అల్పమైన కోరికలు

అల్పమైన కోరికలు

రచయిత :: సావిత్రి కోవూరు

ఆఫీస్ కెళ్లాడన్న మాటేగానీ మనసు మనసులో లేదు.మనసంతా గందరగోళంగ ఉంది.అస్సలు పని చేయాలని అన్పించట్లేదు. రోజు  ఆఫీసుకు రాగానే “ఏమండి చేరుకున్నారా”అని అడిగే లక్ష్మీ ఈ మధ్య ఫోన్ చేయట్లేదు. లక్ష్మి చాలా మారిపోయింది. నెల రోజుల నుంచి అసలేమీ మాట్లాడట్లేదు.
ఎప్పుడూ ఇంట్లో టీవీ పెట్టుకొని, ఫ్రెండ్స్ గురించి కానీ, పిల్లల గురించి కానీ ఏదో ఒకటి గలగల మాట్లాడుతూనే ఉండేది. ఉదయం లేచిన దగ్గర్నుంచి నా చుట్టూ తిరుగుతూ ఏం కావాలో శ్రద్ధగా చూసేది. అలాంటిది సడన్ గా ఎందుకు మారిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. చాల బాధగా ఉంది. ఈరోజు ఎలాగైనా కనుక్కోవాలి అనుకున్నాను.

ఇంటికి వెళ్ళగానే “లక్ష్మి, లక్ష్మి ఎక్కడున్నావ్, ఏం చేస్తున్నావు, ఇటు రా” అన్నాను.
“పెరట్లో ఉన్నాను. పక్కింటి పిన్నిగారు ఏదో మాట్లాడుతుంటే వింటున్నాను” అని నింపాదిగా చెబుతూ వచ్చి స్నాక్స్ తెచ్చి టేబుల్ పైన పెట్టి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.

మామూలుగా అయితే తను నేను వచ్చేలోపలే పనులన్నీ ముగించుకుని, తనకు నాకు స్నాక్స్ తీసుకుని వచ్చి ఎదురుగ మాట్లాడుతూ కూర్చునేది. కాసేపయ్యాక టీ తెచ్చి అక్కడ పెట్టేసి లోపలికెళ్లి  పని చేసుకుంటుంది. నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది.

ఆ రోజు నుండి మధ్య మధ్య నేను ఆఫీసు నుండి వచ్చేసరికి, ఇంటికి తాళం ఉంటుంది. ఒక రోజు నేను వచ్చిన రెండు గంటలకు వచ్చిన లక్ష్మితో “ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి, అంటే పక్కింటి ఆంటీ తో సినిమాకి వెళ్ళాను అన్నది. ఫోన్ చేయొచ్చు కదా, అంటే సీరియస్ గా ఒక చూపు చూసి వెళ్ళి పోయింది. దానర్థం నీవు వెళితే ఫోన్ చేస్తున్నావా? అని. నేను ఎన్నో సార్లు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినా ఒక్కసారి కూడా ఫోన్ చేసి చెప్పేవాడిని కాదు. అలాగే ఒక రోజు షాపింగ్ కని ఒకరోజు బంధువుల ఇంటికని ఏదేదో చెప్పేది.

అసలు లక్ష్మిని చూస్తుంటే  కొత్త మనిషిలాగ అనిపిస్తుంది. పెళ్లయినప్పటి నుండి నేను ఇంటికి వచ్చేదాకా ఇంట్లో ఉన్నంత సేపు ఏదో మాట్లాడుతూ ఏదో చేసి పెట్టి, ఎలా ఉందని అడుగుతూ, ఈ చీర బాగుందా అని అడుగుతూ, తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ,టీవీ లో చూసిన జోక్స్ గురించి  చెబుతూ తిరిగే మనిషి ఎందుకిలా చేస్తుందో నాకస్సలు అర్థం అవ్వట్లేదు.

ఈ రోజు కచ్చితంగా లక్ష్మీ తో మాట్లాడి తెలుసు కోవాలని “లక్ష్మి నీ వంట పని అయిపోయిన తర్వాత నీతో మాట్లాడాలి వచ్చి కూర్చో” అన్నాను. వంటచేసి భోజనాలు అయిన తర్వాత బెడ్ రూమ్ వైపు వెళ్తున్న లక్ష్మితో “ఒక్క ఐదు నిమిషాలు ఇటు రా” అన్నాను.

“నాకు నిద్ర వస్తుంది తర్వాత మాట్లాడదాం” అంది.

“కాదు ఇప్పుడే మాట్లాడాలి. ఒక ఐదు నిమిషాలు ప్లీజ్” అన్నాను.
మౌనంగానే వచ్చి ఎదురుగా కూర్చుంది అనాసక్తిగా.

“లక్ష్మి మన పెళ్లి అయిన దగ్గర నుండి నీవు ఇలా ఎప్పుడు ప్రవర్తించ లేదు. ఈమధ్య నాతో మాట్లాడడం చాలా తగ్గించేశావు. పిల్లలకు కూడా ఫోన్స్ తగ్గించేసావు. వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, చీర బాగుందా?, సాయంకాలం ఎన్నింటికి వస్తారు, జాగ్రత్తగా వెళ్ళండి ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడే దానివి. ఇప్పుడు డ్యూటీ లాగ అన్ని టైం కి అమరుస్తున్నావు. కానీ ముందు లా నవ్వుతూ ఆప్యాయంగా పలకరించడం లేదు. నీకేమైనా ఆరోగ్య సమస్యనా, ఇంకేమైనా సమస్యలా లేక పిల్లల పైన బెంగనా,లేక నావల్ల తప్పు ఏమైనా జరిగిందా చెప్పు. నీవు ఇలా ఉంటే నాకు అస్సలు బాగుండటం లేదు. పోని కొన్నిరోజులు ఎటైన వెళ్ళొద్దామా? నీవు ముందు లా గలగల మాట్లాడితేనే బాగుంటుంది ప్లీజ్” అన్నాను.

“నేను ముందు లానే గలగల మాట్లాడతాను. మీరు మాత్రం సెల్లు చూస్తూ, ల్యాప్టాప్ చూస్తూ , లేకపోతే ఫ్రెండ్స్ తో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండండి. నేను మాత్రం ఏదో ఒకటి వాగుతుంటాను మీరు మాత్రం వింటే వినండి లేకపోతే లేదు. మీకు బోర్ కొడితే ఎక్కడికైన వెళతారు ఫ్రెండ్స్ తో.

ఇన్ని రోజులు పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, ఉండడం వల్ల మీరెలా ఉన్నా నా సరదాలన్ని చంపేసుకుని మెలిగాను.. మీరు హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు గడిపారు. ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కదాన్నే ఉంటాను. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నా ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతుంటాయి.

ఇంట్లో వుండే ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. భర్త పిల్లలు సంసారం అంతే. పెళ్ళయింతర్వాత  భర్తను వదిలి పుట్టింట్లో కూడ ఎక్కువరోజులు ఉండడానికి ఇష్టపడరు ఆడవాళ్ళు. మీ ఇష్టా యిష్టాల గురించి, మీ గురించే ప్రతి నిమిషం ఆలోచించే మాకు కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఉదాహరణకు  మీరు ఆఫీస్ నుండి రాగానే కాఫీ ఇస్తే చాలా బావుంది అన్నారనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంతో శ్రద్ధగా కష్టపడి రుచిగా వంట చేసి పెడితే, కనీసం ఒక్క మెప్పుకోలు మాటయిన అనకుండ తినేసి వెళ్ళిపోతే చేసిన శ్రమ అంతా వేస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా కొత్త చీర కట్టుకుంటే బాగుంది ఒక మాట అన్నారు అనుకోండి, కొండెక్కినంత సంతోషంగా ఉంటుంది. నెలలో ఒక్కసారైనా ట్యాంక్ బండ్ కో, నెక్లెస్ రోడ్డుకో తీసుకెళ్లి మూరెడు మల్లెపూలు కొనిస్తే, నా అంత అదృష్టవంతురాలు లేదని అనుకుంటారు. మీరు ఏం మాట్లాడకపోయినా నేను మాట్లాడే విషయాలు శ్రద్ధగా వింటే చాలా సంతోషం. అలా కాకుండా నేనేదో రోబోట్ లాగా అన్నీ అమర్చి పెడుతూ, మీరు విన్నా వినకపోయినా ఏదో నా అంతట నేను వాగుతూ ఉండలేను. మీరు ఎప్పుడొస్తారు అని పొద్దుటి నుంచి ఎంతో ఎదురు చూస్తుంటే సాయంత్రం వచ్చి మీరు స్నాక్స్ తిని కాఫీ తాగి ఆ సెల్లు ముందర పెట్టుకొని దాంతో అదే లోకం అన్నట్టుగా నన్నసలు పట్టించుకోకుండా ఉంటే నేను ఏదైనా మాట్లాడినా వినిపించకోకపోవడం ఇంతదానికి భార్య ఉండక్కర్లేదు ఏ పనిమనిషిని పెట్టుకున్న సరిపోతుంది.

ఇప్పుడు మనిద్దరం మీకు నేను,నాకు మీరు అన్నట్టుగా ఉండాలి కదా! ఇన్ని రోజులు యాంత్రికంగా గడిపాను. ఇప్పుడు మీరే లోకం అన్నట్టుగా ఉంటున్నాను. నేనేమి మీరు తీర్చలేని గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కాసేపు సరదాగా మాట్లాడమని అంటున్నాను. అది కూడ మీకు వీలు కాదు అంటే, మొన్ననే పక్కింటి పిన్ని గారిని  ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. కాసేపు ఆవిడతో మాట్లాడి నా ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నాను” అన్నది.

“లక్ష్మి  నీ మనసులో ఇంత బాధ పడుతున్నావ్ అని నేను కొంచమైన ఊహించలేదు” అన్నాను.

“అవును మీరే తెలుసుకుంటారని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇక లాభం లేదని నా వ్యాపకాలు నేను చూసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను”.

“సారీ లక్ష్మి, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంటే, నేను నీ గురించి అస్సలు ఆలోచించలేదు. నేనె కాదు చాల మంది నాలాగే ఉంటారు. నీకు నాతో సరదాగ గడపాలని, నాతో కలసి బయట కెళ్ళాలని ఉంటుందన్న ఆలోచన కూడ నాకు రాలేదు.నీ కోరికలు తీర్చలేనివి కావు. రేపటి నుండి నిన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా కళ్ళు తెరుచుకున్నాయి ప్లీజ్ నీ మౌనవ్రతం మానేసేయి నీవు ముందులాగ ఉండు ప్లీజ్”అన్నాను.

“మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.మీ మనసును కష్టపెట్టాలనీ కాదు. కాలం చాల విలువైనది.ఇన్ని రోజులు బాధ్యతలతో అన్ని సరదాలకు దూరంగ ఉన్నాను. ఇప్పుడైన దానిని సాధ్యమైనంత వరకు సరదాలతో సంతోషాలతో మీతో కలిసి గడపాలని నా ఆశ” అన్నది నా జీవిత లక్ష్మీ.
ఇప్పటి వరకు నాకై, పిల్లలకై తాపత్రయపడుతు
గడిపిన లక్ష్మీ సంతోషం కొరకు ఏమి చేస్తే బాగుంటుదని ఆలోచిస్తూ తేలికైన మనస్సుతో హాయిగా నిద్రించాను.

You May Also Like

One thought on “అల్పమైన కోరికలు

  1. కథ నాకు నచ్చింది అండీ..భార్యకూ మనసుంటుంది, ఆమెకూ కోరికలు ఉంటాయని గుర్తించని భర్తకు బుద్ధి చెప్పిన విధానం బాగుంది అండీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!