అమ్మాయి మనసు

అమ్మాయి మనసు

రచన: శ్రీదేవి విన్నకోట

నా పేరు హరి. వయసు ఇరవై ఎనిమిది. ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్నాను.(సారీ సారీ ఆంధ్ర బ్యాంక్ కాస్త యూనియన్ బ్యాంక్ అయిందిగా అలవాటులో పొరపాటుగా మరిచాను.) నేను మొన్ననే మొదటిసారి ఒక పెళ్లిచూపులుకి వెళ్లడం అమ్మాయి నాకు తొలిచూపులోనే నచ్చడం ఆపై వెంటనే నిశ్చితార్థం జరగడం పెళ్లికి ముహూర్తం పెట్టడం అన్ని నాలుగు రోజుల్లో జరిగిపోయాయి.

పెళ్లికి ఇంకో 15 రోజుల గడువు ఉంది. అమ్మాయి పేరు ధరణి, పల్లెటూర్లో పట్టింపులు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల తను పెద్దగా చదువుకోలేదు, .కాకపోతే ఆమె అమాయకమైన స్వచ్ఛమైన అందం ఉందే, చూడగానే నా కళ్ళకి మైకం కమ్మేసి మాయచేసి క్షణాల్లో  మైమరిపించేసింది.

ఆమెను చూడగానే నన్ను నేనే మరచి పోయాను. కను రెప్పలు వేయకుండా తననే చూస్తూ ఉండాలనిపించెంత సొగసు.అసలు పల్లెటూరి అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారు అని చెప్తే ఇంతకుముందు నేనునమ్మలేదు.కానీ ధరణిని చూశాక తన ముందు ఏసినిమా హీరోయిన్ అయినా దిగదుడుపే అనిపించింది.పసిమిఛాయ నడుముకి చాలాకిందివరకు అలల్లా ఎగురుతున్న ఒత్తయిన నొక్కునొక్కులజుట్టు,చెంపకుచారెడు కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, శంఖంలాంటి మెడ,దొండపండులా చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనిపించేలా ఉన్న పెదవులు, ఇంకా నాకైతే తనను చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అంటే నమ్మండి.

నేనుఫోన్చేస్తే తననోట్లోంచి అసలుమాటలే ఊడిపడవే, ఎంతైనా పల్లెటూరి అమ్మాయికదా తగనిసిగ్గు అనుకుంటా. అలానేను  కలలుకంటూనే ఉన్నాను పెళ్లిరోజు దగ్గరికివచ్చేసింది.

ఇక్కడ నాగురించి కొంత చెప్పాలి.మాఅమ్మ నాచిన్నప్పుడే చనిపోతే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు,సవతితల్లిఅంటే ఎలాఉంటుందో తెలుసుకదా,మాపిన్ని  అలాగేఉంటుంది, విపరీతమైన డబ్బుఅశ, నాకుతిండి కూడా సరిగ్గాపెట్టేది కాదు.నేనుచదువులో మెరిట్ స్టూడెంట్ ని కావడం వల్ల ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ స్కాలర్ షిప్పులు పొందుతూ ట్యూషన్ చెప్తూ ఫ్రెండ్స్ సహాయంతో నాబిఎస్సీ డిగ్రీ చదువును సులభంగానే గట్టెక్కించేసి నా అదృష్టం కొద్దీ లక్కీగా ఉద్యోగం సంపాదించేసా, అక్కడితో నేను హ్యాపీ.

మా నాన్న పాపం నోట్లోనాలుక లేనిమనిషి. ఆయనకి సొంతంగా ఆలోచించే మనస్తత్వం లేదు, పిన్ని తాన అంటే నాన్న తందాన అంటాడు అంతే,నాకు ఇంకో తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు. నాన్నకిపిన్నికి పుట్టిన వాళ్ళు. నేను పిన్నితో ముందే చాలా గట్టిగా చెప్పాను అమ్మాయి నాకు బాగానచ్చింది, వాళ్లు అంతగాఆస్తులు లేనివాళ్ళే, కట్నాలుకానుకలు అలాంటివి ఏమీఅడగొద్దు అని, పిన్నికి ఇష్టం లేకపోయినా నేను అంతగట్టిగా చెప్పడం వల్ల చేసేదేం లేక మనసులో ఏడ్చుకుంటూనే సరేఅంది.

అనుకున్నట్టుగానే నాపెళ్లి అమ్మాయి వాళ్ళ పల్లెలోనే చాలా సింపుల్గా జరిగింది. జీలకర్ర బెల్లం తలపైపెట్టి మూడుముళ్ళు వేసి అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు కలసి నడవడంతోటే అందాలరాశి ధరణి నాభార్యగా నాసొంతమయిపోయింది. నాలో అనిర్వచనీయమైన ఆనందం. పసుపు అంటిన మొహంతో అలసిన కళ్లతో మరింత అందంగా కనిపించింది ధరణి. ఇప్పుడు నాతనువు మనసు ఆమెతో గడిపే మొదటిసంగమం కోసం  తహతహ లాడుతున్నాయి. పెళ్లయిన మర్నాడే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం దర్శనం చేసుకుని  పల్లెకు తిరిగి వచ్చాము .

నాకేమో తనతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీనోరు విప్పదే,కళ్ళు ఎత్తి చూడదు. భయమో సిగ్గో  మరి ఏంటో, నేను కొత్త కదా, అందుకే తను కొంచెం ముభావంగా ఉంది, అలా ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు.కొత్తగా పెళ్లైన వాళ్ళ లో ఉండే సంతోషం నాకు ఆమెలో మచ్చుకైనా కనిపించలేదు.ముఖం బాధగా ముడుచుకుని విచారంగా ఉంది.బహుశ అమ్మానాన్నల్ని వదిలి నాతోవచ్చేయాలి అనే కంగారు వల్ల ఏమో, కార్లో వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు  ఆమెని సున్నితంగా నవ్వుతూ మాట్లాడించే ప్రయత్నం చేశాను. కానీ ఊహూ ఉలకదు పలకదే రాక్షసి అని తిట్టుకున్న మనసులోనే.అయినా రేపే కదా మన మొదటి రాత్రి రేపు చెప్తా నీ సంగతి అనుకున్నా  మనసులో.

నేను  ఎంతో ఎదురు చూసిన  మొదటి రాత్రిరానే వచ్చింది. అందరి వేళాకోళాలు ఆటపట్టింపులు, సాంప్రదాయాల, మధ్య నాకలల సుందరి ధరణి గదిలోకి పాల గ్లాస్ తో అడుగు పెట్టింది. తనని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేలా పాలరాతి బొమ్మ కి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో అలాఉంది. నేను రా ధరణి అని పిలిచాను ప్రేమగా.ఒక్కసారి కళ్ళెత్తి నా వంక చూసి మళ్ళీ వెంటనే తలదించుకుంది. నేనేలేచి వెళ్లి అసలు అసలు నీకు ఇంత సిగ్గు ఏంటి బంగారం అంటూ ఆమె బుగ్గల మీద సున్నితంగా చిటిక వేసాను. మరింత సిగ్గుగా తలవంచుకుంది. పాలగ్లాసు నా ముందుకు చాపింది. ఆ గ్లాస్ ఆమె చేతుల్లో నుంచి తీసి పక్కన పెట్టి ముందు నీతో మురిపాలు, ఆ తర్వాతే పాలు అన్నాను అల్లరిగా నవ్వుతూ.

మరింత సిగ్గుగా ముడుచుకుపోతున్న  ఆమెను దగ్గరగా తీసుకుని ఆమె బుగ్గలపై సున్నితంగా నా పెదవులు ఆనించాను, ఆ మాత్రం దానికే చిగురుటాకులా వణికింది. మెల్లిగా ఆమెను అల్లుకు పోతున్నాను. నెమ్మదిగా మంచం వైపు నడిపించాను తనని.ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాను. సున్నితంగా నా చేతులు ఆమె నడుముని చుట్టేశాయి ఆమె వీణ అయితే నా చేతులు తీగలుగా మారి ఆమెను శృతి చేస్తున్నాయి.నా చేతులు ఆమె అణువణువు స్పృశిస్తూ ఆమె  నాకు తెలియనివి మరి ఇంకేదో శోధించాలి అన్నట్టుగా ఆత్రంగా ఆవేశంగా  ఆమె మొహాన్ని నా రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను నా తొలిముద్దు. స్వర్గ లోకపు అంచులను చూస్తున్నట్టు ఏదో ఆనంద పరవశం,నాకు కొత్త లోకంలో మత్తుగా తేలిపోతున్నట్టు అనిపించింది.

ధరణి సిగ్గుగా  చేతుల్లో తన మొహాన్ని దాచుకుంది,తన మొహం మీద నుంచి ఆమె చేతులను నా భుజాల మీదకు జార్చి ఆమెను  హత్తుకున్నాను. మరొక రెండు నిమిషాలు ఉంటే ఇద్దరం మంచం మీద ఉండేవాళ్ళం. కానీ ఇంతలో  తనకి ఏమైందో తెలియదు, ధరణి  తన మీద నుంచి నాచేతుల్ని విసురుగా  తోసేసి  నన్ను పక్కకి నెట్టేసి నాకు దూరంగా జరిగిపోయింది.

ఒక క్షణం నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు, స్వర్గం నుంచి కిందకి  జారి పడినట్టు అనిపించింది.ఏమైంది బంగారం భయపడ్డావా,ఏం కాదురా అంటూ మళ్లీ తనని దగ్గరికి తీసుకోబోయాను.ఊహూ వద్దు అని చెప్పానా మీకు అంటూ నా చేతుల్ని పక్కకి తోసేసి తను నా కళ్ళల్లోకి బేదురుగా చూస్తూ నాకు ఇదంతా ఇష్టం లేదు,మీరు నాకు దూరంగా ఉండండి, అలా ఉంటేనే మీకు నాకు మంచిది అంది.నాకు చర్రున కోపం దూసుకు వచ్చేసింది, ఏం మాట్లాడుతున్నావ్ పిచ్చి పిచ్చిగా అంటూ దుడుకుగా ఏదో అనబోయి కానీ అంతలోనే  నన్ను నేను తమాయించుకుని ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా బంగారం ఇంతట్లో ఏమైంది, అంటూ లాలనగా అడుగుతూ ఆమెని బుజ్జగిస్తూ తన దగ్గరికి చేరబోయాను. ఎంత ప్రయత్నించినా అసలు ఒప్పుకోకుండా నాకు దూరం జరిగిపోతూనే ఉంది.

ఇక ఆమెను బ్రతిమాలి ఉపయోగం లేదు అని నేను మరింత బలవంతం చేస్తే ఏడుస్తుంది అని అర్థమైంది. కోపంగా మంచంపై మరోవైపు తిరిగి నిద్ర నటించాను. భారంగానే తెల్లవారింది.  ఈరోజు నా  ధరణిని సారేచీరలతో మా ఇంటికి తీసుకు రావడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ల పుట్టింటి వాళ్ళు.ధరణి కళ్ళల్లోనీళ్ళు తిరుగుతున్నాయి.ఏ ఆడపిల్లయినా అంతేగా అమ్మానాన్నల్ని వదిలి రావడం అంటే పాపం ఏడుపొస్తుంది కదా, తన వంకే  జాలిగా చూస్తూ ఉండిపోయాను.

ఆఖరికి మేము మాఇంటికి బయలుదేరే సమయం ఆసన్నమైంది. బయలుదేరడానికి ఒక అరగంట ముందు ధరణి నా దగ్గరికి వచ్చింది.ఫోన్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న నేను ధరణిని చూడగానే ఫోన్ పక్కన పెట్టీ  నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాను. తలవంచుకుని నిలబడింది తప్ప సమాధానం చెప్పలేదు. ఏమైంది రాత్రి నుంచి చూస్తున్నాను కొద్దిసేపు బావున్నావు తర్వాత అలా మూడీ గా అయిపోయావు ఎందుకు బంగారం అని అడిగాను. నేను ఇక్కడే ఉంటాను మీతో రాను,మా వాళ్లతో చెప్పి నన్ను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచండి అంది.ఎందుకు అని అడిగాను అర్థం కానట్టు చూస్తూ.ఏమైంది తనకి అని ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోవడం తో బయటకు వెళ్ళిపోయింది కళ్ళ నీళ్ళతో.

పోనీలే కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్తాను అని చెప్దాం అని వాళ్ళ అమ్మ నాన్న ని కలవడానికి బయటికి వచ్చాను. వాళ్ల రూమ్ లోకి వెళుతూ వాళ్లు మాట్లాడుతున్న మాటల్లో నా పేరు వినిపించి ఆగిపోయాను.ధరణి వాళ్ళ నాన్నతో అంటుంది మన పొలం కూడా లేకపోతే ఎలా బ్రతుకుతారు నాన్న మీరు అని.పర్వాలేదు అమ్మ నేను  ఎవరో ఒకరి పొలంలో కూలి పని చేస్తాను నువ్వు నా గురించి బాధ పడకు అని చెప్తున్నాడు ధరణి తండ్రి.ఇంతలోనే వాళ్ళ పొలానికి ఏమైంది అనుకుంటూ వాళ్ళ ఉన్న రూమ్ లోకి అడుగుపెట్టాను. ఏం జరుగుతుంది ఇక్కడ ధరణి ఎందుకు ఏడుస్తుంది.అసలు మీ పొలానికి ఏమైంది అని అడిగాను. ఆయన ఏం లేదు బాబు అంటూ సర్దేయ్యబోయాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని కాస్త గొంతు పెంచి తీవ్రంగా అడిగాను. ఆయన ఇంకా చెప్పకతప్పదు అన్నట్టుగా మీరు ముందు కట్నకానుకలు అవి ఏమీ వద్దు అన్నారు అమ్మాయిని చూసుకోవడానికి వచ్చినప్పుడు,కానీ తర్వాత మీ పిన్ని  నాన్నగారు వచ్చి కట్నం ఇవ్వకపోతే  పెళ్లి ఆపేస్తామని అన్నారు.

నిశ్చితార్థం అయిన పెళ్లి అసలే పల్లెటూరు ఆగిపోతే మా పరువు ఉంటుందా? కానీ ఇప్పటికిప్పుడు కట్నం డబ్బులు అంటే పేదవాళ్లం ఎక్కడినుంచి తేగలం. ఇంకో దారి లేదు అందుకనే మాకు ఉన్న రెండు ఎకరాల పొలాన్ని  మీ పిన్ని గారు మీ పేరుమీదకి మార్పిస్తానని చెప్పి పొలం దస్తావేజులు తన చేతికి ఇమ్మని తీసుకున్నారు.ఆ విషయం గురించే ధరణి అప్పటి నుంచి బాధపడుతూనే ఉంది బాబు. అంటూ చెప్పడం ముగించారు ఆయన.

ఇక నేనేం మాట్లాడలేదు కోపంగా మా నాన్న దగ్గరికి వచ్చేశాను. చాలా సీరియస్ గా వాళ్ల పొలం కాగితాలు ఎక్కడున్నాయి?అంటూ కోపంగా అడిగి అవి ఎక్కడున్నాయో తెలుసుకునీ ధరణి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి క్షమించండి తప్పైపోయింది. ఈవిషయాలన్నీ నిజంగా నాకు తెలియవు, బంగారం లాంటి మీ అమ్మాయిని నాకు ఇచ్చారు, అది చాలు
మీ పొలం నాకు అవసరం లేదండి ఇచ్చేస్తాను, మీ దస్తావేజులు అని చెప్పి, సారీ ఈవిషయాలు నాకు నిజం గా తెలియవు ధరణి అని చెప్పాను.

అప్పుడు తాను నా వైపు చూసి తీయగా నవ్వింది గులాబీలు విచ్చుకున్నట్టు,వెన్నెల విరబూసినట్టుగా, అత్తారింటికివెళ్లే ప్రతి ఆడపిల్ల ఇంతే అనుకుంటా.తన మెట్టినింటితోపాటు పుట్టిల్లు కూడా ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రాత్రి నాతో ఉన్న అంత సంతోషంలో కూడా ధరణికి అప్పటివరకు తన సొంత పొలంలో రైతుగా ఉన్న తన తండ్రి రైతు కూలీగా మారిపోతున్నాడు అనే పరిస్థితి గుర్తొచ్చి ఆమె నాతో సంతోషంగా ఉండలేక అలా ప్రవర్తించింది అని అర్థమైంది నాకు.

ఇక ఆరోజు మామూలుగా మాఇంటికి వచ్చేసాం.ఆరాత్రి కూడా అన్ని ఏర్పాట్లు తొలిరాత్రికి జరిగినట్టే జరిపారు మా ఇంట్లో కూడా,  ఈసారి గదిలోకి వచ్చిన ధరణి మొహంలో చిరునవ్వు చిలిపితనం సిగ్గు తప్ప బాధ భయం అలాంటివి మరింకేమీ కనిపించలేదు నాకు, రాత్రి జరిగిన దానికి మీరు నన్ను క్షమించండి, మీరంటే ఇష్టం లేక కాదు, నా పెళ్లి తర్వాత నాన్న గారి పరిస్థితి ఆయన్ని కూలీగా ఊహించుకునే సరికి చాలా బాధగా అనిపించింది అందుకే మీతో సంతోషంగా ఉండలేకపోయాను అంది చిన్నగా నవ్వుతూ.

పర్వాలేదు నాకు అర్థమైందిలే బంగారం నీబాధ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాను.మెల్లగా తనని అల్లుకుపోతూ తొలిసారిగా ఆమె దగ్గర  ఓడిపోయి గెలిచే కొత్త యుద్ధానికి సిద్ధం అయ్యాను. ధరణి కూడా నాకు పూర్తిగా సహకరిస్తూ తన అణువణువు నాకు సమర్పిస్తూ తమకంగా నాలో ఐక్యం అయిపోతూ  ఇద్దరం ఒక్కరం అయ్యే కార్యక్రమంలో మేము ప్రస్తుతానికి  చాలా బిజీ,
చదివే వాళ్ళంతా ఛలోజీ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!