అంతిమ విజయమెపుడూ అలుపెరగని పోరాటానిదే

అంతిమ విజయమెపుడూ అలుపెరగని పోరాటానిదే

రచన: నామని సుజనాదేవి

నీకు తెలుసా ……..
నీ ప్రాణాలు నిలపడానికి వారి ప్రాణాలు ఫణంగా పెట్టె
భువి పైని దేవుళ్ళు తెల్లకోటేసుకుని ఉంటారని
నిన్ననుక్షణం కాపాడడానికి ప్రాణాలొడ్డి
పోరాడే నైటింగెల్లె దేవదూతలుగాఉంటారని
నువ్వొదిలిన మలినం పరిమళం చేసే
సైనికులు కోడికూతకు ముందేకవాతుచేస్తారని
నీ కూపిర్నివ్వడానికి కార్పోరేట్ కంపనీలు
సైతం సాయం ఖాతా తెరుస్తున్నాయని
నీవంటే తెలియని లెక్కలేనన్ని చేతులు
దాచుకున్న అవసరాల మూటలనిస్తున్నాయని
నీకోసం తెలియనిబంధాలన్నీ ఊపిరిబిగబట్టి
తమకు తామే సంకెళ్ళేసుకుంటున్నాయని

ఎప్పుడైనా ఆలోచించావా…..
కంటికి కనిపించని కరోనాతో
యుద్ధం చేస్తున్నప్పుడైనా ఆలోచించావా
నువ్వు నేనను భేదం లేని వీరంతా
ప్రతిఫలమాశించని పరోపకార ప్రతీకలని
ఉపకారం పరోపకారం చేయని జన్మ
నిరర్ధకమని ఎప్పుడైనా ఆలోచించావా ……

ఇప్పుడైనా ఆలోచించు …నీ ఆత్మలోకెల్లి
నీలో నువ్వు విశ్వ దర్శనం చేసుకో
ఇన్నిరోజులు మరిచిన నీ సంస్కారాల్ని సంస్కరించుకో
గతంలోని అంకురమై మళ్ళీ మొలకెత్తు…
పరోపకారంతో ప్రాయాశ్చిత్తం చేసుకో
అంతిమ విజయమెప్పుడూ
అలుపులేని పోరాటానిదేనని తెలుసుకో .

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!