నాటారి అంగడి

నాటారి అంగడి

రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

“యాంది బావా అట్టా అంటుండావు.నీ యాస్తికి నువ్వేంది ఇట్టా దిగులుపడాలా.నీకేమి ఒకెకరా అమ్మి అప్పులన్నీ కట్టేయొచ్చులే”అని దామోదరంతో అన్నాడు భాస్కర్.అది కాదురా మనోడు జేసింది మంచి పనైతే ఒకటిగాదు రెండెకరాలమ్మైనా అప్పులు దీరస్తా.కానీ ఈ ఎదవ జేసిన పనికి తలెత్తుకోలేక పోతుండా అంటూ దామోదరం బాధపడ్డాడు.బావా ఇప్పుడు పిల్లనాయాల్లందరూ అట్నే ఉండారులే ఏం బాధపడబాక నాలుగురోజులాగితే మరిసిపోతారులే అంటూ ఓదార్చుతూ కల్లు పాక నుంచి ఇంటి బాటపట్టారు.మధ్యలో పక్కూరి పాపయ్య ఏందిరా ఇందాకటి నుంచి ఎదవ ఏదో జేశాడు అంటుండారు ఏంది కత అన్నాడు.భాస్కర్ ఏముంది పాపా నీకు తెలవనియా మావూరి కతలా అంటూ చెప్పడం ప్రారంభించాడు.
“మా ఊళ్ళో ఏం కావాలన్నా నాటారి అంగడి ఒక్కటే దిక్కు.ఊళ్ళోంచి అంగడికాడికి బోవాలన్నా శానా కస్టం.ఎందుకంటే ఆడికి బోవాలంటే రావణగుంట దాటాల్సిందే ఆడ దెయ్యాలుంటాయని చీకటిబడితే ఎవురూ అట్టా కన్నెత్తి గూడా సూడరు.నాటారి గూడ తాగుబోతునాయాళ్ళు దప్ప ఎవురూ రారు పెద్ద యాపారం ఉండదని ఇంట్లో ఉండి అంగట్లో పిలకాయల్ని బెట్టేవాడు.అదే అదనుగా సూసుకొని కుర్రనాయాళ్ళు ఆ టైంలోనే నాటారి అంగడికి పోవడం ఆడ సిగరెట్లు మొందు తాగడం నేర్చుకొన్నారు.ఆ ఎదవల్లో మా బావ కొడుకు గూడా ఉండాడు” అని చెప్పాడు. దానికి పాపయ్య “ఒరేయ్ దీనికేనా అప్పులు దాకా బోయారు నా కొడుకు ఐదేళ్ళ ముందే ఆ స్టేజీ దాటేసి నన్ను గెట్టెక్కిచ్చాడు.”అనడంతో తాగి తందనాలాడి గెట్టెక్కిచ్చాడా అదేంట్రా సిత్రంగా సెప్తున్నావు అన్నాడు దామోదరం.”అవును మావా మొందు గిందు తాగి తందనాలాడి మావోడికి గ్యానోదయం అయి ఇప్పుడు పద్దతిగా ఉద్యోగం జేసుకుంటుండాడు అందుకే గెట్టెక్కిచ్చాడు అని చెప్పా లే.”అని నిమ్మళంగా చెప్పాడు పాపయ్య.మావోడు మీ వాడికంటే నాలుగాకులు ఎక్కువ సదివాడులే అందుకే నా బాధ అన్నాడు దామోదరం.తాగుడొక్కటే కాదా సమస్య ఇంకేందైతే అంటూ పాపయ్య పద నాటారి అంగడొచ్చింది కూర్సొని మాట్లాడుదాం అనడంతో ముగ్గురూ అంగడి బండ మీద కూర్చున్నారు.భాస్కర్ ఈ బండమీదే కద బావా అల్లుడు కూర్సొనేది అనగానే కోపంతో దామోదరం ఊగిపోయి రేపు రచ్చబండ కాడ ఏదైనా ఇబ్బంది రావాల అప్పుడు సెప్తా నీ సంగతి తాగిందంతా కక్కతావ్ నాయాలా అంటుండగానే పాపయ్య అందుకొని సరే అసలేంజరిగిందో సెప్పండెహా అన్నాడు.”రోజూ సీకటి పడ్డాక అల్లుడొచ్చి ఈ బండమీదే కూర్సోని నాటారి కూతుర్ని లైన్ లో పెట్టాడు.నాటారి కూతురు వోడు రావణగుంట కాడ ఉండడం సూసిన నాటారి మా బావ మీదికి కత్తెత్తుకొచ్చి నరికేయబోతుంటే నేను సర్ది సెప్పి పంపించేశా మీ సంగతి రేపు రచ్చబండకాడ సెప్తా అంటూ నాటారి నేరిగా మా ఊరి పెద్ద రాఘవరెడ్డి కాడికి బొయి సెప్పాడు.రాఘవరెడ్డి రేపు మా బావని రచ్చబండకాడికి రమ్మని కబురు చేశాడు.అందుకే ఈడ సిట్టింగ్ ఏశాం.”అని చెప్పాడు భాస్కర్.ఇప్పుడు మీవోడు యాడుండాడు అయితే అని పాపయ్య అడిగాడు “ఇద్దరినీ తోలకపొయి రాఘవ రెడ్డి ఇంట్లో బెట్టుండారు.రేపు నా పరిస్థితేందో అర్థం కావట్లేదు అన్నాడు దామోదరం.పాపయ్య ఏం కాదులే రచ్చ లేకుండా పెళ్ళి చేసెయండి అంతేగా అన్నాడు. ఇదేమైనా సినిమా అనుకున్నావా పెళ్ళి చేసేదానికి అది ఎట్టి పరిస్థితుల్లో జరగదులే అన్నాడు దామోదరం.మీకిష్టంలేదా నాటారి కూతురు అన్నాడు పాపయ్య.కాదురా సామీ మావోడికంటే ఆయమ్మి ఐదేళ్ళు పెద్ద అని దామోదరం అదరకుండా బెదరకుండా సెప్తుంటే పాపయ్య వణికిపోతూ ఓర్నాయనో మీవోడు నాలుగాకులు కాదయ్యో పదాకులు ఎక్కువ సదివాడు నిన్ను ఆ దేవుడే కాపాడాలా అని సెప్పి పాపయ్య వాళ్ళూరికి వెళ్ళిపొయ్యాడు.దామోదరం,భాస్కర్ ఇద్దరూ ఇంటికెళ్ళి నిద్రపోయారు.ఉదయాన్నే ఏదో కేకలు వినపడుతున్నాయి మత్తు వదలక అటూ ఇటూ కదులుతూ కళ్ళు తెరిచాడు దామోదరం.చూస్తే ఆశ్చర్యం పెళ్ళి చేసుకొని కొడుకు కోడలు ప్రత్యక్షమయ్యారు.లోపల విపరీతమైన సంతోషం ఉన్నా కోపంతో దుడ్డుకర్ర దీసుకొని కొడుకుని బాదబోయాడు ఇంతలో నాటారి అడ్డు వచ్చి నా అల్లుడిని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు అని బెదిరించడంతో తెల్లమొహమేసిన దామోదరం వాచిలో టైం చూశాడు టైం సాయంత్రం ఐదు. రచ్చబండ అయిపోయి రచ్చ సెటిలయిపోయిందా నేను లేకుండా ఎలా సెటిలయిందబ్బా ఇది కలా నిజమా అనుకుంటున్న దామోదరాన్ని భార్య భద్రమ్మ గిచ్చి ఏమయ్యా ..!పిల్లలు పేమించుకున్నారు .ఇద్దురూ ఒకే క్లాసు సదువుకున్నారు.మనోడు గూడా ఏదో కొంచెం సంపాదిస్తుండాడని నాటారన్న ఓకే సెప్పేశాడు పెళ్ళి రచ్చబండ కాడే సేసేశాము నిన్ను లేపి లేపి మా వల్ల కాక మన బదులు పీఠలమీద పెద్ద బావోళ్ళని కూర్చోబెట్టేశాం అని పూసగుచ్చినట్లు సెప్పింది.దామోదరం షాక్ నుంచి తేరుకొని మనోడికంటే అమ్మాయి ఐదేళ్ళు పెద్ద కదే అన్నాడు. ఓరి నా తింగర మొగుడా మనోడు పేమించింది నాటారి చిన్న కూతురిని అంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది.దామోదరం ఆనందంతో ఎగిరి గంతేశాడు.నాటారి దామోదరాన్ని సమీపించి” ఒరేయ్ దామూ!రేపట్నుంచి తాగావంటే నీ కొడుకుని నా ఇంటికి తీసుకెళ్ళిపోతా జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!