నాన్న
రచన: పద్మజ రామకృష్ణ.పి
ఎండాకాలం. అందరి మంచాలూ ఆరుబయటకు వచ్చాయి. ఆకాశంలో దీర్ఘంగా చూస్తోంది శ్రావణి. రెండు కొబ్బరి చెట్లమధ్య నుండి ఒక తెల్లని ఆకారం పైకెళుతూ కనిపించి ఉలిక్కిపడి పైకి లేచింది. పెద్దగా ఏడుస్తూ వణికిపోతుంది శ్రావణి. పక్కన మంచాలమీద పడుకున్న కమల, లత ఇద్దరూ శ్రావణి ఏడుపుతో లేచారు. ‘శ్రావణీ శ్రావణీ’! అని పిలవడంతో.”అక్కా! ఎవరో… పైకి వెళ్లిపోతున్నారూ. సాయంత్రం హాస్పటల్ లో జాయిన్ చేసిన నాన్నకు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది” అంటూ కమలను, లతను పట్టుకొని ఏడ్చింది శ్రావణి. “మీ నాన్నకు ఏమీ కాదు శ్రావణి ఎక్కువ ఆలోచించకు, హుషారుగా ఇంటికి తిరిగి వస్తారు, పడుకో శ్రావణి.”అసలు నేను నిద్ర పోలేదక్కా మెలుకువగానే ఉన్నాను, ఆ ఆకారం నాకెందుకలా కనిపించిందో. రాత్రంతా శ్రావణికి నిద్ర పోకుండానే రకరకాల ఆలోచనలతో తెల్లారింది ఉదయాన్నే తండ్రి బట్టలు ఉతికి ఆరవేస్తోంది శ్రావణి. ఒక్కొక్కరుగా బంధువులు వస్తున్నారు శ్రావణి వాళ్ళ ఇంటికి. శ్రావణికి పద్నాలుగేళ్ళు. చిన్నపిల్ల కావడంతో తొందర పడి, బాధ పడే విషయం చెప్పకూడదని అనుకున్నారు బంధువులు.
ఇంటి ముందు రిక్షా ఆగింది. శ్రావణిబావ తండ్రిని భుజంపై వేసుకుని తీసుకురావడం చూసింది.
తండ్రి నడవలేకపోవడం వలన అలా తెస్తున్నారనుకుని. గబగబా మంచం వాల్చి, దుప్పటి పరచింది. వెనక మరో రిక్షాలో హాస్పటల్ నుండి శ్రావణి తల్లి దిగింది. తల్లిలో ఎలాంటి చలనం లేదు. ఒకలాంటి షాక్ లో ఉంది.”బాబూ, మంచం మీద పడుకోబెట్టకూడదు శవం బిగిసి పోతే కష్టం కదా తరువాత వంగదు, కూర్చోబెట్టే ఆచారం మాది.” అన్నారు శ్రావణి వాళ్ళ దాయాదులు. తండ్రి కోసం మంచం వేసి, తండ్రి బట్టలు ఆరవేస్తోంది శ్రావణి. తండ్రిని శవం అన్నా ఆ ఒక్కమాట చెవిలో పడగానే బోరున తండ్రి గుండెలపై వాలిపోయి, నాన్నా, నాన్నా అంటూ, అపురూపంగా గుండెలపై ఆడించి పెంచిన తన తండ్రి హృదయాన్ని కన్నీటితో తడిపేసింది శ్రావణి. శ్రావణికి తండ్రి చనిపోయాడని అర్థం అయ్యాక బంధువులు చెప్పుకోసాగారు.”నిండా యాభై ఏళ్ళు కూడా లేవు పాపం, నిన్న మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడంటా. ఎలాంటి అనారోగ్యం లేదు, వడ దెబ్బ అని చెప్పారట డాక్టర్లు.”మగదిక్కు లేకుండా ఆడపిల్లను పెట్టుకుని ఎలా ఉంటుందో ఈ తల్లి” అని అందరూ మాట్లాడుకుంటున్నారు.కార్యక్రమాలు అన్నీ ముగిసాయి. శ్రావణి తల్లి ఎన్నో కష్టాలు పడి కూలి పనులు చేసి బిడ్డను బాగా చదివించింది. కష్టం విలువ అంటే ఏంటో తెలిసిన శ్రావణి చక్కగా చదువుకుని ప్రయోజకురాలై బంధువులు అందరిలో గొప్పగా నిలిచి. నలుగురికీ ఉపాధి కల్పించేలా, ఎవరూ ఊహించని విధంగా అందనంత ఎత్తు ఎదిగింది. శ్రావణి ఎంత ఎత్తు ఎదిగినా తండ్రిని తలవని రోజంటూ లేదు. తండ్రి వెళ్లిపోతూ తనకి కనిపించిన ఆ తెల్లని ఆకారం గుర్తు వస్తే మనసు బాధతో నిండి కంట కన్నీరుగా మారుతూనే ఉంటుంది.