ఆ రోజులే వేరప్పా.

ఆ రోజులే వేరప్పా…

రచన: అమూల్యచందు

ఆ రోజులే వేరప్పా…

ఎడ్ల బండి ఎక్కి ఊరంతా తిరగడం.
పండగలు వస్తే చిత్తులాటలు ఆడడం..
గెలిచిన డబ్బులతో పీసు మిఠాయి ఆబగా తినడం
వర్ణించలేని అందమైన అనుభవం..

ఎండాకాలంలో సీమ చింతకాయలు
కోయడానికి చెట్లను వెతకడం,
ఈత పళ్ళు కోయడం
మర్చిపోలేను రోజులవి…

2 రూపాయల నేల టికెట్టుకు
బ్లాక్ అండ్ వైట్ సినిమాలు
చూడడం…
నిజంగా ఇవ్వాళ్టికి ఒక వింతే…
చెప్పాలంటే
గూగుల్ నీడకు, ఆండ్రాయిడ్ ఒడికి
అందనంత దూరంలో గడిచిన
బాల్యం..

కొండ బెల్లం కోసం కొట్టుకున్న
నేస్తాలు గుర్తొస్తే నవ్వొస్తుంది..
ఏడవడం తెలీని రోజులవి…
ఆటలంటే ఆటలు,
లేదంటే కధలు కధలుగా
చెప్పుకునే తరతరాల
బాల్యం, తరగని భాగ్యం..

చందమామ, బాలమిత్ర కధల్లో
రాజులూ, రాణులు, మంత్రులు,
సేనాధిపతులు కూడా మేమే..
దుమ్ము రేపే ఎర్ర బస్సు ఎక్కి
కిటికీ పక్కన కర్చీఫ్ వేస్తె
విమానంలో ఎగిరినంత సంబరం..

ఇప్పటి బాల్యం
బంగారు తాపడం ఐతే
అప్పటి బాల్యం
ప్రకృతి చేసిన
పచ్చని తాపడం..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!