అన్వేషణ

 అన్వేషణ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 

రచన-సావిత్రి కోవూరు

“ఏరా శివ మన బ్యాచ్ లో అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి నీ ఒక్కడికి తప్ప. ఎప్పుడు చేసుకుంటున్నావు” అన్నాడు పెళ్ళికొడుకు రంజిత్ విడిది ఇంటిలో.
“మీకేమిరా మీ అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయినో,ఘ ప్రేమించిన అమ్మాయినో చేసేసుకుంటున్నారు. నా విషయం అలా కాదు కదా” అన్నాడు శివ.
“అంటే నీవు ఎవరినైనా ప్రేమించావా” అన్నాడు రంజిత్.
“అవును అందుకే ఈ తిప్పలన్నీ”
“ఎప్పుడు చెప్పలేదు నాకు. మరి ప్రేమించిన అమ్మాయి రెడీగా ఉంటే, మీ అమ్మానాన్నలకు చెప్పి చేసుకోవచ్చు కదా. ఎందుకంత లేట్ చేస్తున్నావ్” అన్నాడు రంజిత్.
“అది నీవు అనుకున్నంత తేలిక కాదు”  నిరాసక్తంగా శివ అన్నాడు.
“ఎందుకు మీ వాళ్ళు ఒప్పుకోవటం లేదా. వాళ్ల వాళ్లు ఒప్పుకోవటం లేదా ఎందుకు ఆలస్యం” అన్నాడు.
“అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఏమో నాకు తెలియదు”
“అదేంటి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నీ కథ. కొంచెం అర్ధమయ్యే లాగ చెప్పు” అన్నాడు రంజిత్.
“ఇప్పుడు కాదులే ఇంకెప్పుడైనా తీరికగా చెప్తాను. రేపు ఉదయము నీ పెళ్లి కదా తొందరగా పడుకోక పోతే తొందరగా లేవ లేవు. హాయిగా పడుకో” అన్నాడు శివ.
“ఇప్పుడు నాకు నిద్ర పట్టదు కాని టూకీగా చెప్పేసేయ్. చాతనైతే నేను ఏమైనా సహాయం చేయగలుగుతానేమో చూస్తాను” అన్నాడు రంజిత్.
“అయితే విను మా చెల్లి చందన తెలుసు కదా నీకు. తను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక రోజు తన ఫ్రెండ్స్ ఏడెనిమిది మందిని మా ఇంటికి తీసుకు వచ్చింది. అందరు కలిసి గోలగోలగా ఆటలు, పాటలు, జోక్స్ నవ్వులతో హాయిగా గడిపారు. నేను నా రూమ్ లోంచి బయటకు రాకుండానే వాళ్ళ మాటలు వింటున్నాను. అందరూ రాత్రి వరకు ఎంజాయ్ చేసి రాత్రికి ఒక్కొక్కరి నాన్ననో, అన్నయ్యలో వచ్చి వాళ్ల వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. చివరికి హాసిని అనే అమ్మాయి ఒక్కతే మిగిలిపోయింది. నా రూమ్ లోంచి చూస్తుంటే ఎదురుగుండా ఇద్దరు కనబడుతున్నారు. చివరికి ఆ అమ్మాయి కూడా “నేను వేళతానే చందు” అని లేచింది.
“ఒక్కదానివెలా వెళ్తావు. మా అన్నయ్య, నేను వచ్చి మీ ఇంటి దగ్గర వదిలి పెడతాం” అన్నది.
మా చెల్లి అమ్మాయితో “హాసిని, ఈరోజు అందరూ చాలా హాయిగా ఎంజాయ్ చేశారు. నీవేమో ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నావు. అసలేంటి నీ బాధ” అన్నది.
“దానికి ఆ అమ్మాయి వెక్కివెక్కి ఏడవడం మొదలు పెట్టింది. మా చెల్లి ఆ అమ్మాయిని ఓదారుస్తుంటే ఎవరా ఆ అమ్మాయని  మెల్లగా నా రూమ్ బయటకు వచ్చి తొంగి చూశాను. ఆ హాసిని అనే అమ్మాయి రూపం నన్ను ఎంతో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈ అమ్మాయిలో ఉన్న సౌందర్యము  ఏ అమ్మాయిలోను  నాకు కనిపించ లేదు. పసుపు కలిపిన తెల్లని వర్ణంతో, పలుచని బుగ్గలతో గులాబీ రంగులోకి మారిన బుగ్గలతో, లేత గులాబీ రంగు సన్నని పెదవులతో, కొటేరు పెట్టినట్టు సన్నని కొన దేలిన నాసిక, రింగులు రింగులుగా నుదురుపై మెల్లగా  కదలాడే ముంగురులు, మొత్తానికి ఆ అమ్మాయి సన్నని గంధపు బొమ్మలా నాజూగ్గా ఉంది.
మా చెల్లి ఓదారుస్తుంటే తేరుకుని నవ్వుతుంటే చమక్కుమని తెల్లగా మెరిసే పలు వరుసతోఎంత అందంగా ఉందంటే ఆ నవ్వు చెప్పలేను. ఆ అమ్మాయిని మా చెల్లి తో ఇదివరకు ఒకట్రెండు సార్లు చూసిన అంత పరీక్షగా చూడలేదు.
మా చెల్లి  “చెప్పు ఏంటి నీ బాధ అసలు. ఎందుకు అలా ఉన్నావు. నేను ఏమైనా హెల్ప్ చేయగలనా” అని రెట్టించి అడిగింది.
“నా బాధ ఎవరు తీర్చలేరు చందు. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొత్తగా వచ్చిన మా పిన్నికి కూడా ఒక అమ్మాయి. మా నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. జీతం బాగానే వచ్చేది. కానీ ఒక రోజు ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయి కంపెనీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది మా నాన్నకు. కంపెనీ వాళ్ళు కొంత డబ్బును ముట్టచెప్పి జాబ్ నుండి తీసేసారు.
మా పిన్నికి ఎందుకో నన్ను చూస్తేనే చిరాకు. ఇప్పుడు మా పిన్ని నన్ను చదువు మానేసి ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోమని చెబుతోంది. నీకు చదువు చెప్పించడం మా వల్ల కాదు. వచ్చిన డబ్బు కాస్త నీ చదువుకే అయిపోతే, నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి అందుకే మానేసేయి”  అని నాపై వత్తిడి తెస్తుంది. నాకు చదువు మానడం ఇష్టం లేదు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ మా నాన్నకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉంది. ఈ ఒక్క సంవత్సరం నన్ను చదివిస్తే నేను కుటుంబాన్ని చూసుకుంటానని, చెల్లి పెళ్ళి నేనే చేస్తానని చెప్పినా వినటం లేదు” అని చెప్పింది.
దానికి మా చెల్లెలు “ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాము. నువ్వు బాధపడకు” అని చెప్పి పంపించింది.
కొన్ని రోజుల తర్వాత మా చెల్లి తో “మీ ఫ్రెండ్ సంగతి ఏం చేసావే చందు. ఆ అమ్మాయి కాలేజీకి వస్తుందా” అన్నాను.
“లేదు అన్నయ్య ఆ అమ్మాయిని వాళ్ల పిన్ని చదువు మానిపించి వాళ్ల ఊరికి తీసుకెళ్ళి పోయింది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తడం లేదు. వాళ్ళ ఊరి పేరు కూడా నాకు తెలియదు. నేను తనకు ఏమి సాయం చేయలేకపోయాను అని చాలా బాధగా ఉంది” అన్నది మా చెల్లెలు.
నాకు చాలా నిరాశ అనిపించింది. ఆ అమ్మాయిని మొదటి సారి చూసినప్పుడే ప్రేమించాను. ఇంక ఆమె కథ వినేసరికి చాలా బాధనిపించింది. తన గురించి మా అమ్మానాన్నలకు చెప్పి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అప్పటి నుండి ఆ అమ్మాయి ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తుందేమోనని ఆశతో అన్ని పెళ్లిళ్లకు ఫంక్షన్లకు గెట్ టు గెదర్ లకు వెళుతున్నాను. ఆ అమ్మాయి నా అదృష్టం కొద్దీ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఆశ.
కానీ మా అమ్మ వాళ్ళు, మా చెల్లెలు “ఆ అమ్మాయి నీ కొరకు ఎదురు చూడదు. ఎందుకంటె నీ ప్రేమ సంగతి ఆ అమ్మాయికి అసలు తెలియదు. వాళ్ళ పిన్ని  ఇప్పటికే పెళ్లి చేసి ఉంటది. నీకు ఎక్కడైన కనిపించిన ఒకరిద్దరు పిల్లలతో కనిపిస్తుంది. ఇక ఆ అమ్మాయిని మర్చిపోయి మేం చూసిన అమ్మాయిని చేసుకోమంటారు”
కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి తప్పకుండా కనిపిస్తుంది అనిపిస్తుంది. కనిపించే వరకు వెయిట్ చేస్తానంటే మా వాళ్లు వినటం లేదు. నాకు ఈ సంవత్సరం టైం ఇచ్చారు. ఈ నెలతో ఆ టైం గడువు ముగుస్తుంది. ఈ లోపల నాకు అమ్మాయి కనిపించకపోతే తాము చూసిన అమ్మాయిని చేసుకోవాలని షరతు విధించారు. కానీ నేను ఆ అమ్మాయి కనిపించే వరకు వెయిట్ చేస్తాను” అన్నాడు శివ.
“సరే రా నీ ప్రేమ కథ విన్నాక, నాకు నీవు వెయిట్ చేయడం సబబే అనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఇక పడుకో రేపు తొందరగా లేవాలి. అన్నాడు
ఉదయం అట్టహాసంగా వేసిన కల్యాణ మండపంలో పెళ్ళికొడుకు గెటప్ లో వెలిగిపోతున్నాడు రంజిత్. పురోహితుడు పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్పేసరికి కొబ్బరిబోండం చేతిలో పెట్టి మేనమామలు కల్యాణ మండపం పైకి వధువును తెచ్చారు. అమ్మాయి కూడా పసుపుపచ్చని చీరలో చక్కగా ఉంది. పెళ్లి తతంగాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతున్నాయి. దారపోయడం, జీలకర బెల్లం పెట్టడం శిరస్సుపై పెట్టడం, శుభముహుర్తమున ఇద్దరి మధ్య ఉన్న తెరతీసి, తాళిబొట్టు కట్టడం ఆ తర్వాత తలంబ్రాల తంతు సరదాగా జరిగింది. అంత జరిగిన తర్వాత వధూవరులను ఆశీర్వదించుటకు మండపం వద్దకు వెళుతున్నారు అందరు. శివ కూడ స్నేహితులతో కలిసి మంటపము పైకి వెళ్లి అక్షంతలు వేసి యధాలాపంగా వెనకగల వైపు చూసి, తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వెంటనే రంజిత్ చెవిలో “నీ వెనక వైపు ఆ బట్టలు మడత పెడుతున్న ఆ అమ్మాయే నేను ఇన్నిరోజులుగా వెతికుతున్న అమ్మాయి. ఇక్కడ కనిపించింది ఆమె పెళ్లి కూతురుకి ఏమవుతుందో కనుక్కో. లేకపోతే మళ్లీ నాకు కనిపించకుండా అదృశ్యం అయిపోతుంది. ప్లీజ్ తొందరగా” అన్నాడు.
వెంటనే శివ చూపిన వైపు రంజిత్ ఆమె పెళ్లి కూతురి అక్కను చూసి రంజిత్ “ఆమె పేరు హాసిని కాదు రా. చంద్ర. ఆమె నా భార్య సుహాసిని వాళ్ళక్క. ఆమెనే కాలేజీకి వెళ్ళక పోయినా ప్రైవేటుగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నది. చెల్లెలి పెళ్లి బాధ్యత అంతా  తన భుజాలపై వేసుకుని పెళ్లి జరిపిస్తుంది. చెల్లెలి పెళ్లి చేసే వరకు తను పెళ్లి చేసుకొనని చెప్పిందట” అన్నాడు రంజిత్.
“అరె ఆమె పేరు హాసిని. మా చెల్లెలు ఫ్రెండ్. నీవు సరిగ్గా కనుక్కో అన్నాడు” శివ.
రంజిత్ తన భార్య సుహాసిని తో వాళ్లక్కను చూపించి “ఆమె పేరు చంద్ర కదా? మా స్నేహితుడు హాసిని అంటున్నాడు” అన్నాడు.
దానికి సుహాసిని “మా అక్క పేరు చంద్ర హాసిని, ఫ్రెండ్స్ అందరూ ‘హాసిని’ అంటారు. ఇంట్లో మేమంతా ‘చంద్ర’ అంటాము” అన్నది.
ఆ విషయమంత శివకు చెప్పి “మా అత్తగారు తన కూతురు సుహాసిని పెళ్లి అయ్యేవరకూ తనను పెళ్ళి చేసుకోకూడదని షరతు విధించిందట. అంతే కాకుండా సుహాసిని పెళ్లి బాధ్యతంతా తీసుకోవాలని చెప్పిందట. అందువల్లనే ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేస్తుంది. ఇక నీవు నిశ్చింతగా ఉండు. నీ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను” అన్నాడు రంజిత్ .
“చాలా చాలా థాంక్స్ రా రంజిత్. నేను ఆమె కొరకు వెతికి వెతికి వేసారి పోయాను. మా ఇంట్లో వాళ్ళేమో, వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. మీ పెళ్లి పుణ్యమా అని, ఆమె నాకు మళ్ళీ కనిపించింది” అన్నాడు.
తర్వాత వెంటవెంటనే రెండు కుటుంబాల మధ్యన మాటలు జరిగి శివ, చంద్రహసినిల పెళ్లి కూడా ఆడంబరంగా జరిగింది. శివ తల్లిదండ్రులు చెల్లెలు కూడా ఎంతో సంతోషించారు శివ కోరుకున్న అమ్మాయి తో పెళ్లి జరిగినందుకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!