అమరప్రేమ

అమరప్రేమ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్(సుబ్బలక్ష్మి రాచకొండ)

ప్రియమైన (అచ్చంగా నా సొంతమైన) నీకు..
నిన్ను విడిచి నెల రోజులైంది. నా ఆలోచనలో అనుక్షణం నువ్వే.
నిను నా దానిగా చేసుకోవడానికి నేను పడ్డ శ్రమ ఒకరికి చెప్పుకొనేది కాదు. నీకు నాకు ఉన్న అనుబంధం వేరేవాళ్ళకి అర్థం కాదు.
నిన్ను ఏరీ కోరి నాదాన్ని చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. ఆ తర్వాత నిన్ను చూసి నా ఎదుగుదల అంచనా వేసేవారు. నువ్వు నన్ను సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టేవు. నీ సాన్నిధ్యంలో నేను తీరిన సేద నాకు ఇంకెక్కడ దొరక లేదు. నీలో అన్నీ నాకు మధురమైన జ్ఞాపకాలే.
నా సమక్షంలో ఉన్నంతసేపు నీ హొయలు, నీ అందం, దేదీప్యమానంగా వెలిగిపోతూ నికార్సయిన పట్టు చీర కట్టుకున్న దేవకన్యలాగా కనిపిస్తావు.
నీ ముసుగులో నా దుఃఖాన్ని, నా ఆకలిని, నా వ్యధలను అన్నీ బయట వాళ్ళకు తెలియకుండా బ్రతికేసాను.
నీ కోసం నేను చేసిన రుణం ఎప్పుడో తీరిపోయింది. నువ్వు ఇచ్చిన ఊరట, ఆసరాకి బదులుగా నేను నీకు ఏమి తిరిగి ఇవ్వగలను.
నా భార్య ఉన్నంతవరకు నీ తోడు నాకు చాలా తృప్తినిచ్చింది. నా భార్య పోవడంతోనే నీ నుండి నన్ను మా వాళ్ళు దూరం చేసేసారు. నేను ఎన్నిసార్లు చెప్పినా…… నీ దగ్గరుంటే నాకు తృప్తిగా ఉంటుంది…… అంటే వాళ్ళు దాన్ని కాంక్రీట్ ప్రేమ కింద చిత్రీకరిస్తున్నారు.
నీకు అర్థం కాని విషయం ఒకటే….. నేను నీ దగ్గర ఉన్నంత వరకే నీకు ఒక రూపం. నేను ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళిపోతే…. నువ్వు వేరేవాళ్లకు అమ్ముడై పోతావు, లేదా భూస్థాపితమైపోయి, ముక్కలై పోతావు అన్న విషయం నన్ను కలిచివేస్తోంది.
నీ ఇటుక ఇటుకలో నా స్వేద బిందువు ఇమిడి ఉంది. నీ మూల మూలన నా జ్ఞాపకం నిక్షిప్తం చేసిన నా స్వగృహమా నిన్ను విడిచి ఉండలేక నే రాసుకొనే ప్రేమలేఖ ఇది.

ఇట్లు
నీ
ఆరాధకుడు

You May Also Like

One thought on “అమరప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!