దైవం మానుష రూపేణ

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

దైవం మానుష రూపేణ

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

సుమారు ఏభై సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. నేను మూడు మైళ్ళ దూరంలో ఉన్న కళాశాలకు స్నేహితులతో కలసి సైకిల్ మీద వెళ్ళే వాడిని. అమ్మ నాన్నలకు ఆఖరి సంతానం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అని రోజు చెప్పేవారు.
కళాశాలకు మధ్యలో రోడ్డు ప్రక్కన ఉన్న అభయాంజనేయుని దర్శించుకుని స్నేహితులతో కళాశాల కు వెళ్ళడం అలవాటు.
ఆవిమండు వేసవి పొద్దున్న ఎండ కాచిన మధ్యాహ్నం దట్టమైన మబ్బులు, గాలితో వాన పడేది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టీకల్స్ మా బ్యాచ్ కు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు. నేను,నా స్నేహితుడు ఈశ్వర్ సైకిల్ పై డబుల్స్ వెళుతున్నాము. నేను తొక్కితే వాడు వెనుక కూర్చున్నాడు. ఒంటిగంటకు ఇంటిదగ్గర బయలుదేరి ఆంజనేయస్వామి కోవెల దగ్గరికి వచ్చినప్పుడు మబ్బులతో, గాలి మొదలయింది. స్వామి వారి దర్శనం చేసుకుని బయలు దేరిన కొద్ది సేపటికి వేగంతో వస్తున్న లారీ ని తప్పించుకునే ప్రయత్నం లో ఇద్దరం కింద బడి దెబ్బలు తగిలి మా అట్టలు బాక్స్ లు చెల్లా చెదురై పడిపోయాయి.ఈశ్వర్ కి పంటి వెంట నెత్తురు కారుతోంది. మొత్తం మీద గాలి వీస్తున్న అట్టలు, హాల్ టికెట్ పెన్నులు పెట్టిన బాక్స్ లు పెడుతున్నప్పడు పరీక్షకు ఇక ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ఈశ్వర్ గాభరాగా, ఒరే నీ హాల్ టికెట్ కనిపించట్లేదు అనగానే నా గుండెల్లో ఆదుర్దా చూడాలి వెతుకుతున్న మమ్మల్నిద్దరిని కాషాయ వస్త్రాలతో ,గడ్డంతో ఉన్న సాధువు వచ్చి హాల్ టికెట్ ఇచ్చి అయ్యో రామయ్య దెబ్బలు తగిలేయే అని ఇద్దరిని స్పృశించి ఏదో చదవగానే మా నొప్పులు మటుమాయం. వాడి పంటి వెంట రక్తం రాలేదు. మేము సైకిల్ ఎక్కి వాడు కూర్చుని వెనక చూస్తే ఆ మహానుభావుడు అసలు కనిపించలేదు. అపుడు ఆంజనేయ స్వామియే అతను ఆ రూపంలో వచ్చాడని అనుకుని తరువాత కెమిస్ట్రీ ప్రాక్టీకల్స్ కి వెళ్ళడం పరీక్షలో ఉత్తీర్ణత చెంది నేను రసాయన శాస్త్ర ఆచార్యునిగా, క్రిత సంవత్సరం లోకాన్ని వీడి శ్రీరామచంద్రుని దరి చేరిన ఈశ్వర్ బ్యాంకు అధికారిగా జీవనయాత్ర కొనసాగించాము. అందుకే ఇప్పటికీ నేను అనుకుంటాను” దైవం మానుష రూపేణ” అన్నది యథార్థం. ఈ మిరాకిల్ ఏడు పదుల దరిచేరిన నాకు జీవితంలో మరువలేనిది.

లోకా సమస్తా సుఖినో భవంతు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!