హాస్టల్ లో హత్య

(అంశం:”అల్లరి దెయ్యం”)

హాస్టల్ లో హత్య

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

పావని పెద్ద పెద్దకళ్లతో, పోడుగుకి తగ్గ లావుతో, ఎక్కడ ఉండవలసిన అవయవసంపద అక్కడ ఉంటూ… తెల్లగా, బుట్టబోమ్మల ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత అందంగా ఉంటుంది.

ఈ మధ్యనే పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయిన పావని గురించి…

“అంత అందంగా ఉన్న కూడా చదువు మీద ఎంత శ్రద్ద. మన ఊరి బడిలో ఇప్పటి వరకు పావనిలా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయిన వారు ఎవరు లేరు” అని అంతా గొప్పగా చెప్పుకునేవారు.

దానితో ఎలాగైనా పావనిని పై చదువులు చదివించాలని అనుకున్నారు వాళ్ల బడి ప్రధానోపాధ్యాయులు రఘురామయ్యగారు కాని, ‘వాళ్ల ఊరిలో కాలేజీ లేకపోవడం వలన పై చదువులు చదవాలంటే పట్నం లో ఉన్న కాలేజీ హాస్టల్ లో పెట్టి చదివించక తప్పదు.. అందుకు వాళ్ల తల్లిదండ్రుల అంగీకారం కావాలి. ఎలా!?’ అని ఆలోచనలో పడి, ‘ముందు అటు నుంచి నరుక్కు రావాలి’ అనుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టారు.

కాని, వాళ్ల అమ్మ జయ మాత్రం ” ఇంకా చదివింది చాలులే. ఉత్తరం వ్రాయడానికి ఈ మాత్రం చదువు చాలు. ఇంకా చదివి, ఉద్యోగం చేయాలా!?… ఊర్లు ఏలాలా!?… ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టల్సిందే. పెళ్ళి చేసేద్దాం” అని భర్తతో పోరు పెడుతుండేది.

అఖరికి ఎలాగో పావని తల్లిదండ్రులైన జయ, జగదీష్ లను ఒప్పించి పట్నంలో తనకి తెలిసిన కాలేజీలో దగ్గర ఉండి జాయిన్ చేసారు. రఘురామయ్యగారు. తానే స్వయంగా దగ్గరలో ఉన్న హాస్టల్ కూడా చూసి, అవసరమైనవన్ని అమర్చి, అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు రఘురామయ్య గారు.

పావని పల్లెటూరిలో పెరగడం వలన తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్లు అనుకునే రకం. ఉత్త అమాయకురాలు. తన తల్లిదండ్రులను ఎపుడు విడిచిపెట్టి ఉండకపోవడం వలన వారి మీద బెంగతో ఎవరితో అంతగా కలవలేకపోయేది.

పట్నం పోకడలు ఇంకా పావనిని చేరలేదు. తన చదువు అంతా తెలుగు మీడియంలో సాగడం వలన మెుదటిసారిగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అర్థం అవ్వక , ఎవరిని అడిగి అనుమానాలు తీర్చుకోవాలో తెలియక సతమతమయ్యేది. అందువలన ఎపుడూ చదువుతూ తానా లోకంలో తాను ఉండేది. ఎవరిని పట్టించుకునేదికాదు.

పావని రూమ్ లో పావని తో పాటు ఇంకా ముగ్గురు సోని, కాంతి, రాణి ఉండేవారు. వాళ్లు ఎపుడు చాలా పోగరుగా ఉంటూ తోటి హాస్టల్ స్టూడెంట్స్ ని ఏడిపిస్తుండేవారు.

ఒకనాడు తెల్లవారే సరికి హాస్టల్ అంతా గగ్గోలు ఎత్తి పోయింది. తెల్లవారు జామున బాత్రూం కి వెళ్లిన రాణికి పావని హాస్టల్ బాత్రూమ్ లో పడి పోయి కనిపించింది.

వెంటనే సోని, కాంతిలను పిలిచి, వారి సాయంతో పావనిని రూమ్ లో చేర్చింది…
ఆ తరువాత ఆ ముగ్గురు కలిసి, వార్డెన్ రూమ్ కి వెళ్లి విషయం అంత వివరించి, డాక్టర్ ని పిలిపించమన్నారు.

“సరే, మీరు వెళ్లి మీ పనులు చూసుకొని కాలేజీకి వెళ్లండి. ఏం చేయాలో తక్కింది అంతా నేను చూసుకుంటాను” అని పంపించేసింది వార్డెన్ రంగమ్మ.

ఆ విధంగా సోనివాళ్ళు, పావని బాధ్యత వార్డెన్ రంగమ్మకు అప్పగించేసి, తమ పని అయిపోయిందనుకుని, చేతులు దులుపుకుని రోజులాగే సమయానికి కాలేజీకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత లంచ్ టైం కి బుక్ కోసం రూమ్ కి వెళ్లి, వచ్చిన రాణి, ఆమె స్నేహితులకు ఆ మధ్యాహ్నం అంతా ఎంతో అందోళనగా కనిపించడంతో . “ఏంటే!? మధ్యాహ్నం హాస్టల్ కి వెళ్లి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాం!? ఎందుకు అలా ఉన్నావు!? ఏం జరిగింది!?…” అని ఎందరు, ఎంతగా అడిగిన చెప్పకుండా ఉలుకు పలుకు లేకుండా చూస్తుండిపోయింది.

ఆ రాత్రి రూమ్ కి వెళ్లిన సోని వాళ్లతో “పావనికి ఆరోగ్యం బాగోకపోవడం వలన వాళ్ల పేరెంట్స్ ని పిలిచి, వాళ్ల ఊరు పంపించేసానని” చెప్పింది రంగమ్మ.

“సరే! ఏదయితే మనకేమిటి!? మనకి దాని సేవలు తప్పిపోయాయి. అంతే చాలు” అని అనుకుని ఎవరి పనులలో వారు పడ్డారు.

కాని ఆ రాత్రి రాణికి విపరీతమైన జ్వరం వచ్చి, నిద్రలో ఒకటే కలవరింతలు మొదలుపెట్టింది.

“పావనిని ని చంపేస్తున్నారు, రక్షించండి. మనల్ని కూడా చంపేస్తారు ఇక్కడ నుంచి పారిపోవాలి” అని కలవరిస్తున్న రాణిని లేపి, మంచి నీళ్లు తాగించి,శమ కొంచెం తేరుకున్నాక “ఏం జరిగిందని” నెమ్మదిగా అడిగారు సోని, కాంతి.

మెుదట చెప్పడానికి ఇష్టపడని రాణి, వారి స్వాంతన వచనాలతో ఇంకా మనసులో దాచుకోవడం తన వలన కాక కొంచె ధైర్యం తెచ్చుకుని, మధ్యాహ్నము తాను హాస్టల్ కి వచ్చినపుడు చూసిన విషయం సోని, కాంతిలతో చెప్పింది.

ఆ తర్వాత మనసులో బాధ స్నేహితులతో పంచుకోవడం వలన గుండె బరువు తగ్గిన రాణి, హాయిగా నిద్రపోయి, ఉదయం లేచి, రోజులాగే స్నేహితులతో కలిసి కాలేజీ వెళ్లిపోయింది.

ఆ రోజు మధ్యాహ్నం పోలీసులు వచ్చి హాస్టల్ వార్డెన్ ని అరెస్టు చేసారు.

ఆ తరువాత S. I హాస్టల్ లోని పిల్లలనందరిని సమావేశ పరిచి రాణి, సోని, కాంతి లకు జరిగిందంతా చెప్పి,అభినందించారు.

“ఇంతకు ఆ రోజు పావని క్లాస్మేట్స్ కాలేజీకి వెళ్లిపోయిన తర్వాత ఆ హాస్టల్ లో ఏం జరిగింది!?”

బాత్రూమ్ లో నీరసంతో పడిపోయిన పావనిని రూమ్ లో వదిలి స్టూడెంట్స్ అంతా కాలేజీకి వెళ్లిపోయారు.

హాస్టల్లో ఒక్క పావని మాత్రమే ఉంది. హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి పావని మీద కన్నేసిన రంగమ్మ తమ్ముడు వీర బాబు పావని ఒంటరిగా ఉందని తెలిసి, అక్క లేని సమయంలో హాస్టల్ కి వచ్చి, పావనిని బలవంతంగా బలాత్కరించడానికి ప్రయత్నించాడు.

ఆ పరిస్దితి నుంచి తప్పించుకోనే ప్రయత్నంలో పావని తల అక్కడే ఉన్న రీడింగ్ టేబుల్ కి తగులుకుని, , కణతలకి దెబ్బ తగిలడంతో అక్కడికి అక్కడే మరణించింది.

అది భయంతో ఏమి తోచని వీర బాబు, జరిగిన సంగతి అంతా అక్కకి చెప్పేసి, “ఈసారికి నన్ను క్షమించు అక్కా!, ఈ గండం నుంచి నువ్వే నన్ను తప్పించాలి. ఈసారి ఈ గండం నుంచి తప్పిస్తే, ఇంకేప్పుడు ఇలాంటి పని చేయను, ఈ సారికి క్షమించి సాయం చేయమని” రంగమ్మ కాళ్ల మీద పదేపదే వేడుకున్నాడు.

జరిగిన దానికి రంగమ్మ … అప్పటికి కోపం తెచ్చుకున్న కాని, తమ్ముడి మీద ఉన్న అమితప్రేమతో మరి చేసేదేమీ లేక తమ్ముడితో “మరేపుడైన హాస్టల్లో కనిపిస్తే పోలిసోలకు పట్టిస్తాను” అని చెప్పి…

ఆ తర్వాత వారిద్దరు కలిసి, పావనిని మాయం చేయడానికి పధకం వేసారు.

ఆ వెంటనే వీర బాబు పావని శవాన్ని గోనెలో చుట్టి బయటకి వెళ్లిపోయాడు.

అదే సమయంలో రికార్డ్ బుక్ మర్చిపోయిన రాణి హాస్టల్ కి వచ్చి జరిగినది అంతా చాటు నుంచి చూసి భయంతో వెంటనే రూమ్ కి వెళ్లకుండా కాలేజీకి వచ్చేసింది.

కాని తన మనసులో ఉన్న విషయం భయం కారణంగా ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరికి చెప్తే ఏం ప్రమాదమో అని తనలో తానే కుమిలిపోతు జ్వరం తెచ్చుకుని, నిద్రలో కలవరింతల రూపంలో బయటపెట్టేసింది.

ఆ కలవరింతలు పక్క బెడ్ మీదనే ఉన్న సోని విని రాణిని లేపి , తాగడానికి మంచి నీరు అందించి ,మంచి మాటలతో దైర్యం చెప్తూ, మెల్లిగా అస్సలు విషయం తెలుసుకుంది.

స్వతహాగా దైర్యవంతురాలైన సోని వెంటనే తనకి తెలిసిన S. I. అంకుల్ కి విషయం చెప్పడం వలన పోలీసులు వచ్చి వార్డెన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాలు చకచకా చేసేసారు పోలీసులు.

పోలీస్ లు అరెస్ట్ చేసిన రంగమ్మను ఇంటరాగేట్ చేసిన పోలీసులతో, స్వతహాగా మంచిదైనా రంగమ్మ తమ్ముడి మీద ప్రేమతో తప్పు చేయడానికి సిద్దపడటం వలన ఎక్కువసేపు నిజం దాయలేక జరిగింది అంతా చెప్పేసింది.

అన్ని వివరాలు రంగమ్మ నుండి సేకరించిన పోలీసులు పావని శవంతో పాటు అదే వార్డ్ లో ఉన్న వీర బాబు ఇంటిలో ఉన్న వీరబాబుని పట్టుకుని అరెస్ట్ చేసారు.

అంతా తెలిసి గుండెలు బాదుకుంటూ వచ్చిన పావని తల్లిదండ్రులను చూసి, కన్నీరు కార్చని మనిషంటూ లేరు.

” తమకు ఒకర్తె కూతురు. అంత దూరం పంపించి తాము పావనిని చూడకుండా ఉండలేమని, అందుకే అస్సలు అంత దూరం పంపించనని” అంటున్న జయ, జగదీష్ లని ఒప్పించి పట్నం తీసుకుని వచ్చి హాస్టల్లో జాయిన్ చేసానని, తన కారణంగానే పావని చనిపోయిందని, తాను అపుడే వదిలేసి ఉంటే పావని తమ కళ్లేదురు నవ్వుతూ చక్కగా బ్రతికి ఉండేదని” ఏడుస్తూన్న రఘురామయ్యని కూడా ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

కేసు నమోదు చేసిన పోలిసులు కోర్టులో వీరబాబుని, రంగమ్మని హాజరు పరచగా, అంతా విచారించిన కోర్టు , ఈ కేసులో రంగమ్మ తప్పు లేదు. కాని నేరం దాయడానికి ప్రయత్నించిన కారణంగా 6 నెలల జైలు శిక్ష విధించింది.

తరువాత వీరబాబుకి పావని పై అత్యాచార ప్రయత్నం చేసినందున, పావనిని ఉద్దేశపూర్వకంగా హత్య చేయనందువలన , 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తో సరిపెట్టేసింది కోర్టు.

“నేరస్దులకి ఆ శిక్షలు తక్కువ. పై కోర్టులకు వెళ్దాం” అంటూ గొడవ చేస్తున్న మీడియాను ఉద్దేశించి…

“ఎంత పెద్దశిక్ష వేసిన పోయిన తమ కూతురు తిరిగి రాలేదని, తమని తమ మానానా ఇలా వదిలేయమని” కన్నీళ్లతో వేడుకున్నారు జగదీష్ దంపతులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!