దారి చూపిన దేవుడు

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

దారి చూపిన దేవుడు

రచన: సావిత్రి కోవూరు 

18 ఏళ్ల క్రితం అంటే 2003 నవంబర్ లో జరిగిన సంఘటన. 18 ఏళ్ల క్రితం మా అమ్మాయి వాళ్లు అమెరికాలో ‘సియాటిల్’ దగ్గర ‘లాంగ్ వ్యూ’ అనే ప్లేస్ లో  ఉండేవాళ్ళు. తను తల్లి కాబోతున్నందువల్ల నన్ను, మా వారిని అమెరికా రమ్మన్నారు.
మా వారు ఆఫీసులో పనుల ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల తాను రాలేనని నన్ను ఒక్కదానినే వెళ్ళమన్నారు. అప్పటి వరకు నేను స్కూల్ కు తప్ప మావారు వెంట లేకుండా ఒక్క దానిని ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది దేశం కాని దేశం, తెలియని మనుషుల మధ్య, మధ్యలో సింగపూర్, తైపేలలో మూడు విమానాలు మారుతూ అంత దూరం వెళ్లాలంటే చాలా భయము, కంగారు మొదలైంది.
అయినా తప్పదు కనుక స్కూల్లో లీవ్ పెట్టుకున్నాను. వీసా కూడ వచ్చింది. కానీ మా అమ్మాయి నేను అనుకున్న టైం కంటే ఒక వారం రోజులు ముందే రమ్మని చెప్పడంతో, మళ్ళీ లీవ్ అప్లై చేసి, ఎన్. ఓ. సి కి అప్లై చేసి నానా యాతనలు పడ్డాం. డి. ఇ. వో ఆఫీస్ కి, డైరెక్టరేట్ ఆఫీస్ కి డేట్ మార్చడానికి ఎన్ని సార్లు తిరిగామో చెప్పలేము. ఆ విధంగా బోలెడు టైమ్ వృధా అయ్యింది. ప్రయాణం డేట్ దగ్గరకొస్తుందంటే టెన్షన్ ఈ లోపల ఎన్.ఓ.సి వస్తుందా లేదా అని. తిరిగి తిరిగి చివరికి సాధించాం. దానివల్ల మాకు షాపింగ్ చేయడానికి గాని, సర్దుకోవడానికి గాని టైం దొరకలేదు. అప్పటి నుండి షాపింగ్ పనులు మొదలు పెట్టాను. అవి వెళ్లే రోజు వరకు సాగుతూనే ఉన్నాయి.
మావారు నన్ను ఒక్కదానివే పంపిస్తున్నానని ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో, అంత మంది దేవుళ్ళకి ప్రయాణం సక్రమంగా సాగాలని మొక్కుకున్నారు. అందుకని పది రోజుల ముందు తిరుపతి, శిరిడీ తీసుకెళ్లారు.
వెళ్ళడానికి ఒక్కరోజు ముందు మా చెల్లి, మా మరిదిగారు, నేను, మా వారు తెల్లవారుజామున చిలుకూరు గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంటికి రాకుండానే అటునుంచటే (అప్పుడు రింగ్రోడ్ లేదు) సికిందరాబాద్ వచ్చి, మళ్ళీ యాదగిరిగుట్ట వైపు వెళ్ళాము. యాదగిరిగుట్టకు వెళ్లేసరికి పూర్తిగా అలసిపోయి ఉన్నాము. మేము వెళ్ళేసరికి సాయంత్రం నాలుగయ్యింది.
అక్కడ దేవుని దర్శనం చేసుకొని, లంచ్ చేసి, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడుతోంది. అలాగా ఘట్కేసర్ వరకు వచ్చేసరికి రోడ్డుపైన ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉంది. విషయమేమిటని కనుక్కుంటే ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ ఊరి  పిల్లవాడు బస్సు కింద పడి చనిపోయినాడట. అందుకని ఊరివాళ్లంతా రోడ్డుపై కూర్చొని వాహనాలను కదలనివ్వకుండా ఆపేస్తున్నారు.
ఆ రోడ్డు అప్పుడు చాలా చిన్నగా వుండేది. మా కారు ముందర ఎన్నో వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. వెనక చూస్తే ఎక్కడ వరకు వాహనాలు ఆగి పోయి ఉన్నాయో కనిపించట్లేదు. అంటే మా కారు ముందుకు గాని, వెనుకకు గాని కదిలే వీలు లేదు. రోడ్డుకిరు వైపులా గుబురుగా జొన్న చేలు ఉన్నాయి. అక్కడ నుండి వెళ్ళడానికి వేరే దారి కనిపించడం లేదు.
మేము ఉదయం నుండి తిరుగుతూ ఉండడం వల్ల బాగా అలసిపోయి ఉన్నాము. తెల్లవారితే నా ప్రయాణం అసలు ఏమి సర్దుకోలేదు. అన్ని సూట్కేసులో సర్దుకోవడం, వెయిట్ చూడడం, బంధువులు, అమెరికాలో ఉన్న వాళ్ల వాళ్లకి ఇవ్వమని తెచ్చిన వస్తువులు సర్దడం ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని జనరల్  మెడిసిన్స్ రాయించుకుని తెచ్చుకోవాలి.
ఇంకా నేను మొదటి సారి ఒక్కదాన్ని వెళుతున్నానని, మా చుట్టాలు అందరూ కూడా నన్ను కలవడానికి ఇంటికి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసంతా గందరగోళంగా ఉంది.
తొందరగా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామంటే గంట నుండి చీకట్లో రోడ్డుపైన పడిగాపులు. వెనక సీట్లో కూర్చుని నేను మా చెల్లెలు మాట్లాడుకుంటున్నాం. మాటల్లో “యాదగిరిగుట్ట స్వామి వారి ప్రసాదం మనము తినలేదు, అందుకే ఇలా పరీక్షలు పెడుతున్నాడు దేవుడు” అని అన్నాను నేను మా చెల్లితో.
“ఈ ప్రసాదం తింటే మనకి దారి చూపుతాడు ఆ భగవంతుడు” అని జోక్ చేశాను.
తర్వాత ప్రసాదం తీసి నలుగురం తిన్నాం. తింటూ “స్వామి వారి మహత్యం వల్ల ఏదైనా మార్గం కనిపించవచ్చు” అన్నాను నేను మళ్ళీ నవ్వుతూ.
మా వారు, మా మరిదిగారు “అంత పెద్ద భారం దేవునిపై పెట్టకు” అన్నారు నవ్వుతూ.
నేను ఇంక కొంచెం ప్రసాదం తీసి వాళ్ళ ముగ్గురికి పెట్టి నేను కొంచెం తిన్నాను. ఇలా తిన్న రెండు నిమిషాలకే పక్కనున్న పొలం లోంచి వెలుతురు కనిపించింది ఏదో వాహనం వస్తున్నట్టు. అక్కడ చూస్తే అసలు రోడ్డు ఉన్నట్టే కనిపించట్లేదు. జొన్ళ చేలు గుబురుగా వున్నాయి.
వెంటనే మా వారితో “ఏమండి అక్కడేదో దారి ఉన్నట్టుంది చూడండి ఏదో వెహికిల్ వస్తున్నట్టుంది. వెలుతురు కనిపిస్తుంది” అన్నాను.
మా వారు కారు దిగి ఆ వెహికిల్ వస్తున్న వైపు వెళ్లి ఆ వాహన డ్రైవర్ తో “ఇటు నుండి వెళ్ళడానికి దారి ఉందా” అని అడిగారు.
అతను “ఉంది సార్ రోడ్డు అంత బాగా లేదు కానీ వెళ్ళొచ్చు” అన్నాడు.
వెంటనే అక్కడ వాహనాలు ఎక్కువగా కాకుండా వెంటనే బయట పడాలని ఆత్రుత తో మెల్లగా ఆ దారి వైపు  కారును మళ్ళించారు. చిన్నగా ఉన్న బండ్ల దారి లాంటి దారిలో మెల్లమెల్లగా డ్రైవ్ చేస్తూ ఆ వూరు దాటి మెయిన్ రోడ్డు జాయిన్ అయ్యాము.
నేను నవ్వుతూ “చూసారా మనం ప్రసాదం తిన్న రెండు నిమిషాలకి దేవుడు దారి చూపెట్టాడు” అన్నాను.
మా వారు “దేవుడు సీరియస్ గా విని మనము మొర ఆలకించాడు. లేకపోతే అక్కడ గంట పైన ఉన్న మనం, మనకు అప్పటి వరకు అక్కడ దారి ఉన్నట్టు తెలియనే లేదు. ఆ దారిన ఎవ్వరూ రాలేదు, పోలేదు కూడా. మనం ప్రసాదము కళ్ళకద్దుకుని తినగానే దారి చూపెట్టాడు ఆ దేవుడు” అన్నారు నవ్వుతూ.
నాకు ముందు నుండి యాదగిరిగుట్ట స్వామి పై నమ్మకం ఎక్కువే , కానీ ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఇంకా నమ్మకం ఎక్కువైపోయింది.
ఆ విధంగా బయటపడి ఇంటికి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారు జామున లేచి అన్ని సర్దుకోవడం మొదలుపెట్టాము. నేనేమీ సర్ద లేదనుకోండి. నేను ఒక దానిని వెళుతున్నానని చాలామంది బంధువులు వచ్చారు మా ఇంటికి.  వాళ్ళు, మా పెద్దమ్మాయి, మా అల్లుడు అందరు కలిసి నా బట్టలు సామాన్లు అన్నీ సర్దీ, వెయిట్ చూసి రెడీ చేశారు. ఎంతో భయంభయంగా కంగారుగా నా మొదటి అమెరికా ప్రయాణం అలా సాగింది.

( పై సంఘటన నా జీవితంలో జరిగినదని హామీ ఇస్తున్నాను )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!