ఆనంద డోలికలు
రచన : సావిత్రి కోవూరు
పచ్చటి తోరణాలు – పసుపు కడపల్లు
పసుపు కడపల్ల – పలువిరుల హారాలు
విరుల హారాలతో – మురిసేటి లోగిళ్ళు
మురిసేటి లోగిళ్ళ – ముందు ముంగిళ్ళు
ముందు ముంగిళ్ళలో – ముత్యాల ముగ్గుల్లు ముత్యాల ముగ్గుల్ల – రత్నాల రంగుల్లు
రత్నాల రంగుల్ల – అందాల గొబ్బిళ్ళు
అందాల గొబ్బిళ్ళ – పసుపు కుంకుమల్లు
పసుపు కుంకుమల తోటి – లక్ష్మి పూజల్లు
లక్ష్మి పూజలు చేయు – ఆడపిల్లలు
ఆడపిల్లలు చేయు – అలంకరణాలు
అలంకరణలు చేసి – కొత్తబట్టలు
కొత్త బట్టలు వేసిన – బుట్ట బొమ్మలు
బుట్ట బొమ్మల కాళ్లకు – సరి మువ్వ గజ్జెలు
మువ్వ గజ్జెలు చేయు – మంజుల నాదాలు
మంజుల నాదాల – మురిసేటి మనముల్లు
మురిసేటి మనముల్ల – ముద్దు పాపాయిలు
ముద్దు పాపాయిల – ముద్దు ముచ్చట్లు
ముద్దు ముచ్చట్లుచూసి – మురిసేటి తల్లులు
మురిసేటి తల్లులా – కళ్ళల్ల దీపాల వెలుగులు దీపాల వెలుగుల్ల – ఎన్నెన్నో జిలుగులు
ఎన్నెన్నో జిలుగుల్ల – బొమ్మల కొలువులు
బొమ్మలా కొలువుల్ల – ఆనంద డోలికలు.