అతకని మనసులు

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

అతకని మనసులు

రచన: శ్రీదేవి విన్నకోట

“కిరణ్ ఇంకొక్క సారి ఆలోచించు, నువ్వు తీసుకున్న నిర్ణయం  కరెక్ట్ కాదు, అసలు మన కవిత కి ఎం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, చక్కని పద్ధతైన వినయ విధేయతలు గల అమ్మాయి, అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధ పడతావు” కిరణ్ కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది అతని తల్లి శాంభవి,

కిరణ్ కవిత భార్య భర్తలు, వారి పెళ్లి అయ్యి ఆరు ఏళ్ళు అయ్యింది, ఒక బాబు, కవిత తల్లిదండ్రులు పేదవాళ్లు అయినా మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అందమైన అమ్మాయి. చాలా ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే మనస్తత్వం చాలా ఎక్కువ కవితకు, కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా హడావిడి మనిషి.
కొత్త పోకడలు అంటే ఇష్టం, జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు, ఎక్కువగా ఏమైనా కొత్తగా చేయాలి అనుకుంటాడు, మంచివాడే ఎలాంటి వ్యసనాలు లేవు, కానీ అంత నెమ్మదిగా సాఫ్ట్ గా పద్ధతిగా ఉండే కవిత అతనికి నచ్చట్లేదు, పార్టీలకి విందులకు వినోదాలకు రమ్మంటే రాదు,అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది, చాలా తెలివైనదే కానీ అందరితో అంత తొందరగా కలిసి పోలేదు, బాగా అలవాటైతే తప్ప ఎవరితో అంత తొందరగా  స్నేహం చేయలేదు.

కిరణ్ చాలా మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ భార్యలని ఇంకా బయట చాలా మంది అమ్మాయిలను గమనిస్తూ ఉంటాడు,వాళ్ళందరూ చాలా చక్కగా ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరితోనైనా చాలా కలుపుగోలుగా చక్కగా కవ్విస్తూ నవ్విస్తూ మాట్లాడుతారు, కవిత అందంగా ఉంటుంది ఎంబీఏ చదివింది,కానీ కలివిడిగా ఉండదు చాలా మొహమాటం, పాత చింతకాయ పచ్చడిలా పల్లెటూరి బైతుల్లే రెడీ అవుతుంది, కిరణ్ ఎన్నో మోడ్రన్ డ్రెస్సెస్ ఎంతో ఇష్టంతో ఏరికోరి తెచ్చిన  వేసుకోమంటే వేసుకోదు, నాకు చీర చుడిదార్ విటితోనే కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి పిచ్చి డ్రెస్ లు వేసుకోను అని కరాఖండిగా చెబుతోంది,

కిరణ్ కి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కవితతో, కానీ అవే అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు. ఇంత చిన్న విషయాలకే(ఇంకో సమస్య ఏంటంటే కవితకి బెడ్రూమ్లో కూడా విపరీతమైన సిగ్గు, అందుకే తను కొరుకున్నట్లు తనకి ఇష్టమైనట్టు ఉండట్లేదని, ఈ విషయం తల్లికి చెప్పలేదు ఇది అతని  మనసులో ఉన్న మరో బాధ). ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి, అనుకుంటున్నాడు, ఆమెతో కలిసి ఉంటే అతను ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అతనికి, కానీ తల్లి శాంభవికి ఈ విషయం నచ్చట్లేదు,పచ్చని సంసారం, చిన్నారి మనవడు, కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు, తన కాపురం లో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వింటేగా, తన మొండితనం తనదే,దేని విలువైన దాన్ని  కోల్పోయిన  తర్వాతే తెలుస్తుంది,

కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్ళల్లో నీళ్ళు,తానేం తప్పు చేసిందో తనకే అర్థం కాని అయోమయం, బాబుని గుండెలకి అదుముకుంటూ, తను ప్రాణంగా ప్రేమించే భర్తకి దూరమవడం అనే ఊహానే భరించలేకపోతోంది.కాని మాట్లాడటానికి ఏముంది, తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తే చెప్తూ ఉంటే నేను నీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం మీ కాళ్లు పట్టుకుంటా, నన్ను మీతోనే ఉండనివ్వండి అని ఇప్పుడు తను అతన్ని బతిమాలి ఒప్పించాలా, అలా అడగడానికి ఆమె అహం,మనసు కూడా  ఒప్పుకోలేదు, అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది,

అతని తల్లి మాత్రం కిరణ్ తో చాలా వాదించి విఫలం అయింది. సరే ఆఖరిగా ఒక విషయం చెప్తాను, నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులు ఇస్తున్నావు, నేను నా కోడలికి ఇవ్వట్లేదు, కాబట్టి తన నుంచి విడిపోవడం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుంది, ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను. నాకు కూతురు మాత్రమే మిగులుతుంది నా కోడలు కవిత రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శాంభవి.

అమ్మ ప్రేమ గురించి కిరణ్ కి తెలుసు, తనని రెండు రోజులు కూడా చూడకుండా ఉండలేదు, విడాకులు తీసుకున్నా తను మళ్లీ అమ్మ అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు

రోజులు గడుస్తున్నాయి, కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, కవిత తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు, ఒకరోజు కవితని డైరెక్ట్ గానే అడిగేసాడు, నాకు నీతో సంతోషం లేదు నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటె నాకు విడాకులు ఇచ్చెయ్ కవిత అంటూ, కవితకి ఏం మాట్లాడాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు కానీ అతని సంతోషానికి తాను అడ్డం కాకూడదు అనుకుంది, సరే అండి ఈ విడాకులకు నేను ఒప్పుకుంటున్నాను, అని చెప్పడంతో కిరణ్ సంతోషంగా ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకులకు అప్లై చేసాడు.

కవిత శాంభవి తో అత్తయ్య నేను ఆయనకి విడాకులు ఇస్తే ఇక్కడ ఉండను, ఉండలేను, నాకు ఇక మీ కోడలిగా ఎలాంటి హక్కు ఉండదు, నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది, ఇందుకు శాంభవి ససేమిరా ఒప్పుకోలేదు, నాకు నా కొడుకు అవసరం లేదు, నువ్వు నా మనవడే నాకు కావాలి, వాడు
ఎలా పోతాడో పోనీ, నీకు దూరమైన వాడితో నాకిక ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది చాలా గట్టిగా శాంభవి.

అలా రోజులు గడుస్తున్నాయి. శాంభవి కవిత మొహాల్లో నవ్వు దూరం అయిపోయింది. విసమేత్తయిన ఉత్సాహం కనిపించట్లేదు, కవిత అయితే ఏదో బాబు కోసం భారంగా బతుకుతున్నట్టే బతుకుతుంది,ఆరు నెలల తర్వాత విడాకులు వచ్చేసాయి, కిరణ్ వేరే చోట కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు,తల్లి భార్యల భాధకరమైన మొహాల్ని చూడలేక పోతున్నాడు, అందుకే  కొన్ని రోజులు ఇంటికి ఆ వాతావరణానికి దూరంగా ఉండాలి అనుకున్నాడు.

ప్రతి నెల ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు, కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవడం కవితకి నచ్చట్లేదు, ఒకరోజు అత్తయ్య నేను ఉద్యోగం చేస్తాను, ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దు అని చెప్పండి, అని చెప్పడంతో కాస్త ఆలోచించు కవిత, వాడి నుంచి విడిపోయిన ఆ డబ్బు తీసుకునే హక్కు నీకుంది, అది కాక పోయినా నా కొడుకు గా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాడిదే కదా అని శాంభవి అనడంతో, చూడండి అత్తయ్య ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను, ఇప్పుడు ఒక కూతురిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే, ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు.మీరు నన్ను నా కొడుకే పోషించాలి అని మీరు అనుకుంటే గనుక మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఉండండి, లేదా నన్ను ఎక్కడికైనా వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను, మీరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.
నేను భార్యగా పనికిరాకుండా అతని దృష్టిలో దిగజారి పోయాను, అతను నెల నెల ఇచ్చే డబ్బు తీసుకుని ఇంకా దిగజారి పోవాలి అనుకోవట్లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నాకు జీవితాంతం అమ్మలా తోడుగా ఉంటారనే అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పోయింది కవిత.

ఒక క్షణం శాంభవి నిర్ఘాంతపోయింది, కానీ కోడలి అంతర్యం అర్థమైంది, ఆమె తన జీవితాన్ని తాను సొంతంగా తన కాళ్ళమీద తాను నిలబడి జీవించాలి అనుకుంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ కిరణ్ కి ఫోన్ చేసి  నువ్విక నెల నెల డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు, అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది, కిరణ్ వెంటనే ఫోన్ చేసి ఏం జరిగింది అమ్మ, అదేంటి డబ్బులు పంపించపోతేఎలా, కవిత కోసం కాకపోయినా నీకోసం,నాకొడుకు ఉన్నాడు వాడి కోసం పంపించొద్ధా అని అడిగాడు కోపంగా.
శాంభవి కూడా అంతే కోపంగా విడాకులు నీభార్యకి ఇస్తే నీ కొడుకుకి నీ తల్లికి కూడా ఇచ్చినట్టే ఈ విషయం నీకు నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను నీకే సరిగ్గా అర్థం కాలేదు మా అత్త కోడళ్ళ భాధ, ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది, ఇంకో విషయం చెప్తున్నా మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా ఇక నీకు హక్కు ఉండదు తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలకు కిరణ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు పిచ్చి పట్టినట్టు అయింది,

అన్నట్టుగానే కవిత ఓ మల్టీ నేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరింది, తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంటె, కానీ మొహమాటం ఎక్కువ, అందుకే ఎక్కువ ఎవరితోనూ కలవలేదు ఎక్కువగా మాట్లాడలేదు, తన పనేదో తానే అన్నట్టు, తను చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉంటుంది, నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి,  ఉద్యోగానికి, అలవాటు పడుతోంది, ఇప్పుడు కవిత ఆరాటం అంతా తన బాబుని సవ్యంగా మంచి మనిషిలా పెంచాలనే, శాంభవి కూడా కొడుకుని మర్చిపో లేకపోయినా, కోడల్ని మనవడినీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది,

అలా ఒక సంవత్సరం గడిచింది,కానీ కిరణ్ పరిస్థితి వేరుగా ఉంది, ఏదో ఆనందాన్ని ఫ్రీడంను ఆశించి కవితకు విడాకులు ఇచ్చేసిన కిరణ్ మనశ్శాంతిగా ఉండలేక పోతున్నాడు,కవితతో కలిసి ఉన్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు కానీ, ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైనది కోల్పోయిన భావన, కవితకి విడాకులు ఇచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది, ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవాల్సింది, తొందరపడి ఆమెని ఆమెతో
పాటు అమ్మని కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలువనివ్వడం లేదు, ఇక ఏమైతే అదే అయ్యింది, కవితను క్షమించమని మనం కలిసుందాం అడగాలి, అనుకుంటూ వాళ్ల ఊరికి వచ్చేసాడు.

తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు, కవిత ఇంట్లో లేదు, నేను తప్పు చేశాను అమ్మ నన్ను క్షమించండి, నేను కవితతోనే కలిసి ఉంటా నువ్వు తనకి నచ్చచెప్పు అమ్మ, నా పొరపాటు నాకు తెలిసొచ్చింది బంగారం లాంటి భార్యను కాదనుకుని వెళ్ళాను, నన్ను క్షమించు అమ్మా అంటూ కిరణ్ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు, తల్లి మనస్సు కరిగింది  కానీ, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను,కానీ కవిత వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి.

కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరి ఎక్కువ సాగదీయకుండా ఆమెకు క్షమాపణలు చెప్పి, ఇప్పటివరకు నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే ఒక్క అవకాశం ఇవ్వు అంటూ బ్రతిమాలాడు కిరణ్, ఆమె చిన్నగా నవ్వింది ఎప్పటిలాగే నిశ్చలంగా మౌనంగా, నేను ఒక నసున్న మనిషిని, మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవడానికి,మీరు కలసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవడానికి నేనేమీ బ్యాటరీ లతో నడిచే బొమ్మని యంత్రాన్ని కాదు, మనిషిని, నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి, నేను మీకు అవసరం లేదు భార్యగా నేను పనికి రాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీదృష్టిలో, మళ్లీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు, మనస్ఫూర్తిగా ప్రేమించటం ఒక్కసారే జరుగుతుంది.
ఒకసారి అవతలి వ్యక్తి మీద మనసు విరిగిపోయింది అంటే అతుక్కోవడం దుర్లభం, మళ్లీ మళ్లీ మోసపోవడానికి, మనసుని చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను, నన్ను క్షమించండి, మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని, మీ కొడుకుని చూసుకోవచ్చు, అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ భార్యగా మాత్రం ఈ జన్మ లో నేను మీతో కలిసి ఉండలేను, ఆ బంధం మీరు నాతో కలిసి విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్చిన్నం అయిపోయింది, ఈ విడిపోయిన బంధాన్ని నేను మళ్లీ కలుపుకోలేను, నన్ను దయచేసి క్షమించండి, అంటూ తను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు ఇక మీరు దయ చేయొచ్చు అన్నట్టుగా, లోపలికి వెళ్లి పోయింది కవిత అదే తన నిర్ణయం అన్నట్టుగా, శాంభవి కొడుకు వంక నిరసనగా చూస్తూ నా కోడలు నిజమే మాట్లాడింది, నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని కానీ నువ్వు వినలేదు,  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పెద్దగా ఉపయోగం ఉండదు, కాలకముందే కాలకుండా జాగ్రత్త పడాలి, నీలాంటి కొడుకుని కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాతాప పడతాను, నా మనవడిని అయినా సరిగ్గా పెంచుతాను నీలా తయారు కాకుండా అంటూ, ఇక నువ్వు బయలుదేరవచ్చు, మళ్లీ ఎవరైనా చూస్తే బావుండదు, విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు, నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేను, అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది, నన్ను క్షమించండి అత్తయ్య అంది లోపలికి వచ్చిన శాంభవి తో కవిత కన్నీళ్లతో, కోడల్ని ఓదార్పుగా నేను నీ తోడుగా ఉన్నానంటూ దగ్గరికి తీసుకుంది శాంభవి, కిరణ్ నిరాశగా వెనుదిరిగాడు
తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ, కొంతకాలం తర్వాత అయినా కవితలో మార్పు వచ్చి తనని క్షమించి తనని చేరాలని కోరుకుంటూ….
చూద్దాం కాలం ఎలాంటి మాయ చేస్తుందో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!