ఆకాశానికి నిచ్చెనేస్తా

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఆకాశానికి నిచ్చెనేస్తా

రచయిత :: పాండురంగాచారి వడ్ల

నీలాకాశమంతా నీ కళ్ళల్లో నింపుకుని,
చీకటి నలుపంతా నీ కురులలో దాచుకుని,
సంధ్యా సమయంలో సూర్యుడి ఎరుపును నీ నుదుటిన సింధూరంలా పెట్టేసి,
అర్థం కాని నిశ్శబ్దం నీ పెదవులపై చిరునవ్వు,
తామరాకు మీద నీటి చుక్కలా నీ నడుము పైన చమట చుక్కలతో నన్ను ఊరిస్తూ,
అందీ అందని అందాలతో నన్ను మరిపిస్తున్న నీ కోసం..

ఆ ఆకాశానికి నిచ్చెనేసి,
చుక్కలన్నీ తెంపి నీపై ముత్యాల వాన కురిపించాలనీ,
ఆ నెలవంకను నీ ముక్కుకి వంకీగా మార్చేయాలని,
గ్రహాల చుట్టూ ఉన్న రింగులన్నీ పట్టుకొని వచ్చి నీ చేతికి గాజులుగా తొడగాలనీ,
అంతరిక్షంలో ఉన్న మెటరోయిడ్స్ ని కరిగించి పోత పోసి నీ కాలికి పట్టీలు చేసి పెట్టేయాలని,
ఓ అయిదారు తోక చుక్కలని కలిపేసి నీ నడుముకి వడ్డాణంగా చుట్టేయాలని,
ఇలా ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆశలు..
ఎలాగోలా నిన్ను  మెప్పించాలని..
కానీ
ఒక చల్లని చిరునవ్వు,
గుండెలను తాకే ఒక మాట,
ప్రేమను వ్యక్తపరిచే ఒక చిన్న స్పర్శ,
మౌనంలోని బాసలను కూడా అర్థం చేసుకోగలిగే మెత్తని చూపులు..
ఇవి ఇవ్వగలిగితే చాలు నీ ప్రేమ నా సొంతం అని,
నీ మనసు నా మనసుతో ముడిపడే వరకు నాకు తెలీనేలేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!