(అంశం:”అల్లరి దెయ్యం”)
ఈ ప్రశ్నలకు బదులేది ?
రచన: కందర్ప మూర్తి
హాల్లో అద్దం ముందు కూర్చుని బుగ్గలకి సబ్బు పట్టించి షేవింగు చేసుకుంటున్నాడు మోహన్.
మరోవైపు టేబుల్ మీద పుస్తకాలు ముందుంచుకుని ఎనిమిదవ తరగతి చదువుతున్న నాని( నాగేంద్ర) తండ్రిని తదేకంగా చూస్తున్నాడు.
అది గమనించిన మోహన్ ” ఏమిట్రా నానీ ! చదువు మాని నావంక చూస్తున్నావ్ ? ” అడిగాడు.
” నాన్నా ! రోజూ మీరు గెడ్డం గీసుకోకపోతే ఏమవుతుంది? ” అనుమానం వెలిబుచ్చాడు నాని.
” షేవింగు చేసుకోకపోతే వెంట్రుకలు పెరిగి గెడ్డం , మీసాలు పెద్దవవుతాయి ” సమాదానమిచ్చాడు తండ్రి.
” మరి దేవుళ్లు కూడా మీలా రోజూ గెడ్డం చేసుకుంటారా? ” మరో ప్రశ్న వేసాడు.
” అదేం పిచ్చి ప్రశ్న ? ” చికాకు పడ్డాడు మోహన్.
” అవును నాన్నా! త్రిమూర్తులు ముగ్గురిలో బ్రహ్మదేవుడికి నెత్తి మీద తెల్ల జుత్తుతో పాటు గెడ్డాలు మీసాలు కనబడతాయి. ఈశ్వరుడికి నెత్తి మీద జడల జుత్తు మరికొన్ని
ఫోటోల్లో మీసాలు ఉంటాయి. విష్ణుమూర్తి కి గెడ్డాలు మీసాలు ఉండవు. నారదుడికి నెత్తి మీద కొప్పు ఉంటుంది కాని గెడ్డం మీసం కనిపించవు.
రామాయణంలో విశ్వామిత్రుడికి నల్లని పొడవైన గెడ్డం మీసాలు ఉంటే
రామలక్ష్మణులకి నెత్తి మీద జడల జుత్తు ఉంటుంది. గెడ్డాలు మీసాలు ఉండవు.
కురుక్షేత్రం సినిమాలో భీష్ముల తాతకి తెల్లని జుత్తు వత్తుగా గెడ్డం మీసాలు
కనబడితే కృష్ణుడికి కనిపించవు. అర్జునుడు, కర్ణుడు లాంటి వారికి ఒక్క
మీసాలే ఉంటాయి. మరి మిగతా దేవుళ్లు మీలా రోజూ గెడ్డం చేసుకుంటారా ?
క్షవరం చెయ్యడానికి బార్బర్సు ఉంటారా? ఋషులకి మునులికీ నెత్తి మీద
జడల జుత్తు గెడ్డం మీసాలు ఉంటున్నాయి.
మనుషులు ముసిలయితే తెల్ల జుత్తు గెడ్డాలు మీసాలు పెరుగుతాయా ? ”
ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే తెల్ల మొహం వేసాడు తండ్రి మోహన్.