ఆడంబరం -అనుబంధం

ఆడంబరం -అనుబంధం
                          (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)           

రచన – ఎం .వి .ఉమాదేవి

       గేటెడ్ కమ్యూనిటీలో వసతులు బాగాఉన్నా ఏదో అభద్రతగా ఉంది వసంతకి. ఇదివరకు మామూలు ఇంట్లోఅద్దెకున్నా ఆరుబయలు రంగస్థలంలాగా  ఇరుగుపొరుగుతో నిత్యసంభాషణ, వాకిట్లో మల్లెల మందారాల అందాలు, వీధిలో సందడి, స్వచ్ఛమైనగాలీ వెలుగులు ! ఇప్పుడు అపరిచితులభయంతో అస్తమాను తలుపులు బిగించుకొని, సూర్యరశ్మిఅనేది లేకుండా లైట్లు, ఫ్యాన్లు, కరెంటుబిల్లులు తడిసిమోపెడు ! కానీ భాస్కర్ ఆఫీస్కి దగ్గరగా ఉందని ఇదే ఎన్నుకున్నాడు. ట్రాఫిక్ జామ్ లో ఆఫీస్ వర్క్ పెండింగ్ అయి బాస్ తో చివాట్లు లేకుండా ఇప్పుడు హాయిగా ఉందతనికి. పిల్లలకి కూడ బడిదగ్గరలోనే ఉంది. వచ్చినరోజే ఎదురు పోర్షన్ ఆమె పలకరించేసింది. ఆమె పేరు శైలజ. వాళ్ళ స్థాయి తమ కంటేతక్కువే అని వసంత గమనించింది. శైలజ భర్త ప్రయివేట్ కంపెనీలో చిరుద్యోగి.
గోదావరి జిల్లా వాళ్ళు. ఇద్దరు అమ్మాయిలు. కాలేజీలో చదువుతున్నారు. ఎడమవైపు వాటా ఖాళీగా ఉంది. కుడివైపు దానిలో సంపన్నులే ఆ అపార్ట్మెంట్ నలభైలక్షలు పెట్టి కొనుక్కున్నారని తెలిసింది. ఆ ఇంట్లో కూడ భార్యాభర్త ముగ్గురు పిల్లలు.ఆమె పేరు రాగిణి,మాట్లాడుతున్న ప్రతి విషయంలో అతిశయం ఉంటుంది.వాళ్ళది సొంత బిజినెస్ అనీ.. సిటీలో ఇంకా రెండు ప్లాట్లు,షాపులు ఉన్నాయని చెప్పింది ఆమె.వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడ ఆవూరే అనీ చెప్పింది. ఇంట్లో అన్నీ ఖరీదైన వస్తువులు అలంకరణ, రాగిణి వొంటిమీద
ఎప్పుడూ పదితులాల బంగారం. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మాటకలిపి వస్తుంది వసంత. శైలజ సామాన్యమైన బట్టలు, పరిస్థితి ఆసక్తి కలిగించలేదు వసంతకి ! రాగిణి వాళ్ళ స్థాయికి తాము ఎప్పుడు చేరుకుంటామో అని ఆలోచిస్తూ ఉంటుంది ! అనుకోకుండా ఒకరోజు వసంత కొడుకు ఆదివారం పొద్దున్నే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే తలకు బాల్ తగిలి పెద్దగాయం. భాస్కర్ రెండ్రోజులక్రితమే ఆఫీస్ టూర్లో వేరే సిటీ వెళ్ళాడు. తోటిపిల్లలు వచ్చిచెప్పి వసంతను పిలిచారు. కాలూ చెయ్యి ఆడని వసంత భోరుమంటూ శైలజని పిలిచి విషయం చెప్పగానే. పదండి నేనువస్తాను అని వేగంగా ఆటోలో దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకొని వెళ్లి కుట్లు వేయించి అడ్మిట్ చేయించింది. శైలజ. వసంత కూతురు బిక్కమొహం తో తల్లి పక్కన ఉంది. పాపకి పదేళ్లు. “మీరు జాగ్రత్తగా ఉండండి. నేను కారియర్ పంపుతాను. “అంటూ బయట టీ కొట్టులో వేడిపాలు, బ్రెడ్ తెచ్చి బాబుకి
ఇచ్చి వెళ్ళింది శైలజ. రక్తం బాగా పోయింది రెండ్రోజులు హాస్పిటల్ లో నే ఉండాలి అన్నారు డాక్టర్. భాస్కర్ కి ఫోన్ చేసినా కలవడం లేదు.
ఇరువైపులా పెద్దవాళ్ళు దూరంగా పల్లెటూరులో ఉన్నారు. పిలిస్తే వస్తారు కానీ, అసలే బీపీ షుగర్ లూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వసంతకి ఇష్టం లేదు. శైలజ రెండు రోజులూ తోడుగా ఉంటూ వాళ్ళ పిల్లలు సాయంతో గోదావరి వంటలు కమ్మగా చేసి
కారియర్ పంపడం, వసంతను పాపను దిగులు పడకుండా చూసింది. రాగిణి వచ్చి బాబుని చూసి వెళ్తాదేమో అనుకుంటే అసలు రాలేదు. కాల్ చేసి విషయం చెప్పినా అలాగా అంటూ పొడి పొడి గా మాటలు ! దిమ్మతిరిగిపోయింది. వసంతకి ఆరు నెలల స్నేహం.. ఇంతేనా అనుకుంటే.. మనసు చేదుతిన్నట్టే ఉంది. డిశ్చార్జ్ అయే రోజుకి భాస్కర్ వచ్చేసాడు. రాగానే శైలజ దంపతులకి కృతజ్ఞతలు చెప్పి బాబుని ఇంట్లో దింపి హడావిడి గా ఆఫీస్ కి వెళ్ళాడు. నాలుగు రోజులు సెలవు అడుగుతానంటూ. ఇంటికి వచ్చిన నాలుగురోజుల తర్వాత రాగిణి వచ్చి బాబుని పరామర్శించి వెళ్ళింది. ఆకొద్ది సమయంలో కూడా వాళ్ళ అన్న వాళ్ళ గృహప్రవేశం ఎంత వైభవంగా జరిగింది చెప్పుకుంటూ. తనకి నాలుగు తులాల కొత్త గొలుసు బహుమానంగా ఇచ్చారని చెప్పి వెళ్ళింది రాగిణి. ఎంత చెట్టుకు అంత గాలి లెండి అనేసింది వసంత నవ్వుతూ. మెల్లగా మనసులో పొరలు తొలిగిపోతున్నవి వసంతకి. మనిషి బాహ్యరూపం స్థోమత చూసి అంచనా వేయడం ఎంత తప్పు!కష్టపడి పైకొచ్చిన వాళ్ళకే జీవితం విలువలు తెలుస్తాయి.పై పై మెరుగులు చూసి ఆకర్షణ పెంచుకొని చివరికి భంగపాటుకు గురికావడం ఎందుకూ ఆలోచించు, అంటున్నది వసంత మనసు ఆమెతో !!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!