అనుమానం

అంశం:కొసమెరుపు కథలు

అనుమానం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

      రాజు, రమ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు.బీటెక్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత పనులు చేసే ఏజెన్సీ కనుక, ఉద్యోగస్తులకు ఎప్పటికి ఒకే విధమైన పనులు వుండవు. వారి అవసరాల మేరకు ఉద్యోగస్తులకు పనులు అప్పగిస్తారు. ఆ కంపెనీ యజమాని రాష్ట్ర మంత్రికి బంధువు కనుక కొన్ని సార్లు వీళ్ళ కోసం కూడా ఏవేవో సర్వేలు, ప్రాజెక్ట్ పరిశీలనలకు సంబంధించి టెండర్లు పిలిచి, వీటిని వీళ్లకు, లేక బినామీలకు పనులు అప్పగించే వారు. భయ పడుతూ, అణిగి మణిగి ఉద్యోగం చేయవలసి వుంటుంది. వయసు మీరి పోతుంటే, పెళ్లి అయినా ఉద్యోగం రాకుంటే, రాజు తండ్రి తెలిసిన బంధువులతో రేకమెండేషన్ చేయించి ఇద్దరికి ఈ ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడున్న పరిస్థితిలో గుడ్డి కన్నా మెల్ల నయమని భావించి రాజు, రమ ఉద్యోగం చేస్తున్నారు. రమ ఎప్పటిలా భర్తతో కలిసి వచ్చినా, ఆఫీస్ వేళల్లో భర్తను కలవకుండా పని చేయడం ఇష్టపడుచున్నది. ఒక్కోసారి తనతో పాటు పని ముగించకుండా, కొంచెం ఆగండి అని చెప్పడంతో, లాబీలో కూర్చుంటున్నాడు రాజు. చూస్తే పని చేసినట్లు అనిపించడం లేదు. వెళ్ళిపోతే ఒక్కతే రావాలంటే డబ్బు, సమయం వృధా అవుతాయని నిరీక్షించసాగాడు. భర్తకు వెళ్ళమని చెప్పలేక, తాను అతినితో వెళ్లలేక, త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది రమ. తోటి ఉద్యోగస్తులందరు వెళ్ళిపోతే, భార్య కోసం ఒక్కడే కూర్చోవడం, ఆమె పనిలో బిజీగా లేనట్లు పసిగట్టడం, ఒంటరిగా కూర్చున్నప్పుడు, మనస్సులో పలు సందేహాలకు కారణమవుతున్నది.
రోజు రోజుకు రాజులో అసహనం ఎక్కువ అవుతున్నది. ఇంటికొచ్చినా మోమాటంగా వుండడం, అగ్నికి ఆజ్యం పోసినట్లు, రమ్యపై లేనిపోని అనుమానాలు రేకెత్తించసాగాయి. అనుమానపు చూపులను, మాటలను పసిగట్టిన రమ్య ఏమౌతుందోనని ఆందోళన చెందడం వలన, ముడుచుకొని పోసాగింది. ఇది రాజులో ఇంకా విషపు బీజాలు నాటినట్లు చేయ సాగింది. చివరికి ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని, తూర్పు పడమరాలైనాయి వారి బతుకులు. ఒక రోజు రమ్యను వదిలి ఒక్కడే ఇంటికి పోయాడు. బండిపై పోతున్నాడు గాని మనస్సులో మనస్సు లేదు. అనుమానపు పాము బుసలు కొట్టింది. అనుమానం పెనుభూతమై, శంకిస్తున్న రాజును పూర్తిగా కమ్మేసింది. ఇందులో ఏదో వున్నది. ఎన్నడూ లేనిది ఇప్పుడు నన్ను దూరంగా వుంచడంలో ఏదో దాగుందని, మనస్సులో రూఢి చేసుకొని, ఇంటి దగ్గర కొచ్చినా, బండి వెనిక్కి తిప్పి, ఈ రోజు తాడో పేడో తేల్చుకోవాలని రాజు ఆఫీసుకు బయలు దేరాడు. తాను అనుమానించి నట్లే రమ మేనేజర్ గదిలో వున్నది. అతడు అటు ఇటు తిరుగుతున్నాడు. అద్దంలో నుంచి దూరంగా నిలబడి గమనిస్తున్నాడు. ఇద్దరు మాట్లాడు తున్నారు. కొంచెం పక్కకు పోయి నిలబడ్డాడు రాజు. గుండె తీవ్రంగా కొట్టుకుంటున్నది. భార్య మీద పట్టరాని కోపం, ద్వేషం కలుగ సాగింది. అప్పుడే మేనేజర్ గదిలో లైట్లన్నీ ఆరి పోయినవి. ఐదు నిమిషాలు చూసి క్రోధంతో వనికిపోతూ భార్యకు ఫోన్ చేశాడు. మూడు సార్లు చేసినా కట్ అవుతిన్నది. నాల్గవసారి ఫోన్ చేస్తే మాట్లాడాలని ప్రయత్నిచి, ఫోన్ తీసుకున్నది. రాజు హలో అంటే ఊ అని మాత్రమే వినబడింది. రాజు హలో హలో హలో అన్నా ఫోనులో ఎలాంటి మాటలు రావడం లేదు. రాజుకు ఏమి చేయాలో తోచడం లేదు. రమ ఫోన్ ఎత్తగానే మేనేజర్ ఆమె దగ్గరకొచ్చాడు. విసురుగా ఆమె చేయి పట్టుకుంటే ఫోన్ జారి కింద పడింది.ఆర్నెల్ల నుండి వేధిస్తునాడు మేనేజర్.
మరునాడు ఉదయం రాజు, రమ కలిసి ఆఫీసుకు వచ్చారు. అప్పటికే కంపెనీ డైరెక్టర్లు వచ్చి సీరియస్గా మాట్లాడు కుంటున్నారు. అప్పుడే రాజు, రమలను సమావేశ మందిరానికి రమ్మంటున్నారని, పిలుపు రావడంతో, ఇద్దరు వెళ్లారు. నిన్న నీవు పంపిన మెయిలకు, ఆధారమేమున్నదని మేనేజర్ అడిగినాడు. అప్పుడు తాను చేసిన ఫోన్ రికార్డింగును అందరిముందు వినిపించాడు.
రాజు హలో హలో అన్నా కొన్ని క్షణాలు సమాధానం లేదు.15 సెకండ్ల తరువాత, రమా! ఆర్నెల్ల నుంచి చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఈ రోజు నాకు లొంగకుంటే నిన్ను, రాజును డిస్మిస్ చేయగలను. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. రా రా రా!
సార్! నీ కాళ్ళు పట్టుకుంటా! ఇప్పటికే ఇంట్లో, ఆఫీసులో నరకం అనుభవిస్తున్నా! నా ప్రాణం పోయినా నీకు లొంగను. నా భర్తకు మోసం చేయలేను. మా మామ గారి పరువు తీయలేను.
నీ పరువు ఎవరికి కావాలి.నేనే బాసుని. నా మాటకు తిరుగు లేదు. రేపు ఉదయానికి ఇద్దరిని డిస్మిస్ చేస్తా! ఇలా పది నిమిషాలు ఇద్దరి మధ్య మాటలు, అరుపులు, రోదనలు, వేదనలు, బెదిరింపులు. అన్నీ కంపెనీ డైరెక్టర్లు, రాజు, రమ విన్నారు. రాజూ! మీరు పంపిన మెయిల్ కంటే ముందే మిమ్ములను డిస్మిస్ చేసిన మెయిల్ మేనేజర్ నుండి వచ్చినది. మీ నాన్న గారి గురించి నాకు బాగుగా తెలుసు కావున, రాత్రి నీతో డైరెక్టుగా మాట్లాడాను. మేనేజరుతోనూ మాట్లాడాను. డిస్మిస్సుకు కారణమడిగితే, అతడు నీళ్లు నమలడం చూసి, నిన్ను ఆధారాలున్నవా అని అడిగాను. నీవు చెప్పిన మాట విశ్వసించాను. అందుకే మేనేజరును డిస్మిస్ చేశానన్నాడు కంపెనీ డైరెక్టర్. రాజు, రమ చేతులు పట్టుకొని, నిన్ను అనవసరంగా అనుమానించెను. ఇప్పుడు సిగ్గు పెడుతున్నాను నన్ను మన్నించు రమా! మన్నించు!అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సాయంత్రం ఎప్పటిలాగే ఒకే బండిపై రాజు, రమ ఇంటికి బయలుదేరారు. పిల్లలిద్దరూ అమ్మా నాన్న కలసి వస్తుంటే, చెరొకరి చేయి పట్టుకొని నవ్వుతూ లోపలికి వచ్చారు. రమ, రాజులు కొత్త పెళ్ళి జంటల వలే వస్తుంటే, కళ్ళతోనే స్వాగతం పలికారు రాజు అమ్మా నాన్నలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!