అందరి దైవం అమ్మ
రచన : జి.ఎల్.ఎన్.శాస్త్రి
అమ్మపొత్తిళ్ళలో నువ్వు ఆడి
గుండెలపై నీ పాదతాడనం చేసినప్పడు,
అమ్మ పడే వేదన నీకుతెలియదు,
పాలపంటితో ఎన్నెన్ని గాయాలు చేసినా
సున్నిత హ్రదయాల తియ్యటి వేదనలే
దేవుడు తాను అందరి దగ్గర ఉండలేక,,
అమ్మను సృష్టించాడు
ఆదుకొనేశక్తి, ఇంటిని నేర్పుగా మలచే యుక్తి,
కలిపి బంగారు బొమ్మగా మార్చి లోకానికి పంపాడు.
ఆమె అగస్త్యభ్రాత అన్ని పనులు ఆమెవే,
పేరు మాత్రం ఉండదు,
జీతం బత్తెం లేని జీవితం,
అలుపు సొలుపు లేని మలుపులు తెలియని,
చిరుబొజ్జ నింపు తియ్యటి గోరు ముద్దలు,
మాధుర్యము పంచు తేనెల మూటలు
వడిలో లాలించు జాబిలి మాటలు,
ముద్దు,ముద్దు అడుగులకు ఒద్దికైన రంగవల్లులు,
జీవన నావకు దారిచూపే దిక్సూచులు,
నవయగానికి నాంది చూపే వెలుగులు,
హృదయాoధకారము తొలగించు దివ్వెలు,
అందరి దైవం అమ్మ,ఈలోకానికి పట్టుగొమ్మ.
***