ఆదర్శం
రచయిత : యం.సుశీలారమేష్

శైలజ వాణి ఇద్దరూ చిన్ననాటి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకున్నారు. చదువుకుంటూనే కుట్టుపని నేర్చుకున్నారు. డిగ్రీ వరకు చదివి ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ వివాహం జరిగింది. ప్రస్తుతానికి ఒకే ఊరులో ఉంటున్నారు.
ఎందుకో తెలియదు కానీ శైలు ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
హాస్పిటల్లో ఉంది. పరుగు పరుగున వచ్చింది వాణి. శైలు స్పృహ లో లేదు. శైలు పక్కనే కూర్చుంది వాణి.
కాసేపటికి శైలు కి స్పృహ వచ్చింది. డాక్టర్ చెక్ చేసి వెళ్ళాక.
ఏంటే తింగరి దానా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటీ పిచ్చి పనులు, చచ్చేంత కష్టం నీకు ఏం వచ్చిందే అంటూ ఏడుస్తూ అడిగింది వాణి.
ఏం చెప్పను వాణి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే సామెత తెలుసు కదా నా బ్రతుకు కూడా అలాగే ఉంది. అని అంటుంది శైలు.
“అర్థం కాలేదా సరే చెప్తున్నాను విను అంటూ శైలు చెప్పడం మొదలుపెట్టింది.”
స్కూలుకి వచ్చేటప్పుడు అన్ని పనులు చేసి వచ్చేదాన్ని. ఇంటిదగ్గర. నా జీతం మొత్తం తీసుకునే వారు ఆయన. ఏది కావాలన్నా చేయి చాచాల్సిన పరిస్థితి నాది. నాకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎన్నో ప్రశ్నలు. నువ్వు చెప్పవే వాణి నేను ఎంత సాదాసీదాగా ఉంటాను.
నాకంటూ స్వేచ్ఛ లేదు పంజరంలో చిలుకకు కూడా ఏదో పండు గుర్తుపెట్టుకొని ఇస్తారు. పనంతా చేసినా ఏదో వంక పెట్టి తిట్టడం చేసేవారు. అత్తమామలు సరే సరి.
మా ఆడబిడ్డ సరోజిని ప్రతినెలా రావడం పది రోజులు తిష్ట వేయడం.
వచ్చినందుకు నాకేమీ అభ్యంతరం లేదు కానీ, ఉంది తన పిల్లల పనులు కూడా నాతోనే చేయించేవారు, పిల్లలకు కూడా పని చేసుకో లేని తల్లి ఎందుకంటారో నాకు అర్థం కాదు.
మొత్తం పనంతా ఒక్కదాన్నే చేసిన అత్తయ్య గానీ ఆడబిడ్డ గాని సాయం చేసేవారు కాదు. పైగా ఎగతాళిగా మాట్లాడేవారు ఇద్దరు. వాళ్ల నటనకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువే బాబు. ఆయన ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ పని చేస్తున్నట్టు నటించడం ఆయనేమో నన్ను తిట్టడం. ఎంత చేసినా నేను పని మనిషి కన్నా హీనంగా చూసేవారు. మాత్రం మా ఆడబిడ్డ లాంటి కూతురు ని కాదా.
లాక్డౌన్ వలన స్కూలు మూసేశారు కదా అంటే ఉద్యోగం పోయింది ఇక అప్పటి నుంచి చూడాలి నా బ్రతుకు కుక్క కన్నా హీనంగా అయిపోయింది. ఉద్యోగానికి ముందు కన్నా తర్వాత దిగజారిపోయింది పరిస్థితి.
తినడానికి కూడా ఆంక్షలు విధించే వారు వాణి. నా చేతుల తో వండిన కూడా నన్ను రాత్రి మిగిలినవి తినమనే వారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన మరీ దారుణం.
ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు కేవలం సుఖాన్ని ఇచ్చే వస్తువుగా చూసేవారు నా మనసును అర్థం చేసుకునే వారు కాదు.
అసలే పని భారం వలన అలసిన నేను గదిలోకి వెళ్లగానే ఆయన దారుణానికి బలే పోయేదాన్ని.
నాలాంటి బ్రతుకు ఇంకెవరికి ఇవ్వకు దేవుడా అని మొక్కని రోజంటూ లేదు. చూసావా నన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు అంటే నీకు అర్థం కాలేదా నేను ఎంత బరువు అయ్యాను వాళ్ళకి.
“ఇప్పుడు చెప్పు వాణి నేను చావడంలో తప్పు లేదు కదా అని చెప్పడం ముగించింది వాణి”
ఒసేయ్ పిచ్చి మొద్దు అన్నిటికీ చావే పరిష్కారం కాదు.
నీ కన్నా దారుణంగా హింసింప పడ్డవాళ్ళు. చాలామంది ఉన్నారు. నేను నీకు ఒకరిని పరిచయం చేస్తాను, ఆవిడ మాటలు విన్నాక బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం అంటూ హాస్పిటల్ బిల్ చెల్లించి శైలు ని తీసుకుని ఆటోలో బయలుదేరింది వాణి.
ఆటో ఒక భవంతి ముందు ఆగింది.
అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. భవంతి మీద
ఆదర్శ మహిళ సంఘం
అని రాసి ఉంది.
అందరిలో ఒక ఆవిడ మాత్రం మూర్తిభవించిన సుందర రూపంతో
శాంతికి మరో రూపంలా సౌమ్యమైన స్వరంతో మైక్ లో మాట్లాడుతుంది.
శైలు వాణి ఇద్దరూ లోపలికి వచ్చి కూర్చున్నారు.
ఏమే శైలు, ఆవిడే సంగీత
మేమంతా అక్కా అని పిలుస్తాము అని చెప్పింది వాణి.
ముందు ఆవిడ ఏం చెబుతుందో నేను శైలు అంటుంది వాణి.
సంగీత అక్క మాటలు ఇలా ఉన్నాయి:
తల్లి చెల్లి ఆలీ ఇలా అనేక బాధ్యతలను నిర్వహిస్తున్న స్త్రీలు
వారి అనుకున్న జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారా, ఎలాంటి కష్టాలు లేకుండా జీవన గమ్యం చేరుతున్నారా.
పుట్టింది మొదలు అమ్మా నాన్న మాట వినాలి. బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడుగా ఉండాలి. గట్టిగా నవ్వకూడదు. ఈడు వచ్చిందంటే పెళ్లి కోసం పక్కింటి వారు మొదలు ప్రతి ఒక్కరికీ ఆరాటమే.
ఈ జీవిత పరీక్షలు ఉండగానే ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా ఆవేం పట్టవు అందరికీ చదువు ఎందుకు పనికొస్తుంది ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుంది అనే మాటలు. కొంతమంది పెద్దవారు పట్టించుకోరు గానీ. కొంతమంది పెద్దవారికి ఆ మాటలే వేదమంత్రాల్లా గోచరిస్తాయి. వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.
వివాహం జరిగాక కథ మొదలు. పుట్టింట్లో ఉన్న ఆ కాస్త స్వేచ్ఛ కూడా ఉండదు. అత్తింటివారు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి. బాధ అనిపిస్తే భరించాలి తప్ప బయటకు చెప్పకూడదు. సంతోష క్షణాలు తక్కువే. ఇలాంటి క్షణాల్లో మరొకరికి జన్మనివ్వడం వారి ఆలనాపాలన చూడడం, అత్త మామ మరదలు ఆడపడుచులు భర్త ఇలా మొత్తం అదే లోకం. ఆడదాని జీవితం కనుమరుగవుతున్న జీవనం.
ఇలాంటి సమస్యలతో పోరాడి ఒంటరి జీవితాన్ని ఎంచుకున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలాంటి జీవనంలో కాసింత ప్రశాంతత దొరికిన వారిని కొన్ని మృగాళ్లాంటి జీవాలు వదలడం లేదు. ఏం చేయాలో తెలియక సతమతమయ్యే మహిళలు వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎంత మాత్రం మంచిది కాదు.
చూసే వాళ్లంతా ఆమెకు ఏంటి చక్కని భర్త పిల్లలు అనుకునే వారి సంఖ్య ఎక్కువ. కానీ లోపల జరిగే ఆకృత్యాలు చూసే వారు తక్కువ.
ఆకృత్యాలను భరించలేక బయటకు వచ్చిన వారు, వరకట్నపు మంటల్లో దగ్ధమయ్యే అబలలు చాలామందే ఉన్నారు. ఒక్కో క్షణం కొంతమంది మహిళలు ఇలాంటి జీవనం కొనసాగించి బదులు మ్రృత్యుఒడిని కౌగలించుకుంటే బాగుంటుంది అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ. చెరసాల సమానమైన జీవితం నుండి మేల్కొని తన జీవన గమనం ఎటో నిర్ణయించుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకు ఉంది చావు ఒక్కటే పరిష్కారం కాదు. మనం ఆదర్శంగా బతుకుతూ ఇంకొంత మందికి ఆశ్రయం ఇవ్వగలగాలి. అదే జీవిత పరమార్థం చచ్ఛి సాధించేది ఏమీ లేదు.
ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించాలి.
అని చెప్పడం ముగించింది సంగీత అక్క.
తర్వాత వాణి శైలు ని తీసుకెళ్లి సంగీత అక్క కు పరిచయం చేసింది.
శైలు పరిస్థితి అంతా వివరించింది వాణి సంగీతకు.
నీకు ఇష్టమైతే రేపట్నుంచి వాణి తో పాటుగా ఇక్కడ వర్క్ చేయొచ్చు తల్లి, అంటుంది సంగీత అక్క.
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి దుస్తులు కుట్టి మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరిద్దరూ చదువుకున్న వారు కాబట్టి మార్కెటింగ్ సంగతి మీరు చూసుకోండి అంటుంది సంగీత అక్క.
ఎంతోమంది మహిళలకు ఆశ్రయమిచ్చి అబలను సబలగా
తీర్చి దిద్ధుతుంది. సంగీత.
తను కూడా ఇలాంటి ఆకృత్యాలకు బలైన మహిళే కానీ ధైర్యం వీడక తన పట్టుదలతో తనకు వచ్చిన విద్యతో తానే కాకుండా మరికొంత మంది ఆడ వాళ్లను చేరదీసి వారికి కూడా ఉపాధి కల్పించింది. సంగీత జీవితం ఎంతో మంది మహిళలకు ఆదర్శం
