అనుకోని ప్రమాదం

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

అనుకోని ప్రమాదం

రచన: వడలిలక్ష్మీనాథ్

ఇది మా చిన్నప్పుడు 1975 సంవత్సరం ప్రాంతంలో జరిగిన విషయము. వేసవి సెలవులకని హైదరాబాదు నుండి మా అమ్మమ్మ గారి ఊరైన రాజమండ్రికి వెళ్లేము. అప్పుడే మా మావయ్య అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలము తీసుకున్నారు. ఆరోజు శంకుస్థాపన ఉంది. తెల్లవారుజామున పెద్దవాళ్లతో పాటు పిల్లలమందరమూ రిక్షాలలో బయలుదేరి వెళ్ళాము. ఆ ప్రాంతం ఊరికి విసిరేసినట్టుగా దూరంగా ఉంది. ఆ ప్లాటు గోదావరినది నుండి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉదయమే లేచిన పెద్దవాళ్లు, అందరికీ కావాల్సిన తిండి పదార్థాలు చేసుకొని అక్కడికి రిక్షాలలో బయలుదేరి వెళ్ళాము. పదిమంది పిల్లలు దాక ఉంటాము. ఆ ప్రాంతంలో ఇళ్లు దూరం దూరంగా విసిరేసినట్టుగా వున్నాయి.
ఇల్లు కట్టడానికి ఇసుక తెప్పించి కుప్పలుగా పోసి ఉంచారు. పిల్లలందరమూ ఇసుక కుప్పల మీద దొర్లుతూ శంకాలు, ఆల్చిప్పలు ఏరుకుంటూ ఆడుకొంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఒక పది సంవత్సరాల లోపు పిల్లవాడు వచ్చి మాతో పాటు ఆడుకోసాగాడు. వాడిపేరు అడిగితే కృష్ణ అని చెప్పాడు.
పొద్దున్నే భూమి పూజ చేసాక, బావి తవ్వడం మొదలుపెట్టారు. గోదావరి నది దగ్గరగా ఉండటంతో, సాధారణంగా ఆ ప్రాంతంలో ఓ పది అడుగుల దూరం వెళ్లేసరికి నీరు జలధార తగులుతుంది.
పెద్ద వాళ్ళందరూ మిగిలిన కార్యక్రమాలలో ఉంటే, మేమందరం ఆడుకుంటూనే ఉన్నాము. సాయంత్రము చీకటి పడుతోంది. ఆడవాళ్లందరూ పిల్లలకి అన్నము వండాలని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు.
పిల్లలమందరమూ దాక్కొనే ఆట ఆడుకొంటున్నాము. కృష్ణ కూడా మాతోనే ఎగురుతూ, గెంతుతూ ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఏడున్నర అయ్యేసరికి బాగా చీకటి పడింది. బావిలో పదిహేను అడుగులు లోపలికి తవ్వినా నీరు పడలేదు. బావి తవ్వడానికి సాధారణంగా ఆ ప్రాంతంలో ఒక్కరోజులోనే పని అయిపోతుంది. బావిలో నీటి చుక్క తగలకపోవడముతో మర్నాడు పొద్దున్నే వస్తామంటూ పనివాళ్ళు వెళ్ళిపోయారు.
మామయ్యతో పాటు ఉన్న పెద్దవాళ్లకి, నీరు పడకపోవడం అశుభంగా తోచింది. రిక్షాలని పిలిచిన మావయ్య “ఆడిన ఆటలు ఆపి, ఇంటికి పదండి” అంటూ మమ్మల్ని రిక్షాలు ఎక్కించాడు.
ఆ హడావిడిలో మేము కృష్ణ సంగతి పట్టించుకోలేదు. ఇంటికొచ్చి స్నానం చేసి, అందరమూ అన్నము తిని, అమ్మమ్మ చెప్పే కథలు వింటూ ఉన్నాము. అప్పుడు సమయము రాత్రి 11:30 అయింది. ఇంత లోపల ఎవరో పరుగులు పెట్టుకుంటూ వచ్చి
“మీరు అక్కడ ఇల్లు కడుతున్నారు కదా!” అని అడిగారు.
అవునని చెప్పాడు మామయ్య.
“మా పిల్లవాడు కృష్ణ పొద్దునుంచి మీ పిల్లలతో ఆడుకున్నాడు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు” అని చెప్పాడు వచ్చిన వాళ్లలో ఒకతను.
మా మావయ్య అందర్నీ నిలబెట్టి “ఆ పిల్లవాణ్ణి చివరి సారిగా ఎవరు చూశారు” అంటే అందరమూ నోరెళ్ళబెట్టాము. అందరమూ ఆడుకుంటూ హడావుడిలో ఇంటికి వచ్చేసాము. కృష్ణ ఎంతసేపు మాతో ఆడుకున్నాడు అనే విషయం కూడా క్లారిటీ లేదు. దాంతో ఎవరము చెప్పలేకపోయాము. దానికి వచ్చినాయన,
“మీరు పెద్దవాళ్ళు కదా! అందరు పిల్లల్ని చూసుకోవాలి కదా” అంటూ గాభరా పడి ఏడుపు లంకించుకున్నాడు.
“కంగారు పడకండి. అక్కడికి వెళ్ళి వెదుకుదాము” అంటూ బయలుదేరదీసాడు మావయ్య.
అందరూ కలిసి టార్చ్ లైట్ లు పట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్లారు. అప్పుడు అక్కడ బావిలోంచి ఎవరో నీళ్ళలో మునిగి లేస్తున్న శబ్దాలొస్తున్నాయి. ఆ శబ్దం విన్న కృష్ణ బంధువులు గట్టిగా ఏడుపు మొదలుపెట్టారు.
“కంగారు పడవలసిన అవసరం లేదు. అందులో నీరు పడలేదు. అది ఖాళీ బావి” అని చెప్పారు మావయ్య.
తీరా టార్చ్ లైట్ వేసి చూస్తే, ఐదు అడుగుల లోతు వరకు నీటితో నిండి ఉంది. నీటిలో కదలికలు బాగా ఉన్నాయి. రాన్రాను ఆ శబ్దాలు వినిపించడం కూడా ఆగిపోయాయి. ఆశ్చర్యంగా సాయంత్రం వరకు లేని నీళ్లు, వచ్చి చూస్తే ఉండడం, ఈ పిల్లవాడు కనిపించక పోవడం ఏమిటి? అనుకొన్న మావయ్యకు నోటిమాట రాలేదు.
అంతే వాళ్లు పెద్దగా ఏడుపు మొదలెట్టారు. అక్కడ బావిలోకి దిగగల మనుషులు ఎవరూ లేరు.
మా మావయ్య “దగ్గరలో ఎవరైనా బావిలోకి దిగగలవారు ఉంటే తీసుకుని వస్తానని” బయలుదేరి వెళ్లారు.
బావిలో శబ్దాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చొని ఏడుస్తున్నారు. అప్పటికి తెల్లవారుజామున రెండు గంటలు అయింది.
“ఆడుకొనే పిల్లవాడుకి ఇలా ప్రాణాపాయాన్ని వరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు” అంటూ ఏడుపు లంకించుకున్నారు వచ్చిన వాళ్ళు.
ఆ విషయం తెలిసిన మా అమ్మమ్మ ఇంట్లో దేవుళ్లకు పూజలు చేయడం మొదలెట్టింది. “ఎలాగైనా వాళ్ళ పిల్లవాడిని వాళ్ళకి రక్షించి ఇవ్వండి” అంటూ ఇంట్లో వాళ్ళు ఏడుపులు.
నాలుగు గంటల వేళ మామయ్య వచ్చాడు. ఎవరూ దొరకలేదు అంటూ.. “ఇంకో గంటలో అయితే ఎవరైనా దొరుకుతారు” ఆ మాటలకి వచ్చిన వాళ్ళు ఒకటే ఏడుపు.
అందరమూ ఎలా తెల్లవారుతుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంట్లో అమ్మ, పెద్దవాళ్లందరూ భగవంతుని ప్రార్థించడం మొదలెట్టారు. కృష్ణకి ఏమీ కాకుండా ఉండాలి అని అందరి మనసులో ఒకటే కోరిక.
తెలతెలవారుతూనే మామయ్య మళ్లీ ప్రయత్నంగా బావిలోకి దిగడానికి మనుష్యులను తీసుకురావడానికి వెళ్లారు. మేమందరం కూడా మామయ్య వెంట వద్దన్నా పరిగెత్తుకుంటూ వెళ్లాము. మాకు అందరికీ గుండెల్లో దడ. మనుషులు దొరికారు. వచ్చిన మనుషులు బావి లోపలికి దిగారు.
కృష్ణ తాలూకు తల్లిదండ్రులు, చుట్టాలు చాలామంది అక్కడికి వచ్చి ఒకటే రోదనలు, అవి ఆకాశాన్నంటుతున్నాయి.
మా అమ్మ “పిల్లలు! మీరు ఇంటికి వెళ్లిపోండి” అని కంగారుపడుతోంది.
కానీ, మేము “వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము” అంటూ అక్కడే ఉన్నాము. మా పిల్లలందరికీ కళ్ళమ్మట నీళ్ళు రావడం మొదలెట్టాయి.
బావిలో దిగిన ఈతగాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఒకసారి వాళ్లు పైకి వచ్చి “లోపల పిల్లవాడు ఏమీ కనపడటం లేదు” అని చెప్పాడు.
దానికి కృష్ణ తండ్రి “రాత్రి కృష్ణ కోసం వచ్చినప్పుడు, ఆ బావిలోంచి పిల్లాడు దుముకుతున్న శబ్దాలు వినిపించాయి. స్పష్టంగా పిల్లాడు అప్పుడు ప్రాణంతోనే ఉండి, పైకి రావడం కోసం చేసిన ప్రయత్నం చేసి ఉంటాడు. వెతకండి” అంటూ ఏడుపు మొదలెట్టారు.
అప్పుడే చిత్రంగా కృష్ణ అక్కడే పక్కన బావికోసం తెచ్చిన వరలు అవే రింగుల్లోనుండి కళ్ళు నులుముకుంటూ లేచాడు.
అందరూ “ఏమైంది? ఎక్కడున్నావు? ” అని కృష్ణని అడిగితే, “రాత్రి అందరూ వెళ్లిపోయారు. ఇంటికి వద్దామని బయలుదేరినప్పుడు కుక్కలు వెంట పడితే, వాటి నుంచి తప్పించుకొనేందుకు ఇందులోకి దిగాను” అంటూ చెప్పాడు.
అలా దిగిన కృష్ణ అందులో నిద్రపోయాడు. విషయం తెలుసుకున్న పెద్దలు కృష్ణని అక్కున చేర్చుకొని, గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
“మరి బావిలో నీరు, ఆ శబ్దాలు ఏంటి?” అంటూ మామయ్య అడిగిన ప్రశ్నకు
“నీటి జల ప్రవాహమార్గం తోసుకొని, తవ్విన బావి లోపలికి వచ్చింది. ఆ నీరు పడ్డ శబ్దానికి , కృష్ణ కనిపించక పోవడానికి అన్వయించుకొని మీరు అందరూ కృష్ణ బావిలో పడిపోయాడు ఆనుకొని కంగారు పడ్డారు” అని బావిలో దిగిన మనుషులు చెప్పారు.
అమ్మమ్మ మాత్రం తన పూజల వల్లనే అంతా శుభం జరిగిందని అందరికీ కథలుగా చెప్పేది.

You May Also Like

One thought on “అనుకోని ప్రమాదం

  1. హమ్మయ్య కృష్ణ బాగానే ఉన్నాడు.. వాడికి ఏమైందోనని నేను కూడా కంగారు పడ్డాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!