వందనోటు

వందనోటు

రచయిత :: గుడిపూడి రాధికారాణి

దొరక్కపోతే ఏ గోలా లేదు.దొరికితే ఇన్ని కష్టాలా! వామ్మో అనుకున్నాడు నాగూర్.
ప్రతిరోజూ పొద్దున్నే అమ్మ పాలపాకెట్లు తెమ్మని పంపుతుంది.
అమ్మ సుప్రభాతాన్ని ముసుగులోంచి వినీవినడంతోనే కొండలలో నెలకొన్న కోనేటిరాయడిలా చల్లగా నవ్వుతూ ఉషారుగా పక్క దిగేస్తాడు పదేళ్ళ నాగూర్.బద్దకమనే మాటే ఎరుగడు.
తాగుబోతు మొగుడు,తను పనికెళ్తేగాని పస్తు లేని పూట గడవని పేదరికం..ఇవి కలిగించే దిగులుని కొడుకు కళకళలాడే ముఖం మరిపించేస్తుంది.
చెప్పిన పని చేస్తాడు.పెట్టింది తింటాడు.ఇచ్చిన బట్ట కట్టుకుంటాడు.స్కూల్లో ఫస్టుమార్కు,ఇంట్లో ఉన్నంతసేపు తలలో నాలుకలా వెనకెనకే తిరుగుతూ నోరు తెరచి అడగక్కర్లేకుండానే సాయం చేస్తాడు.
పంచప్రాణాలూ పిల్లాడి మీద పెట్టుకుని బతుకుతోంది లలిత.
ఏ కూరానారా సరుకూ జప్పరా తేవాలన్నా వాడే ఆధారం.తూనీగలా ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తాడు.తన దిష్టే తగులుతుందేమో.రేపాదివారం ఉప్పు దిగదుడిచి పడెయ్యాలి అనుకుంది.
పాపం..వాడికో రూపాయో అర్ధో ఏమన్నా కొనుక్కోమని చేతిలో పెడదామన్నా కుదరదాయె.ప్రతి రూపాయి నెత్తుటి బొట్టంత విలువగా చూసుకోవాల్సి వస్తోంది.
నిట్టూర్చింది లలిత.
నాగూర్ పాలు కొంటుంటే వాసుగాడొచ్చాడు.
కిలో బంగాళదుంపలు,ఉల్లిపాయలు కొన్నాడు. తక్కెడలో తూచాక రెండు చిన్న దుంపలు,ఉల్లిగడ్డలు తిరిగిచ్చేసి దానిబదులు సెంటర్ ఫ్రెష్ బబుల్ గమ్,చాక్లెట్ తీసుకున్నాడు.
చూశావా నా తెలివి! అన్నట్టు నాగూర్ ని చూసి భుజాలెగరేసి పళ్ళికిలించి పోయాడు.
ఆశ్చర్యపోయాడు నాగూర్.
చిన్నపిల్లాడు కనుక వాడికీ నోరూరింది. కానీ బుద్దిమంతుడు, తల్లి కష్టం తెలిసినవాడూ కావడంతో తప్పనుకుని ఊరుకున్నాడు.
తిరిగొచ్చేస్తుంటే..సందు మలుపు తిరుగుతుంటే ..అదిగో అక్కడ రోడ్డుపై దొరికింది వందరూపాయల నోటు.
రోడ్డుమీద ఎవరూ లేరు. అంతకుముందు వెళ్ళినవారి జేబులోంచి జారిపడుండొచ్చు.
కనుచూపుమేరలో ఎవరూ లేకపోవడంతో అయిదునిమిషాలు అక్కడే నుంచున్నా ఎవరూ రాకపోవడంతో ఆ వందనోటు జేబులో ఉంచుకుని ఇంటికి బయలుదేరాడు .
అదిగో.అప్పటినుండీ మొదలయ్యాయి వాడికీ కష్టాలు.
దొరికిన వందనోటు జేబులో ఉంది.కోర్కెల చిట్టా మనసులో ఉంది.
పుట్టనుండి చీమలు బయటికొచ్చినట్లు అణిచిపెట్టుకున్న వాడి ఆశలన్నీ రెక్కలు విప్పుకోసాగాయి.
రంగారావు హోటల్లో ఉల్లిపాయ పెసరట్టు, పూరీ కూరా రోడ్డుమీదకే ఘుమఘుమలాడుతూ భలేవాసన.అమ్మ,నేను వెళ్ళి దర్జాగా కూర్చుని తింటే..
అప్సర పాతబండి బాదంపాలలో బాదంపప్పులు నూరిన ముద్ద కలిపి పైన ఐస్ క్రీమేసి ఇస్తాడు.అంతా తాగుతుంటే ఎంత నోరూరుతుందో!
కానీ ఒక్క దెబ్బకే వందనోటుకి రెక్కలు రావొచ్చు.
పోనీ కొన్ని రోజులపాటు రోజూ బళ్ళో పుల్ల ఐస్ కొనుక్కుంటేనో..వద్దొద్దులే.
అమ్మని తీసుకుని మహేష్ బాబు సినిమాకెళ్తే ..
పోనీ తోపుడు బండాపి ఒక గళ్ళ చొక్కా కొనుక్కుంటే..గోపిగాడి చొక్కాలా మెరిసేది?
ఎంతకీ తెగని ఆలోచనలతో సతమతమౌతున్నాడు నాగూర్.
తువ్వాయిలా గంతులు వేసే కొడుకు పరధ్యానంగా ఉండడం చూసి జ్వరమేమోనని గాభరా పడింది లలిత.
వచ్చి నుదురు తాకి చూసి స్థిమితపడి వెళ్ళి పొయ్యి లో కట్టెపుల్లలతో కుస్తీ పడుతోంది.
ఫైవ్ స్టార్ చాక్లెట్లు,కూల్ డ్రింక్ బాటిల్, పీచుమిఠాయి..నాగూర్ ఆలోచనల కుస్తీ సాగుతోంది.
పొయ్యిలో మంట ముందొచ్చే పొగలా వాడి లేతబుర్రని కమ్మేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అందులోనూ ఆదివారం కావడంతో ఖాళీగా ఉన్నాడాయె.ఇక ఇదే యావ.వందనోటు తెచ్చే వంద ఆలోచనలతో సతమతమౌతున్నాడు.
అమ్మనే సలహా అడుగుదామనుకున్నాడు.
పొయ్యి దగ్గర అవస్థ పడుతున్న అమ్మ దగ్గరకెళ్ళాడు. పుల్లెగదోసి
తాటాకుల విసనకర్రతో విసురుతూ పొగతో కుస్తీ పడుతోంది అమ్మ.
ఉలిక్కిపడ్డాడు నాగూర్.
అమ్మ చీర చెంగుకి చిరుగులు.
మోకాలి దగ్గర చిరిగితే కుట్టిన అతుకు.
వాడి గుండె ఐస్ క్రీములా కరిగిపోయింది.
సరైన చీర లేకుండా మొన్న పుట్టిన రోజుకి నాకు కొత్తచొక్కా కొందా అమ్మ.
వాడి ప్రేమ పీచుమిఠాయిలా చేటంతయింది.నలిపితే అంత పీచుమిఠాయీ ఉసిరికాయంత అయినట్లు తల్లి దుస్థితికి వాడి మొహం చిన్నబోయింది.
ఇంతలోనే మెరుపులా వచ్చిన ఆలోచనతో వాడి నల్లని మొహం నల్లమబ్బు మెరిసినట్లు మెరిసింది.
అవునూ! ఈ వందనోటుతో అమ్మకి చీర కొంటే ఎంత బాగుంటుందీ!
ఆ ఊహ పూరీకూరా, నేతి పెసరట్,బాదంపాలని ఊరుకోబెట్టేసింది.
మతాబులో వెలిగే మొహంతో ” అమ్మా!” అంటున్న కొడుకుని చూసి నల్లమబ్బు వానకురిసి తేటబడినట్లు మురుసుకుంది లలిత.
” చిట్టితండ్రీ! ఆకలేస్తోందా? అన్నం ఉడుకుపడుతోంది.ఒక్క పదినిమిషాలు అంది.పచ్చడి నూరేందుకు రోటికేసి కదులుతూ.
” అబ్బా! అది కాదమ్మా! విను. మరేమో నాకు రోడ్డుమీద ఈ వందనోటు దొరికింది.దీనితో నువ్వు చీర కొనుక్కో .నేనే కొనుక్కొచ్చి అప్పుడు చెప్దామనుకున్నా.కానీ నీకు నచ్చిన రంగు కొనుక్కుంటావని.” చెబుతూ తిడుతుందేమోనని ఆగి తల్లి కేసి చూశాడు వాడు.
లలిత కళ్ళలో నీళ్ళు నిండి బిడ్డ మసకగా కనిపించసాగాడు.
పాపం వాడి వయసెంతని.
వాడికీ అందరిలా చిరుతిళ్ళు కొనుక్కోవాలని,జయింట్ వీలెక్కాలని,సినిమాకెళ్ళాలని రకరకాల ఊహలుండవూ!
కొడుకు చాపిన చేతిలో వందనోటు బదులుగా వాడికి తనపైన ఉన్న ప్రేమ కనబడుతోంది లలితకి.
” చీర ఎందుకులే గాని,కందిపప్పు, చింతపండు,పంచదార కొందాం రా పోనీ” అంది.
ఇందాకటి కొడుకు యాతన ఆమెకి మొదలైంది.
ఈ వందనోటుతో ఏమేం కొనొచ్చు.తక్కువ డబ్బుతో ఎక్కువగా వచ్చే ఆకలి తీరే సరుకులేం తీసుకోవచ్చు.ఆలోచిస్తోంది.
ఇంతలో పిల్లాడి చేతిలోని వందనోటు తండ్రి మొరటు చెయ్యి లాగేసింది.ఎప్పుడు నిద్ర లేచొచ్చాడో .వందనోటు చూసీ చూడగానే లాగేశాడు.
నేనేం చెయ్యలేనంటూ వందనోటు తల్లీకొడుకులకి టాటా చెప్పి సారాకొట్టుకెళ్ళిపోయింది.
“నాన్న తన జీతమంతా తాగేసొచ్చి నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కాస్త డబ్బు గద్దలా తన్నుకుపోతున్నారురా.”అని ఏడ్చేది రోజూ.
ఇప్పుడు తెల్లబోయిన కొడుకు మొహం చూసి ఏ రాక్షసుడో వచ్చి మొహంలో నెత్తురంతా పీల్చేసినట్లు పాలిపోయింది.
“నువ్వు మాత్రం ఈ దిక్కుమాలిన అలవాటు చేసుకోనని మాటివ్వు” అంటూ కొడుకుతో ఒట్టేయించుకుంది.
అంతకంటే ఆ పిచ్చితల్లి చెయ్యగలిగింది మాత్రమేముంది కనుక.

You May Also Like

One thought on “వందనోటు

  1. మంచి కథ, సారా వ్యసనం వల్ల కలిగే కష్టాలు, చిన్నపిల్లాడి మనసు పడే వేదన కళ్లకు కట్టినట్టు రాసారు 👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!