకు వందనకు మగపిల్లాడు పుట్టేసమయానికి ఇల్లు కూడా పూర్తి అయింది. తల్లిదండ్రుల చేత సత్యనారాయణ వ్రతం కూడా చేయించాడు వివేక్.
అందరి ఆలోచనలకు తగ్గట్టు, కింద నాలుగు, పైన నాలుగు బెడ్ రూమ్స్ వుండేలా పెద్ద ఇల్లు కట్టించాడు.
కొడుకు సాఫ్ట్ వేర్ కదా ఆ మాత్రం సంపాదన వుంటుంది అని అక్కసు వెళ్ళబోసుకుంది, నాకు ఒక్కడే కొడుకు వున్నాడు, ఏమి లాభం, ఇప్పుడు అనిపిస్తోంది నాకు ఒక కూతురు వుండింటే వివేక్ కి ఇచ్చి పెళ్లి చెసింటే ఈ వైభోగం అంతా అనుభవించేది అని గోనిగి గోనిగి వెళ్ళొపోయింది.
అన్న ఇంట్లో ఎక్కువ సదుపాయాలు వుండే సరికి హరిణి ప్రతి పండుగకు వచ్చేది.
శంకరయ్య వివేక్ తో ఈసారి పెళ్లి చేసుకోరా? నీ మనసులో ఎవరైనా వుంటే చెప్పు అన్నాడు,. ఎవరూ లేరు నాన్న, మీరు ఎలా చెబితే అలా అన్నాడు వివేక్.
అదేంట్రా…. ఎవరిని ఇష్టపడలేదా? అని అడిగింది పార్వతి. “లేదమ్మా….. ఇంటిలో ముగ్గురు ఆడవాళ్ళతో నువ్వు పడుతున్న ఒకలాంటి అవస్థ చూసి, ఆసాహసం చేయలేకపోయాను, నిన్ను సంతోషపెట్టాలని, ఆ దిశగా అడుగులు వేసాను” అంతే మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు వివేక్.
తన ఫ్రెండ్ కూతురు అయిన జాహ్నవి ని వివేక్ కి ఇచ్చి పెళ్లి చేసాడు శంకరయ్య. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి రా శంకర్ అని అన్నాడు ఫ్రెండ్ లోకానందం.
నన్ను నువ్వు ఎన్నిసార్లు ఆదుకోలేదు చెప్పు, నేనెప్పుడూ జాహ్నవిని పరాయి పిల్లలా చూడలేదు, వివేక్ అభిప్రాయం తెలుసుకున్నాక, ధైర్యంగా చేసేసాను, నువ్వు కూడా జాహ్నవి ని మాఇంటికి ఇచ్చి గొప్పవాడిని చేసావు అని సంబరపడ్డాడు శంకరయ్య.
జాహ్నవి ని చూసి, చూడు జాహ్నవి నీకు ఏదయినా సలహాలు, సూచనలు అమ్మదగ్గర తీసుకో, నీకు…. అనబోతే “ఏయ్ ఇడియట్ ఆపుతావా “? పాపం పోనీ అని సైలెంట్ గా వుంటే కొత్తగా కబుర్లు చెబుతున్నావా? నాకు తెలియదా? ఇంటి గురించి అని వివేక్ చెవి మెలేసింది జాహ్నవి.
సారీ జానూ, నిన్ను బాగా వెయిట్ చేయించాను కదా, నిన్నే చేసుకుంటాను అంటే వందన, హరిణి ఏమనుకుంటారో అని అన్నాడు వివేక్.
ఏదయితేనేమి మన పెళ్ళి అయిపొయింది అని సంతోషించింది జాహ్నవి.
వివేక్ మాట ప్రకారం పార్వతి దగ్గర మెళకువలు నేర్చుకుంటోంది, ఇంకోపక్క తను కూడా జాబ్ చేస్తోంది జాహ్నవి.
షరా మాములే పండుగకు అందరూ వచ్చారు, పెట్టిపోతలు జరిగాక ఎవరి ముఖాల్లో సంతోషం లేదు. జాహ్నవి కాస్త చిన్నబుచ్చుకుంది.
హరిణి వెళ్లి తల్లి కి చెబుతోంది. వదిన వచ్చాక అన్నయ్య మారిపోయాడు, చూడు నన్ను ఎంత తక్కువగా చూస్తున్నాడో, ఈసారి మంచి చీరలు పెట్టలేదు, నాకు భోజనాలు దగ్గర కూడా రెస్పెక్ట్ తగ్గించారు అని విలవిలా ఏడ్చింది.
అదేమి లేదు అత్తయ్య, నేను బాగానే చూసుకున్నాను అంది జాహ్నవి. అవునులే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావు కదా, ఎన్ని కబుర్లు అయినా చెబుతావు, అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది హరిణి.
రాజ్యం కూడా శంకరయ్యతో, అప్పుడు వదిన తక్కువగా చేసేది అదే కోడలికి నేర్పింది, అందుకే నీకోడలు తల్లి లాంటి దాన్ని అని చూడకుండా మేలిమి చీరలు నాకు పెట్టలేదు, సౌకర్యాలు కూడా తగ్గాయి అని ఈసడించుకొని వెళ్ళింది. అన్ని చూస్తూ వందనకు ఏమి చెప్పాలో తెలియక వెళ్ళిపోయింది.
ఈసారి ఎవరికి లోటు చేయకూడదు అని మామ శంకరయ్య తో కలిసి కొత్త ప్లాన్ వేసింది, అందరిని షాపింగ్ కి తీసుకొని వెళ్లి షాపింగ్ చేయించింది జాహ్నవి.
ఇంటికొచ్చాక బిల్లులు చూసి, ఎక్కువ తక్కువలు మొదలుపెట్టారు ముగ్గురూ. జాహ్నవి కి ఏమి చెయ్యాలో తోచలేదు.
ఏడుస్తూ పడుకుంది, వివేక్ వచ్చి జానూ ప్లీజ్ ఏడవకు, వాళ్ళు అలా చేస్తారని నేనుహించలేదు, బాధ పడకు అని సర్ది చెప్పాడు.
హరిణి తల్లి కాబోతోంది అని తెలిసి పండుగకు పిలిచి తనకు నచ్చినట్టు చూసుకొని, తరువాత అందరికి డబ్బులు ఇచ్చి మీకు నచ్చినట్టు కొనుక్కోండి అని చెప్పాడు వివేక్.
రాజ్యం ఇచ్చిన డబ్బులు చూసుకొని, చిన్నవాళ్ళు అయిన వాళ్లకు, నాకు సమానంగా డబ్బులు ఇస్తావా? వయసు తేడా తెలియదా నీకు? కోడలు వచ్చాక పుట్టింటికి కొరగానిదాన్ని అయ్యాను అని వాపోయింది రాజ్యం. హరిణి కూడా డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది.
వివేక్, జాహ్నవికి ఏమి చెయ్యాలో తెలియక ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యారు.
రిటైర్డ్ ఫంక్షన్ కి అందరిని పిలిచాడు వివేక్. వచ్చినా కానీ యెడమొఖం, పెడముఖం పెట్టుకున్నారు అందరూ. జాహ్నవి ఎంత కలుస్తున్నా హరిణి, వందన దగ్గర అవ్వడంలేదు.
రిటైర్డ్ అయ్యాక, వచ్చే డబ్బుల విషయంలో చర్చలు మొదలుపెట్టారు రాజ్యం, హరిణి.
శంకరయ్య అందరికి తలా రెండు లక్షలు ఇస్తాను, ఏమైనా చేసుకోండి అన్నాడు. అన్నయ్యకు కూడానా అని అడిగింది హరిణి. ముగ్గురూ సమానం కదా అన్నాడు శంకరయ్య.
అలా ఎలా అవుతుంది నాన్న, అన్నయ్యకు ఇల్లు కట్టించావు, మాకు లేదు కదా, అప్పుడు అన్నయ్య కు ఇచ్చే డబ్బులు నాకు, అక్కకు పంచి ఇవ్వండి, ఆ ఇంటి సుఖబోఘాలు అన్ని ఆమెకే కదా, ఇద్దరూ సంపాదిస్తున్నారు, మీరిచ్చే డబ్బులు కూడా కావాలనా? అని అడిగింది హరిణి.
శంకరయ్య లేచి, డబ్బులు చేతికి వచ్చాక మాట్లాడుకుందాం, అని వెళ్ళిపోయాడు.
ఈసారి పండుగకు ఎవరూ రాలేదు, బిజీగా వున్నాము అని చెప్పారు. ఏమి చేద్దాం అండి అని అడిగింది పార్వతి. ఏముంది? మనమే వెళ్లి వాళ్లకు ఇవ్వాల్సిన వి ఇచ్చి వద్దాము, ఈసారి మనమే వాళ్ళ ఇంటికి వెళదాము అని జాహ్నవికి చెప్పి ఇద్దరూ వెళ్లారు.
రాజ్యం ఇంటికి వెళితే కొడుకు కోడలు వాళ్ళ ఊరు వెళితే ఇంటిలో ఒక్కతే వుంది, అన్నావదిన వచ్చే సరికి కనీసం ఒక్క పూట వంట కూడా చేసిపెట్టలేకపోయింది. కోడలు కొనుక్కొని తినమని డబ్బులు ఇచ్చి వెళ్ళింది, ఇల్లు పాడవకూడదు అని కొన్నిరూమ్స్ కి లాక్ కూడా వేసుకొని వెళ్ళింది. అదంతా చూసి నవ్వుకొని వచ్చాడు శంకరయ్య.
వందన కాస్తో కూస్తో చూసుకుంది, పిల్లాడిని ఆడిస్తుంటే పార్వతమ్మే వండి వార్చింది, అల్లుడు బయటికి పోయి, స్ప్రైట్, మాజా తెచ్చి మానేజ్ చేసాడు.
మరుసటి రోజు హరిణి ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి హరిణి ఏడుస్తూ కూర్చుంది. తల్లిని చూసి ఇంకాస్త రెట్టించి ఏడుస్తోంది. ఏమైంది అని అడిగాడు శంకరయ్య.
ఏమి లేదు మామయ్య, ఆడవాళ్ళ పంచాయితీ అని చెప్పి వెళ్ళిపోయాడు.
హరిణి కూర్చొని “చూసావా అమ్మా? నేను ఎంత బాగా చూసుకున్నా, వాళ్ళ అక్క నేను సరిగ్గా చూసుకోవటం లేదని, నేను కోడలిగా వచ్చాక ఆమెకు లోటుపాట్లు ఎక్కువ అయ్యాయని, నేనేప్పుడు మా ఆయనతో పుట్టింటికి వస్తుంటే, ఆమెకు పుట్టింటి లో జరగాల్సినవి జరగట్లేదని, తిడుతోంది. ఇంటిలో ఎవరూ దేనికి మాట్లాడటంలేదు. అని ఏడుస్తూ వివరించింది.
అందరిని పలకరించి భోజనాలు అయ్యాక అల్లుడితో మాట్లాడి, బయలుదేరారు భార్యాబర్తలు.
ఇంటికి వచ్చాక వివేక్ అడిగాడు ఎలా ఉన్నారు అందరూ అని, శంకరయ్య నవ్వి వదిలేసిన, పార్వతి కొడుకుకి జరిగిందంతా వివరించింది. నవ్వేసి వెళ్ళిపోయాడు వివేక్.
హరిణి డెలివరీ అయ్యే వరకు అన్ని చూసుకున్నా వెళ్ళేటప్పుడు మళ్ళీ తక్కువగా చూసుకున్నారనే అనే సరికి జాహ్నవి పైకి నవ్వినా హరిణి వెళ్ళిపోయాక ఏడుస్తూ భోజనం కూడా చేయలేదు.
వివేక్ కి ఎలా సర్ది చెప్పాలో తెలియక కూర్చున్నాడు. ఈలోగా లోకానందం వచ్చాడు, జాహ్నవి ఏడుపు చూసి ఏమంటాడో అని భయపడ్డాడు వివేక్.
లోకానందం మామూలుగానే పలకరించాడు. సారీ మామయ్య అది….. అది….. అని చెప్పబోయాడు వివేక్.
నాకు తెలుసులే వివేక్ “ఇది ప్రతి ఇంటిలో వుండే బాగోతమే, పుట్టింటిలో వదిన చూస్తుంటే, సరిగ్గా చూడలేదని, మా అమ్మ చూస్తుంటే, వదిన పడనియ్యట్లేదని, వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు ఇవే కంప్లైంట్స్ వాళ్ళ ఆడపడుచు లు ఇస్తే, వీళ్ళు బాగా చూసుకుంటున్నట్లు చెబుతారు.
ఎక్కడైనా ఇదే వరుస, మనం ఏమి పట్టించుకోనట్లు వుండాలి, పుట్టింట్లో విషయాలు తెలిసి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అపార్థం చేసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తూనే వుంటాయి.
అదే ఆడపిల్లలు పుట్టింటిలో ఆడపడచుగా వున్నప్పుడు, ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ అత్త గారింటిలో ఆడపిల్లలు కూడా అదే ఆలోచిస్తారు.
ఎవరూ ఏది అర్థం చేసుకోరు, అన్ని ఇచ్చినా తక్కువగా చూస్తున్నారు అని అపార్ధం చేసుకుంటారు.
వాళ్ళు అదే వదిన, అత్త స్థానం లోకి వచ్చినా పుట్టిన ఇంట్లో వాళ్ళకి తక్కువ అయిందనే ఆలోచిస్తారు. తన అన్న భార్యనో, తమ్ముడి భార్యనో నిందిస్తూ వుంటారు.
ఇక్కడ “అర్థం చేసుకుంటే అక్కడ అపార్థాలు” తొలగుతాయి. ఇది మగవాళ్లకు త్వరగా అర్థం అవుతుంది. ఆడవాళ్లకు అపార్థం ఎక్కువ వంటపడుతుంది అంతే అని జ్ఞానబోధ చేసాడు.
థాంక్ యు మామయ్య అని చెప్పాడు వివేక్. ఇది నేను, మీ నాన్న ఎప్పుడో అర్థం చేసుకున్నాము, ఇప్పుడు నువ్వు, నాకూతురికి కూడా చెబుతాను అని వెళ్లి వివరించాడు లోకానందం.
ఈసారి పండుగకు వీళ్ళు, వాళ్ళు వచ్చి ఏమి చెప్పినా ఏమి కాదు అని “జాహ్నవి – వివేక్ “ లకు జ్ఞానం ఇచ్చి వెళ్ళాడు లోకానందం.
పార్వతి దగ్గరికి వెళ్లి ముందే చెప్పొచ్చు కదా అత్తయ్య అని అడిగింది జాహ్నవి. మీ మావయ్య వాళ్ళందరి ఇంటివిశేషాలు చెప్పినప్పుడు అర్థం అయ్యి వుంటుంది అనుకున్నా అమ్మాయి, అయినా ఇప్పుడు కూడా చాలా త్వరగా నేర్చుకున్నావు అని కోడలికి పరిస్థితులు గురించి వివరించింది.
జాహ్నవి ఎన్ని సార్లు, ఏమి చేసిన ఎప్పుడూ కొత్తగా సమస్యలు వస్తూనే వుంటాయి. అవి మనం “అర్థం చేసుకొని, అపార్తా లకు తావు ఇవ్వకుండా మనస్పర్తలు” రాకుండా చూసుకోవాలి అని వివరించింది పార్వతమ్మ.

“శుభం”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!